Happy Navratri Day 7 Kalaratri Durga Alamkaram


కరాళ వదనాం గౌరీం ముక్తకేశీ చతుర్భుజామ్‌
కాళరాత్రిం కరాళికాం దివ్యాం విద్యుత్‌ మాలావిభూషితామ్‌॥


శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  9 రోజులు అమ్మవారు 9 అలంకారాల్లో దర్శనమిస్తుంది. ఆరు రోజుల్లో  శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, సిద్ధిదాత్రి, కాత్యాయనిగా దర్శనమిచ్చిన భ్రమరాంబిక ఏడో రోజు కాళరాత్రి దుర్గ అలంకారంలో పూజలందుకుంటోంది. నల్లని రూపు, విరబోసుకున్న కేశాలతో కనిపించే కాళరాత్రి..మనసులో భయాలను రూపుమాపే చల్లని తల్లిగా భక్తులను అనుగ్రహిస్తుంది. గార్ధభ వాహనం మీద కనిపించే కాళరాత్రి పేరు వింటనే నెగెటివ్ ఎనర్జీ దరిచేరదని భక్తుల విశ్వాసం. 


వామ్ పాడొల్ల సల్లోహలతా కణ్టక భూషణా | 
వర్ధన మూర్ధ ధ్వజా కృష్ణ కాళరాత్రి భార్యంకరీ || 


కాళరాత్రి రూపం చూసేందుకు చాలా భయంకరంగా ఉంటుంది కానీ అమ్మ ఎప్పుడూ శుభాలనే అనుగ్రహిస్తుంది. అందుకే భక్తుల పాలిట శుభంకరీ అంటారు. నవరాత్రుల్లో ఏడోరోజు సాధకుడి మనసు సహస్రార చక్రంలో ఉంటుంది. ఈ చక్రంలో ఇమిడే సాధకుడి మనసు పూర్తిగా కాళరాత్రి స్వరూపంపై స్థిరమవుతుంది. దుష్టశక్తులను అంతమొందించే కాళరాత్రి దుర్గను పూజిస్తే అగ్ని, జలం, జంతు భయం ఉండదని చెబుతారు.  


దుర్గమ్మ రాక్షసుల దాడిని ఎదుర్కొన్నప్పుడు ఆమె బంగారు చర్మం తొలగిపోయి భీకర రూపంతో ఉద్భవించింది. కాళరాత్రి అంటే చీకటి, భయంకరమైనది అని అర్థం. దుష్ట శక్తులను వశం చేసుకునే కాళరాత్రి..భక్తుల భయాలను దూరం చేయడంతో పాటూ సకల శుభాలను కలిగిస్తుంది. 


శని గ్రహాన్ని పాలించే కాళరాత్రి దుర్గను పూజిస్తే జాతకంలో శనిగ్రహం ప్రభావం వల్ల ఏర్పడే ప్రతికూలతను తగ్గుతుంది.. 


కాళి, కాళరాత్రి వేర్వేరు అని కొందరి భావన..కానీ.. కాళి, కాళిక, కాళరాత్రి అన్నీ ఒకే అవతారానికి చెందిన పేర్లు.  దశమహా విద్యల్లో ‘ధూమ్ర’ ,  నవదుర్గల్లో ‘కాళరాత్రి’ ఒకరేనని సాధకులు నమ్ముతారు. కాళరాత్రి ఆరాధనలో వామాచార ప్రాధాన్యం ఎక్కువగా  ఉంటుంది.  


దట్టమైన చీకటితో సమానంగా ప్రకాశించే నల్లని దేహం, విరబోసుకున్న కేశాలు, వెలుగుతున్నట్టుండే కళ్లు, విద్యత్ కాంతితో సమానంగా ప్రకాశించే కంఠహారంతో దర్శనమిస్తే కాళరాత్రి ముక్కుపుటాల నుంచి అగ్నిజ్వాలలు రేగుతుంటాయి. రెండు చేతుల్లో వడి తిరిగిన ఖడ్గం, కంటకాలు... మరో రెండు చేతులతో అభయ, వర ముద్రలు ప్రసాదిస్తుంది.  


జాతకంలో గ్రహసంచారం బాగాలేనివారు కాళరాత్రి దుర్గను పూజిస్తే తక్షణ ఫలితం కనిపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఉందని భావించేవారు ఇంట్లో కాళరాత్రి అమ్మవారికి పూజ చేయడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది.


Also Read: కన్నడ, రాజస్థాని సంస్కృతులు కలగలిపిన మడకేరి దసరా!


నవ దుర్గా స్తోత్రం


గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ ।
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ॥


దేవీ శైలపుత్రీ
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ॥


దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥


దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥


దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥


దేవీ స్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥


దేవీ కాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ॥


దేవీ కాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా ।
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥ 
వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా ।
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ॥


దేవీ మహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ॥


దేవీ సిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥


Also Read: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!