Sri Varasidhi Vinayaka Swamy Temple Kanipakam : భాద్రపద శుద్ధ చవితిరోజు హస్త నక్షత్రంలో జన్మించాడు వినాయకుడు. సకల విద్యలకు, సకల మంత్రాలకు, సకల శుభాలకు అధినాయకుడు గణేషుడు. అందుకే ఆయన జన్మదినం జగత్తుకి పండుగ అయింది. కేవలం చవితి పండుగరోజే కాదు..నిత్యం పూజలు, అభిషేకాలతో వెలిగే వినాయక క్షేత్రాలెన్నో ఉన్నాయి. అలాంటి పుణ్య ప్రదేశాల్లో కాణిపాకం ఒకటి. బహుదా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో సర్వమత ఆరాధ్యుడుగా పూజలందుకుంటున్నాడు వినాయకుడు.
కాణిపాకం స్థలపురాణం
వెయ్యేళ్ల క్రితం ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. అప్పట్లో విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు.. గుడ్డి, మూగ, చెవిటి వారుగా జన్మించారు. తమ కర్మఫలాన్ని అనుభవిస్తూ... ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజులకు ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. చుక్కనీటికోసం జనం బాధలు వర్ణనాతీతంగా మారాయి. అలాంటి సమయంలో..తమ పొలంలో ఓ పెద్ద బావి తవ్వాలని భావించారు ఈ ముగ్గురు. బావి తవ్వుతూ ఉండగా ఓ పెద్ద బండరాయి అడ్డుగా తగిలింది. అంతలోనే ఆ రాయినుంచి రక్తం చిమ్మింది. ఆ రక్తం ఆ ముగ్గురిపై పడగానే పుట్టుకతో అనుభవిస్తున్న వైకల్యం తొలగిపోయింది. ఈ విచిత్రం గురించి తెలుసుకున్న గ్రామస్తులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించి చూస్తే..అందులోంచి బయటపడింది గణనాథుడి విగ్రహం. ప్రత్యేక పూజలు చేసిన గ్రామస్తులు భారీగా కొబ్బరికాయలు కొట్టారు. ఆ నీరు దాదాపు ఎకరం స్థలం మేర పాకిందట. ‘కాణి’ అంటే ఎకరం పొలం అని అర్థం. అప్పటి నుంచి విహారపురి గ్రామం పేరు కాణిపారకరమ్ గా..రాను రాను కాణిపాకంగా ప్రసిద్ధి చెందింది.
Also Read: ఈ 8 ఆలయాలను రెండు రోజుల్లో చుట్టేయవచ్చు.. వినాయకచవితికి ప్లాన్ చేసుకోండి!
స్వయంభువుగా వెలసిన వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వాయువ్య దిశగా ఉన్న అనుబంధ ఆలయం మణికంఠేశ్వరస్వామిది. దీనిని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతకం నుంచి ఉపశమనం కోసం పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించాడట. ఇక్కడ కొలువైన మరగదాంబిక అమ్మవారు అత్యంత పవర్ ఫుల్. ఈ ఆలయంలో సర్పదోష నివారణ పూజలు నిర్వహిస్తారు. స్వయంభుగా వెలసిన వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి ఎదురుగా వరదరాజస్వామి కొలువయ్యాడు. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారం కోసం శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మించినట్టు చెబుతారు.
Also Read: వినాయకుడి రాశి ఏంటి -గణనాథుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండే రాశులేంటి!
ప్రమాణం చేస్తే జాగ్రత్త
కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని సత్య ప్రమాణాల దేవుడిగా ఆరాధిస్తారు భక్తులు. అందుకే కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారిని స్వామి తప్పనిసరిగా శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు భక్తితో ఇక్కడ భగవంతుడిని పూజించి, ప్రమాణం చేస్తే దాన్నుంచి బయటపడతారని విశ్వాసం.
నిత్యం పెరిగే విగ్రహం
కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతూ ఉంటాడని చెబుతారు. అందుకు నిదర్శనం ఏంటంటే స్వామివారి వెండికవచం సరిపోకపోవడమే. అప్పుడెప్పుడో గణనాథుడికి చేయించిన వెండి కవచం ఇప్పుడు సరిపోకపోవడంతో స్వామివారి విగ్రహం పెరుగుతోందని గమనించారు.
Also Read: గణేష్ చతుర్థి 2024: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!