Asian Men's Hockey: దాయాది దేశాల మధ్య అత్యంత ఆసక్తి రేపిన  క్రికెట్  పోరు  వర్షం కారణంగా నీరుగారిపోయినా  హాకీలో మాత్రం మనోళ్లకు ఎదురులేదు. పాకిస్తాన్‌పై భారత హాకీ జట్టు ఘనవిజయాన్ని అందుకుని టోర్నీ విజేతగా నిలిచింది.  క్రికెట్‌‌లో మాదిరిగానే  అభిమానులను అత్యంత ఉత్కంఠకు గురిచేసిన పోరులో  భారత్.. షూటౌట్‌లో  పాక్‌ను మట్టికరిపించింది. శనివారం సలాలా (ఓమన్) వేదికగా ముగిసిన  ఆసియా కప్ ఫైవ్స్ హాకీ టోర్నమెంట్‌లో భారత్..  2-0 (4-4) తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి టోర్నీ విజేతగా నిలిచింది. 


శనివారం ఆద్యంతం  ఆసక్తికరంగా సాగిన  పోరులో  తొలుత   నిర్ణీత సమయంలో ఇరు జట్లూ 4-4తో నిలిచాయి.    ఆట ఆరంభమైన  ఐదో నిమిషంలోనే  పాకిస్తాన్ ఆటగాడు అబ్ధుల్ రెహ్మాన్ గోల్ కొట్టి పాకిస్తాన్‌కు ఖాతా తెరిచాడు.  కానీ భారత్ కూడా వెంటనే పుంజుకుంది. భారత ఆటగాళ్లు జుగరాజ్ ఏడో నిమిషంలో మణిందర్ సింగ్ 10వ నిమిషంలో గోల్స్ చేసి భారత ఆధిక్యాన్ని 2-1కు పెంచారు. అయితే పాకిస్తాన్  కూడా తక్కువేమీ తినలేదు. ఫస్టాఫ్ లోనే మరో మూడు గోల్స్ చేసి ముందంజలోకి  దూసుకెళ్లింది.  ఆ జట్టు తరఫున  13వ నిమిషంలో అబ్దుల్, 14వ నిమిషంలో హయత్, 19వ నిమిషంలో హర్షద్‌లు  వరుసగా గోల్స్ చేసి  4-2 ఆధిక్యాన్ని సంపాదించారు. 


పాకిస్తాన్  దాడికి భారత్ కూడా ధాటిగానే బదులిచ్చింది.  టీమిండియా  ప్లేయర్ రహీల్.. 19, 26వ నిమిషంలో గోల్ చేయడంతో   స్కోరు 4-4 తో సమమైంది.  కానీ ఆ తర్వాత  అటు పాకిస్తాన్ గానీ ఇటు భారత్ గానీ మళ్లీ గోల్ చేయడంలో విఫలమయ్యాయి. ఇరు జట్లూ దుర్బేధ్యమైన డిఫెండ్‌తో ముందుకుసాగాయి. రెండో అర్థ భాగంలో కూడా  ఇరు జట్లూ హోరాహోరి పోరాడినా  ఒక్కరు కూడా గోల్స్ చేయలేకపోయారు.  దీంతో మ్యాచ్‌లో షూటౌట్ అనివార్యమైంది.  


షూటౌట్ సాగిందిలా.. 


విజేతను తేల్చే షూటౌట్‌లో  భారత ఆటగాళ్లు  గురుజ్యోత్ సింగ్, మణిందర్ సింగ్‌లు గోల్స్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపారు.  కానీ పాక్ తరఫున  బరిలోకి దిగిన అర్షద్, ముర్తజాలు గోల్స్ చేయడంలో విఫలమయ్యారు. దీంతో  మ్యాచ్‌లో భారత్ విజేతగా నిలిచింది. 


 






 






సెమీస్‌లో మలేషియాను ఓడించి.. 


ఫైనల్‌కు ముందు  సెమీస్‌లో మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా భారత జట్టు   సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించింది. సెమీస్‌లో  భారత్ 10-4 తేడాతో మలేషియాపై ఈజీ విక్టరీ కొట్టింది.  భారత్ తరఫున మహ్మద్ రహీల్ 9, 16, 24, 28వ నిమిషంలో  నాలుగు గోల్స్ చేశాడు.  మనీందర్ సింగ్ (2వ నిమిషంలో)  పవన్ రాజ్‌బర్ 13వ నిమిషంలో గోల్స్ చేయగా  సుఖ్వీందర్, దిప్సన్ టిర్కీ, జుగరాజ్ సింగ్, గురుజ్యోత్ సింగ్‌లు  కూడా తలా ఓ గోల్ చేశారు.  మలేషియా తరఫున ఇస్మాయిల్ అబు, అఖిముల్లా అనుర్ (2), ముమ్మద్ దిన్‌లు గోల్స్ కొట్టారు. ఫైనల్‌లో విజేతగా నిలవడంతో భారత జట్టు వచ్చే ఏడాది జరిగే హాకీ ఫైవ్స్ వరల్డ్ కప్‌కూ అర్హత సాధించింది. 





















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial