One Nation One Election :  దేశంలో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక ఎన్నికలకు కూడా ఒకే సారి ఎన్నికలు జరిపేలా సూచనలు చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  18వ తేదీ నుంచి జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై బిల్లు పెట్టే అవకాశం ఉంది. కానీ ఇది అంత సులువు కాదని సుదీర్ఘ కాలంగా జరుగుతున్న చర్చలు స్పష్టం చేస్తున్నాయి. 


సుదీర్ఘ కాలంగా జమిలీ ఎన్నికలపై చర్చలు
  
పార్లమెంట్‌కు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరపాలనేది కొత్త వాదన కాదు. గతంలో నీతి ఆయోగ్ సూచించింది. లా కమిషన్ ప్రతిపాదించింది. ప్రధానమంత్రి మోడీ కూడా అనేక సార్లు చెప్పారు. పదే పదే ఎన్నికలు వస్తూండటం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నది మోడీ వాదన. అయితే జమిలీ ఎన్నికలు వల్ల ప్రజాస్వామ్య మౌలిక స్వరూపం మారిపోతుంది. దేశాన్ని అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి.  లోతుల్లోకి వెళ్తేనే జమిలీ ఎన్నికల వచ్చే ఇబ్బందులు, సమస్యలు ఏమిటి అనేది తెలుస్తుంది. దేశంలో  ప్రతి ఏడాది ఏదో ఒక ఎన్నిక వస్తూనే ఉంటుంది. పార్లమెంట్, అసెంబ్లీ, మధ్యంతర, ఉపఎన్నికలు ఇలా… ఏదో రూపంలో ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ప్రభుత్వాలు ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాయి. దీని వల్ల దీర్ఘకాల అభివృద్ధిపై దృష్టి సారించలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంపైనే దృష్టి పెడుతున్నారు. ఫలితంగా ఎక్కడికక్కడ అభివృద్ధికి అడ్డుకట్ట పడుతోంది. పైకా ఖర్చు ఎక్కువ అవుతోంది. 


కానీ జమిలీ ఎన్నికలకు అనేక చిక్కులు !
 
భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం ఉంటాయి. అంటే కేంద్ర, రాష్ట్రాలతో పాటు స్థానిక సంస్థలకూ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.  దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. పార్లమెంట్ తో కలిపి 30 ఎన్నికలు ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే… ఐదేళ్ల పాటు ఎన్నికలు నిర్వహించకుడా ఉండలేరు. అలా అన్ని మళ్లీ అన్ని రాష్ట్రాలకూ నిర్వహించలేరు. ఇలా కాకపోయినా..పార్లమెంట్ లో ఓ పార్టీకి మెజార్టీ వచ్చి… నాలుగో, ఐదో రాష్ట్రాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే.. .. ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోతే.. వాటి పరిస్థితి ఏమిటి..? వాటి కోసం మళ్లీ మొత్తం ఎన్నికలు నిర్వహిస్తారా..? ఇలాంటి సమస్యలు చాలా వరకూ చర్చల్లోకి వచ్చాయి.  నీతిఆయోగ్ ముందు లా కమిషన్ ఓ ప్రతిపాదన పెట్టింది. అదేమిటంటే.. రెండున్నరేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుపుతామనేదే ఆ ప్రతిపాదన.  అప్పటి వరకూ రాష్ట్రపతి పాలన విధిస్తారు.  ఈ విషయాన్ని పార్లమెంట్ ఎన్నికలకూ అన్వయించినా సాధ్యం కాదని సులువు కాదని నిపుణులు చెబుతున్నారు.  దీనికి కూడా నిపుణులు ఓ పరిష్కారం చూపిస్తున్నారు. ఏదైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలన్నా… విశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నా.. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని నిరూపిస్తేనే.. ఆ అవిశ్వాస, విశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలనేది..ఆ పరిష్కారం. అంటే… మెజార్టీ లేకపోయినా.. ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చు. ఇది కూడా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి.. ఇవన్నీ ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదని  నిపుణుల విశ్లేషణ.  
 
పాక్షికంగా అధ్యక్ష తరహా ఎన్నికకు ప్రతిపాదిస్తారా ? 
 
ఎన్నికలు జరిగిన తర్వాత  పార్టీలు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేనప్పుడు.. గవర్నర్ ఎమ్మెల్యేలను పిలిచి.. మీ నాయకుడ్ని ఎన్నుకోమని అడగాలి.  అంటే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకోవచ్చు. జమిలీ ఎన్నికలనేదే సిద్ధాంతం.. ఆచరణలో సాధ్యం కాదనే అభిప్రాయం వినపించడానికిప్రధాన కారణం  రాజ్యాంగరీత్యా నిబంధనలు అంగీకరించకపోవడం. ఇప్పుడు జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఐదేళ్లకు ముందే..రద్దు చేయాలి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు… ఐదేళ్ల కంటే ఎక్కువ సమయం కొనసాగించే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల జమిలీ ఎన్నికల వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి.  మొత్తంగా కాకపోయినా పాక్షిక జమిలీకి వెళ్లానుకుంటే   ఐదు నెలల ముందు.. ఐదు నెలల తర్వాత ఎన్నికలు జరిగే తొమ్మిది రాష్ట్రాలను ఒప్పించాల్సి ఉంటుంది.  ఇందుకు ఏపీ, ఒడిషా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.  అదే విధంగా ఐదు నెలల ముందు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 13 రాష్ట్రాలను కలుపుకుని వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కు తొలి అడుగు పడొచ్చు. 


అనేక సందేహాలకు కోవింద్ కమిటీ సమధానం ఇస్తుందా ? 


జమిలీ ఎన్నికలకు ఉన్న అడ్డంకులు రాజ్యాంగ సవరణల ద్వారా తీర్చేవి కావని.. ప్రాక్టికల్ గా వచ్చే సమస్యలని నిపుణులు చెబుతున్నారు.  ప్రస్తుత ఎన్నికల విధానం వల్ల వస్తున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంది. వీటికి పార్లమెంట్ లో ప్రదాని మోదీ ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారో చూడాల్సి ఉంది. ఆ పరిష్కారాలను కోవింద్ కమిటీనే సిఫార్సు చేయాల్సి ఉంది.