Krishna District: తెలుగు రాష్ట్రాలను షేక్ చేసే మరో ఘోరం కృష్ణాజిల్లాలో వెలుగులోకి వచ్చింది. అమ్మాయి హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు పెట్టి ఆ వీడియోలను కావాల్సిన వాళ్లకు షేర్ చేస్తున్న దుర్ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతోంది. దీన్నో బిజినెస్ మోడల్‌గా చేసుకొని అబ్బాయిలు తమకు నచ్చిన వ్యక్తుల వీడియోలు తెప్పించుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  


తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ కాలేజీల్లో ఒకటి గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్. ఇలాంటి కాలేజీలోనే ఈ దారుణం వెలుగు చూసింది. ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో ఓ కెమెరా ఉండటాన్ని విద్యార్థులు  గుర్తించారు. దీనిపై హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేయడం అందరి కాళ్ల కింద భూమి కుంగిపోయే నిజాలు బయటపడ్డాయి. 


బాయ్‌ఫ్రెండ్ కోసం


ఇదంతా చేసింది ఓ అమ్మాయే అన్న విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అదే కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినే ఈ దారుణానికి పాల్పడింది. తన బాయ్‌ఫ్రెండ్ కోసం ఇంతటి నీచానికి ఒడిగట్టింది. ఇద్దరూ కలిసి అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్‌ కెమెరాలు పెట్టించి వీడియోలు తీయిస్తున్నట్లు గుర్తించారు. 




ఫ్రెండ్స్‌ కోసం 


ఇలా తీసిన వీడియోలను కాలేజీలో విద్యార్థులకు విక్రయిస్తున్నట్లుగా కూడా కాలేజీ వర్గాలు, విద్యార్థులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థులు అర్థరాత్రి ఇంజినీరింగ్ కాలేజీలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ, హాస్టల్ యాజమాన్యంపై మండిపడ్డారు. 


విద్యార్థిపై దాడి


అదే టైంలో ఇలాంటి పాడు పని చేసిన విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి దిగినట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకూ ఈ ఘటనపై అధికారికంగా ఏ సమాచారం బయటకు రాలేదు. ఎంతమంది అమ్మాయిల వీడియోలను తీశారు దీనికి కారణం ప్రేమ వ్యవహారామా..లేదా ఘటనకు కారణమైన అమ్మాయిని బెదిరించి ఇదంతా చేయించారా అన్న కోణాల్లోనూ సమాచారాన్ని అధికారులు బయటకు చెప్పటం లేదు. విద్యార్థులు ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు




ప్రభుత్వంపై విమర్శలు


ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోలను వైసీపీ నేతలు షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు లోకేష్‌, పవన్ కల్యాణ్, చంద్రబాబుకు ట్యాగ్ చేసి విషయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు నోరు విప్పడం లేదని అడుగుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదో సంచలనంగా మారుతోంది.