The Temple Of The White Lord Ganesha: కూరగాయల వినాయకుడు, స్వీట్స్ వినాయకుడు, బాటిల్స్ వినాయకుడు, డ్రై ఫ్రూట్స్ వినాయకుడు, ఆర్మీ వినాయకుడు, రాజకీయ నాయకుల గెటప్ లో వినాయకుడు, సబ్బులతో గణపతి..ఇలా ఒకటా రెండా..వందల రకాల విగ్రహాలను తయారు చేసి మండపాల్లో ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఇప్పుడు అందరకీ పర్యావరణంపై శ్రద్ధ పెరిగింది కాబట్టి పర్యావరణాన్ని రక్షించే గణపయ్య విగ్రహాలకే ఓటేస్తున్నారు. అయితే ఇన్ని విభిన్న లంబోదరులను చూశారు కదా..సముద్రపు నురగతో తయారైన గణపతిని చూశారా ఎప్పుడైనా?...
Also Read: ఈ ఆలయంలో తప్పుడు ప్రమాణం చేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు!
వైట్ వినాయక్ నగర్ కోవెల
సముద్రపు నురుగుతో వినాయకుడిని తయారు చేయడం ఏంటి? అసలు సాధ్యం అయ్యే పనేనా ఇది? అనే సందేహం రావొచ్చు.. అయితే వేల ఏళ్ల క్రితం తయారైన అలాంటి విగ్రహానికే భక్తులు ఇప్పటికీ పూజలు చేస్తున్నారు. వినాయక నవరాత్రుల తొమ్మిది రోజులు మాత్రమే కాదు.. ఆలయ గర్భగుడిలో కొలువై నిత్యం పూజలందుకుంటున్నాడు పార్వతీతనయుడు. ఈ ఆలయం తమిళనాడు కుంభకోణానికి 6 కిలోమీటర్ల దూరంలో స్వామిమలై వెళ్లే దారిలో తిరువలన్ జులి లో ఉంది. ఇక్కడే పార్వతీ పరమేశ్వరులతో కలసి గణనాథుడు కొలువయ్యాడు. పాలసముద్రంలోంచి వచ్చిన నురుగుతో తయారైన శ్వేతవిగ్రహం ఇక్కడ దర్శనమిస్తుంది. అందుకే దీనిని వైట్ వినాయక్ నగర్ కోవెల అని పిలుస్తారు.
సముద్ర నురగతో వినాయక రూపం
అమృతం కోసం దేవతలు - రాక్షసులు పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించేముందు..ముందుగా వినాయక పూజ చేయడం మర్చిపోయారట. అందుకే సముద్ర మధనంలో భాగంగా మొదట హాలాహలం వచ్చింది. దానిని పరమేశ్వరుడు గొంతులో పెట్టుకుని గరళకంఠుడిగా మారాడు. ఆ విశాన్ని శివుడు సేవించడంతో లోకాలకు రక్షణ లభించింది. అప్పటికి తమ పొరపాటు అర్థమైన దేవతలంతా వినాయకుడి ప్రార్థన చేయాలని భావించారు. అప్పటికప్పుడు విగ్రహాన్ని ఎక్కడనుంచి తీసుకురావాలని ఆలోచించి... పాలసముద్రం నుంచి వెలువడిన నురుగుతో రూపాన్ని తయారు చేసి పూజించారు. ఆ తర్వాత సముద్రంలో లక్ష్మీదేవి, కామధేనువు..చివరిగా అమృతం ఉద్భవించింది. ఆ రూపంతోనే వైట్ వినాయక్ నగర్ కోవెలలో పూజలందుకుంటున్నాడు గణనాథుడు.
Also Read: ఈ 8 ఆలయాలను రెండు రోజుల్లో చుట్టేయవచ్చు.. వినాయకచవితికి ప్లాన్ చేసుకోండి!
ప్రతి వినాయక చవితికి ఇంద్రుడి పూజలు
గౌతముడి రూపంలో అహల్య దగ్గరకు వెళ్లిన ఇంద్రుడు ఆ శాపం నుంచి విముక్తి కోసం ఎన్నో ప్రదేశాల్లో శివార్చన చేస్తూ తమిళనాడులో ఉన్న తిరువలన్ జులి ప్రదేశానికి చేరుకున్నాడు. శ్వేత వినాయకుడు అక్కడ కొలువై ఉండాలనుందని తండ్రిని అడగడంతో..ఆ విగ్రహం ఇంద్రుడి చేతికి చేరేలా చేశాడు శివుడు. రావణుడి ఆత్మలింగం లా...ఇంద్రుడు కూడా ఆ విగ్రహాన్ని ఓ బాలుడికి అప్పగించి దేవతార్చనకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి కింద పెట్టేసి వెళ్లిపోయాడు ఆ బాలుడు. అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు దేవేంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. గణపతి అక్కడే ఉండాలని అనుకున్నాడని..ఏటా వినాయక చవితి రోజు వచ్చి ప్రత్యేక పూజలు చేయాలని ఆకాశవాణి ఇంద్రుడికి చెప్పిందని పురాణకథనం. అప్పటి నుంచి ఏటా వినాయకచవితి రోజు ఇంద్రుడు వైట్ వినాయక్ నగర్ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తాడని చెబుతారు.
Also Read: గణేష్ చతుర్థి 2024: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!
అలంకరణ ఉండదు..కనీసం తాకరు!
శ్వేత వినాయకుడి విగ్రహం చాలా చిన్నగా ఉంటుంది. సముద్రపు నురుగుతో తయారు కావడం వల్ల ఈ విగ్రహాన్ని అలంకరించరు. అభిషేకాలు అస్సలే చేయరు. కేవలం పచ్చ కర్పూరం పొడి మాత్రమే చల్లుతారు..అది కూడా విగ్రహాన్ని తాకకుండా. ఇక్కడ వినాయకుడిని దర్శించుకుంటే వివాహానికి ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.