Perni Nani: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని రాజకీయంగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరడంపై ఆయన గట్టిగా స్పందించారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయలు చేస్తున్నారని శ్రీరంగ నీతులు చెబుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో చేరేందుకు నాయకులు రాజీనామాలు చేయాలని చంద్రబాబు నీతి వాక్యాలు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించి 16 నెలలు జైలులో ఉంచారన్నారు. తనకు రాజకీయంగా అడ్డంగా ఉన్నారని ఆయనను ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. అయినా జగన్‌ భయపడలేదు. 67 సీట్లను గెలిపించారంటూ పేర్ని నాని గుర్తు చేశారు.  


ఆషాఢ భూతి
వైఎస్ జగన్ తనను రాజకీయంగా అడ్డుకుంటాడనే భయం చంద్రబాబును వెంటాడుతోందని, అందుకే 2011 నుంచి ఆయనను రాజకీయాల నుంచి తప్పించాలని చూస్తున్నారని పేర్ని నాని అన్నారు. ఆ క్రమంలో జగన్ ను 16 నెలల పాటు అన్యాయంగా జైలులో పెట్టారని, అయినా ధైర్యం కోల్పోకుండా ప్రజల ముందు నిలబడి 67 సీట్లు సాధించి సత్తా చాటారని గుర్తు చేశారు. అప్పుడు కూడా తమ పార్టీని, జగన్ ను నిర్వీర్యం చేసేందుకు 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని న్నారు. చంద్రబాబు రాజకీయ ఆషాఢ భూతి అని.. నమ్ముకున్న వాళ్లను ఎవరైతే మోసం చేస్తారో వాళ్లను ఆషాఢ భూతి అంటారని పేర్ని నాని అన్నారు. టీడీపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని చంద్రబాబు అంటున్నారని.. 2014 నుంచి 2019 వరకు ఎంత మందిని రాజీనామా చేయించారో చెప్పాలన్నారు. గతంలో తమ పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారని గుర్తు చేశారు. విశాఖ, ప్రకాశం, బెజవాడలో కార్పొరేటర్లు, మేయర్లు రాజీనామా చేయకుండా ఎలా తమ పార్టీ కండువా కప్పుకున్నారని ప్రశ్నించారు.  వాళ్లంతా ఏ పార్టీ గుర్తు తో పోటీచేసి గెలిచారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ అమాయకుడు కాబట్టి ఆయన పార్టీని లాక్కుని చంద్రబాబు లబ్ధిపొందారని వ్యాఖ్యానించారు. కానీ ఎన్టీఆర్ జగన్ అమాయకుడు కాదని పేర్ని నాని హెచ్చరించారు.


ఇతర పార్టీల సాయం అవసరం
చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సహకారం కావాలి. జగన్ గెలవాలంటే ప్రజల సహకారం సరిపోతుందని మాజీ మంత్రి స్పష్టం చేశారు. స్వార్థంతో రాజకీయాలు చేసే జంప్ జిలానీ బ్యాచ్ లు జగన్ అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా 2029 ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇచ్చి పదవులు కట్టబెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు రాజ్యసభలో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకే సామాజికవర్గానికి చెందిన వారిని నియమించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. జగన్ వల్లే మత్స్యకారుడు పెద్దల సభకు రాగలిగారని గుర్తు చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు.. ప్రజా ప్రతినిధుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ప్రలోభాలతో ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పట్టించుకోని హోంమంత్రి తన బాధ్యతను పూర్తిగా విస్మరించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పేర్ని నాని ఆక్షేపించారు.


 వారుపోతే జగన్ కు ఏం కాదు
టీడీపీలో వైసీపీ వాళ్లను చేర్చుకోవడం ద్వారా జగన్ కు రాజకీయంగా అంగుళం కూడా ఏం కాదన్నారు. ఎన్నికల్లో ఓటమి వల్ల ఆ పార్టీ పని అయిపోదన్నారు. 2029లో టీడీపీపై ప్రజల తిరుగు బాటు ఉంటుందని పేర్ని నాని జోస్యం చెప్పారు.. రాజీనామాల తర్వాత సతీష్, రాజేష్ అనే వారు రాజ్యసభలోకి వస్తున్నారనే విషయం అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఈ రాజీనామాలు, కొనుగోళ్ల డ్రామాలు ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలుసని పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు జన్మలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపలేదన్నారు.