AP women commission suo motu case on hidden camera at Gudlavalleru Engineering College | విజయవాడ: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన గుడ్లవల్లేరు కాలేజీలో ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చర్యలు చేపట్టింది. గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీ అమ్మాయిల బాత్రూమ్ లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేసిన ఘటనపై సుమోటో గా కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి, కాలేజి విజిట్ కు వస్తారని, అందుకు తగ్గ ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని, కృష్ణా జిల్లా ఎస్పీకి శుక్రవారం లేఖ రాశారు.
వారం రోజుల కిందటే ఈ విషయంపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసిన బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యార్థినులు గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు ఆందోళన చేశారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై స్పందించి చర్యలకు ఆదేశించారు. ఏపీ సీఎం ఆదేశాలతో పోలీసులు గుడ్లవల్లేరు కాలేజీకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీ సిబ్బంది సమక్షంలోనే హాస్టల్ మొత్తం తనిఖీ చేశారు. దాదాపు 4 గంటలపాటు కాలేజీ హాస్టల్ లో ఎలక్ట్రానిక్ డివైస్‌ను గుర్తించే డిటెక్టర్ తో హాస్టల్‌లో తనిఖీ చేశారు. కానీ వారికి తనిఖీలలో ఎలాంటి హిడెన్ కెమెరా లభించలేదని చెప్పారు. ఇదంతా గమనించిన విద్యార్థినులు సాయంత్రం ఆందోళన విరమించారు.
మరోవైపు కాలేజీకి సోమవారం వరకు సెలవులు ప్రకటించారు. కొందరు తల్లిదండ్రులు వచ్చి తమ కూతుళ్లను ఇళ్లకు తీసుకెళ్లారు. మరికొందరు విద్యార్థినులు హాస్టల్లోనే ఉండిపోయారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నామని, ఇంతటితో దర్యాప్తు ఆగిపోలేదని పోలీసులు చెబుతున్నారు.
వీడియోలు రికార్డ్ చేసి అప్ లోడ్ చేశారా?
బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్ తో ఓయో రూముకు వెళ్లగా అక్కడ ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియో రికార్డు చేసి తన ఫ్రెండ్స్ కు షేర్ చేశాడని సైతం ప్రచారం జరుగుతోంది. తోటి విద్యార్థులు బ్లాక్ మెయిల్ చేయడంతో బాత్రూమ్ లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి మొత్తం 300 వరకు వీడియోలు రికార్డ్ చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులకు షేర్ చేశారని, వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారని సైతం వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అందులో తమ వీడియో ఉందేమోనంటూ విద్యార్థినులు వణికిపోతున్నారు. తమ బిడ్డల భవిష్యత్ ఏమవుతుందోనంటూ వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
బాయ్ ఫ్రెండ్ చెప్పాడని బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలను ఓ యువతి అమర్చినందని కాలేజీలోని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చదువు కోసం వచ్చిన వారిని ఇలా అసభ్యకరమైన వీడియోల రూపంలో చేసి క్యాష్ చేసుకుంటే నాశమైపోతారంటూ వారి తల్లిదండ్రులు శాపనార్థాలు పెడుతున్నారు. విచారణలో అన్ని విషయాలు బయటకు రానున్నాయి.