Kurudumale Ganesh Temple Karnataka: బెంగళూరు నుంచి 90 కిలోమీటర్ల దూరం కోలూరు జిల్లా ముళబాగిలు సమీపంలో ఉంది కురుడుమలై శక్తి గణపతి ఆలయం. చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో కొలువైన శక్తి గణపతిని ఆరాధిస్తే  కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే నిత్యం వేల మంది భక్తులతో ఆలయం కళకళలాడుతుంది. 14 అడుగుల ఎత్తున్న  భారీ గణనాథుడి విగ్రహాన్ని ఏక సాలగ్రామ శిలతో తయారుచేశారు. ఈ విగ్రహాన్ని స్వయంగా బహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రతిష్టించారని చెబుతారు..


Also Read: సముద్ర నురుగుతో గణేషుడు.. దర్శించుకున్నారా ఎప్పుడైనా!


స్థల పురాణం
 
లోకాలను పీడించే త్రిపురాసురుడిని సంహరించేందుకు బయలుదేరిన త్రిమూర్తులు...ముందుగా వినాయకుడిని పూజించి తాము చేపట్టిన కార్యానికి ఎదురైన విఘ్నాలు తొలగించుకున్నారని పురాణగాధ. త్రేతాయుగంలో శ్రీ రామచంద్రుడు లంకాధిపతితో యుద్ధానికి వెళ్లేముందు ఇక్కడ వినాయకుడిని పూజించాడని చెబుతారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా కురుజుమలై శక్తిగణపతిని పూజించాడని పురాణగాథ. విఘ్నేశ్వరుడు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు కలలో కనిపించి ఆ గుడికి ప్రాకారం నిర్మించమని చెప్పాడని..ఆమేరకు ప్రాకారాలు నిర్మించినట్టు ఆలయంలో ఉన్న శిలాశాసనంలో ఉంది. అప్పట్లో దీనిని కూటాద్రి అని పిలిచేవారు. ఆ పేరు కాలక్రమేణా..కురుడుమలైగా మారింది. 


Also Read: ఈ ఆలయంలో తప్పుడు ప్రమాణం చేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు!
 
వేల ఏళ్ళ క్రితం ఆలయం
 
ఆర్కియాలజీ వారి లెక్కల ప్రకారం ఈ ఆలయం సుమారు 2000ఏళ్ళ క్రిందట నిర్మించినదని పేర్కొన్నారు. కౌండిన్య మహాముని ఈ ప్రాంతంలో ఇప్పటికీ సంచరిస్తారని...నిత్యం రాత్రివేళలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారని అక్కడి వారి విశ్వాసం. ఎందుకంటే ఇప్పటికీ అర్థరాత్రి సమయంలో ఆలయం లోపల నుంచి వేదమంత్రాలు వినిపిస్తాయట. ఓంకారం ప్రతిధ్వనిస్తుంది. ఇక పండుగలు, పర్వదినాల సమయంలో దివి నుంచి దేవతలు భువికి దిగివచ్చి ఇక్కడ కొలువైన వినాయకుడిని సేవిస్తారు. 


Also Read: ఈ 8 ఆలయాలను రెండు రోజుల్లో చుట్టేయవచ్చు.. వినాయకచవితికి ప్లాన్ చేసుకోండి!
 
కోరిన కోర్కెలు నెరేవేర్చే గణపయ్య
 
ఇక్కడి గణపయ్య ప్రత్యేకత ఏంటంటే.. ఏ పని తలపెట్టినా పదే పదే ఆటంకాలు ఎదురైతే...ఇక్కడ స్వామివారిని ఓసారి దర్శనం చేసుకుని వెళితే ఆ తర్వాత విఘ్నాలు తొలగి మంచి జరుగుతుందట. ఏవైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించినా, నూతన వ్యవహరాలు తలపెట్టినా ఓసారి కురుడుమలై వినాయకుడిని తలుచుకుంటే చాలు ఎలాంటి అడ్డంకులు ఎదురుకావంటారు. కురుడుమలై ఆలయానికి సమీపంలో సోమేశ్వరస్వామి ఆలయం ఉంటుంది. 


కురుడుమలై గణనాథుడిని దర్శించుకోవాలంటే బెంగళూరు విమానాశ్రయం నుంచి 110 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కురుడుమలైకి పది కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఆలయానికి మీరు అనుకుంటే వెళ్లలేరు.. పార్వతీతనయుడి అనుగ్రహం ఉండాలి..


వినాయక శ్లోకాలు
 
మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్ర|
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే||


గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం|
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం||


సుముఖశ్చై కదందశ్చ కపిరో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాదిపః|
ధూమకేతు నరాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజః||


Also Read: గణేష్ చతుర్థి 2024: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!