Ganesh Chaturthi 2024 : అష్టవినాయక ఆలయాలు.. ఇవన్నీ గణపతి స్వయంభు ఆలయాలు అని చెబుతారు.  ఈ 8 ఆలయాల ప్రత్యేకత దేనికదే. ఎక్కడెక్కడో ఉండి ఉంటాయి..అన్నీ దర్శించుకోవడం సాధ్యం అవుతుందా అనుకోకండి..మొత్తం ఈ 8 ఆలయాలు పూణే చుట్టుపక్కలే ఉన్నాయి. పూణెలో స్టే చేస్తే కేవలం రెండు రోజుల్లో అష్టవినాయక మందిరాలను చుట్టేయవచ్చు. ఈ ఆలయాలు ఎక్కడున్నాయ్? పూణే నుంచి ఎంతెంత దూరంలో ఉన్నాయి? ఏ ఆలయం నుంచి దర్శనం ప్రారంభించాలో ఈ కథనంలో తెలుసుకోండి... 


శ్రీ అష్టవినాయక  మందిరం


ఇది  పూణెకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోరేగావ్ లో ఉన్న అష్ట వినాయకమందిరం...అష్టవినాయకులలో ముఖ్యమైనది. మోరేగావ్ ఒకప్పుడు నెమళ్లకు ప్రసిద్ధి..అందుకే ఈ పేరొచ్చందని చెబుతారు. సింధువు అనే రాక్షసుడిని సంహరించేందుకు వినాయకుడు ఇక్కడ మయూరేశ్వరుడిగా అవతరించాడని పురాణ కథనం. ఇక్కడ విగ్రహానికి ఎడమ వైపు తొండం ఉంటుంది..ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న నందిని శివుడే నేరుగా ప్రతిష్టించాడని చెబుతారు.  ||ఓం మాయరేశ్వరాయ నమః ||


Also Read: వినాయకుడి రాశి ఏంటి -గణనాథుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండే రాశులేంటి!


విఘ్నహరేశ్వర మందిరం


పూణె నాసిక్‌ వెళ్లే దారిలో ఓజార్‌ పట్టణంలో  ఉంటుంది విఘ్నహరేశ్వర మందిరం. వినాయకుడి చేతిలో పరాజయం పాలైన విఘ్నాసురుడు క్షమించమని వేడుకుని తన పేరుతో కొలువవ్వాలని వేడుకున్నాడు. అందుకే విఘ్నహరేశ్వరుడు అని పిలుస్తారు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలంటే ఈ వినాయకుడిని దర్శించుకోవాలని చెబుతారు.        ||ఓం విఘ్నరాజాయ నమః ||


సిద్ధివినాయక మందిరం  


పూణెకు 111 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాటెక్ గ్రామంలో ఉంది సిద్ధివినాయక మందిరం. మూడు అడుగుల ఎత్తులో కొలువైన వినాయకుడు ఇక్కడ ఉత్తర దిశగా దర్శనమిస్తాడు. తొండం కుడిచేయివైపు తిరిగి ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే ఐదు కిలోమీటర్లు నడవాల్సిందే.  || ఓం సిద్దివినాయక నమః ||


బల్లాలేశ్వర ఆలయం  


పూణే కు 119 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలి గ్రామంలో కొలువయ్యాడు బల్లాలేశ్వర వినాయకుడు. ఇక్కడ గణనాథుడు రాతి సింహాసనంపై కూర్చుని ఉంటాడు. తొండం ఎడమ చేతివైపు తిరిగి ఉంటుంది. ఆలయం శ్రీ ఆకారంలో ఉంటుంది... || ఓం బల్లలేశ్వరాయ నమః ||


వరద వినాయక మందిరం


పూణె నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాడ్ లో ఉంది వరద వినాయక మందిరం. ఇక్కడున్న గణపతి విగ్రహం ఓ కొలనులో దొరికిందని చెబుతారు. ఇక్కడ నేరుగా భక్తులే గర్భగుడిలో గణపయ్యకి పూజలు చేయొచ్చు.  || ఓం వరదవినాయకాయ నమః ||


Also Read: మీ రాశి ప్రకారం మీరు పూజించాల్సిన వినాయకుడి రూపం ఇదే!


చింతామణి మందిరం


పూణె నుంచి 28 కిలోమీటర్ల దూరంలో  తియూర్ గ్రామంలో ఉంది చితామణి గణపయ్య. తూర్పు ముఖంగా దర్శనమిస్తే లంబోదరుడు..భక్తుల ఏం కోరుకున్నా వెంటనే తీర్చేస్తాడని నమ్మకం.  || ఓం చింతామణి గణపతి నమో నమః ||


గిరిజాత్మజ మందిరం 


పూణెకు 97 కిలోమీటర్ల పరిధి  లేయాంద్రి గ్రామంలో ఉంది గిరిజాత్మజ గణపతి ఆలయం. ఇక్కడ ఏకరాయితో చెక్కిన విగ్రహం దక్షిణదిశగా దర్శనమిస్తుంది. || ఓం గిరిజత్మజాయాయ నమః ||


మహాగణపతి మందిరం 


పూణెకు 52 కిలోమీటర్ల దూరంలో  రంజనగావ్ లో కొలువయ్యాడు మాహాగణపతి. త్రిపురాసుర సంహారానికి ముందు శివుడు ఇక్కడ వినాయకుడిని పూజించాడని పురాణగాథ. ఇక్కడ వినాయకుడు తూర్పుముఖంగా దర్శనమిస్తాడు.  || ఓం మహానగతాయే నమః ||


Also Read: గణేష్ చతుర్థి 2024: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!


ఈ ఆలయాలన్నీ దర్శించుకునేందుకు రెండు రోజుల సమయం చాలు. ముందుగా మోరేగావ్ లో ఉన్న అష్టవినాయక మందిరంతో దర్శనాలు ప్రారంభించాలి...