Most Important Temples of Lord Vishnu and His Avatars: పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణ, దుష్టశిక్షణ కోసం ఎన్నో అవతారాల్లో కనిపించాడు. వాటిని ఏకవింశతి ( 21) అవతారాలు అంటారు. వాటిలో అతి ముఖ్యమైనవి 10..వాటినే దశావతారాలు అని పిలుస్తారు.
యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
అర్జునా! ధర్మానికి హాని కలిగినప్పుడును, ఆధర్మం పెరిగిపోయినప్పుడు... సత్పురుషులను పరిరక్షించేందుకు, దుష్టులను రూపుమాపేందుకు , ధర్మాన్ని సుస్థిరం చేసేందుకు నేను ప్రతియుగంలో అవతరిస్తాను.
భగవద్గీత నాలుగో అధ్యాయం జ్ఙాన, కర్మ సన్యాస యోగంలోది ఈ శ్లోకం. వ్యాసుడు లాంటి అంశావతారం, నారసింహుడు లాంటి పూర్ణావతారం, తిరుమల వేంకటేశ్వరుడులా అర్చావతారాలున్నాయి . వీటిలో దశావతారాలు ప్రధానమైనవి. ఈ 10 అవతారాల్లో ఏడు అవతారాలకు సంబంధించిన ఆలయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి.
Also Read: సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు
మత్సావతారం
దశావతారాలలో మొదటిది అయిన మత్స్య అవతారంలో శ్రీ మహావిష్ణువు కొలువైన ఆలయం నాగలాపురంలో ఉంది. దీనినే వేదనారాయణ ఆలయం లేదా మత్స్య నారాయణ ఆలయం అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుమత్స్యరూపంలోనే స్వయంభూగా వెలసిన ఈ క్షేత్రం తిరుపతికి 68 కిలోమీటర్ల దూరం, మద్రాసుకి 73 కిలోమీటర్ల దూరంలో ఉంది. పల్లవుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగా దర్శనమిస్తే, వేదవల్లి అమ్మవారు స్వామికి అభిముఖంగా కనిపిస్తారు. నారాయణుడు వేదాలను తిరిగి ఇచ్చిన ప్రదేశం కావడంతో వేదపురిగా ప్రసిద్ధిచెందింది.
కూర్మావతారం
శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది కానీ కూర్మావతారం ఆంతర్యం వేరు. క్షీరసాగర మధనంలో కిందకు కుంగిపోతున్న పర్వతాన్ని తన భుజాలపై మోస్తూ దేవదానవులకు సహకరించేందుకు ధరించిన అవతారం ఇది. ఈ అవతారంలో స్వామివారు పూజలందుకుంటున్న ఆలయం శ్రీ కూర్మం. విష్ణువు కూర్మ రూపంలో పూజలందుకుంటున్న ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. శ్రీకాకుళం పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీకూర్మం.
వరాహఅవతారం
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మూడోది వరాహావతారం. హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత భూమిని తన కోరలపై నిలిపి సముద్ర గర్భం నుంచి భూమిని పైకి తీశాడు. అనంతరం తిరుమల గిరులపై సంచరించినట్టు పురాణాల్లో ఉంది. అందుకు నిదర్శనమే తిరుమల కొండపై ఉన్న భూ వరాహ స్వామి ఆలయం. ఈ రూపంలో ఉన్న విష్ణువును ఆరాధిస్తే భూగృహ యోగాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం.
Also Read: యాదాద్రి సహా తెలంగాణలో నారసింహస్వామి కొలువైన మహిమాన్వితే క్షేత్రాలివే
నారసింహ అవతారం
నరసింహావతారం, శ్రీనారసింహుడు, నరసింహావతారం, నృసింహావతారం, నరహరి, నరసింహమూర్తి, నారసింహుడు ఇవన్నీ శ్రీ మహావిష్ణువు నాలుగో అవతారాన్ని వర్ణించే నామాలే.ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు సగం నరుడు, సగం సింహం రూపంలో దర్శనమిస్తారు. అందుకే నారసింహ క్షేత్రాలు మహిమాన్వితం. సింహాద్రి, అహోబిలం, మంగళగిరి, వేదాద్రి, మాల్యాది, అంతర్వేది, వరాహ నారసింహస్వామి, పెంచలకోన..ఇలా ఏపీలో ప్రతి జిల్లాలోనూ నారసింహ క్షేత్రాలున్నాయి
వామన అవతారం
దశావతారాల్లో ఒకటైన వామనావతార ఆలయం ఏపీలో ప్రకాశం జిల్లా బాపట్ల సమీపంలో చెరుకూరు గ్రామంలో ఉంది. ఇక్కడ త్రివిక్రమ వామన స్వామిగా పూజలందుకుంటున్నారు శ్రీ మహావిష్ణువు. చోళులు, పల్లవులు, చాళుక్యులు, విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు శాసనాలున్నాయి.
పరశురామ అవతారం
శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరోది. దీనిని ఆవేశ అవతారం అంటారు. త్రేతాయుగము ఆరంభములో వచ్చిన అవతారం ఇది. అధికార బలంతో విర్రవీగే క్షత్రియులను శిక్షించిన అవతారం. సప్త చిరంజీవుల్లో ఒకడు పరశురాముడు. ఈ ఆలయం శ్రీకాకుళం - ఒడిశా మధ్యలో ఉన్న మహేంద్రపర్వతంపై ఉంది.
ఇక శ్రీరాముడు..శ్రీ కృష్ణుడు పుట్టుక పాలన అంతా ఉత్తరాదినే...
కలియుగ ప్రత్యక్ష దైవం
కలియుగానికి ప్రత్యక్ష దైవంగా పూజలందుకునే శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన నేల కూడా ఆంధ్రప్రదేశ్. తిరుమల క్షేత్రం గురించి ప్రత్యేకంగా భక్తులకు పరిచయం అవసరం లేదు.
Also Read: 'అమ్మకు ప్రేమతో' శ్రీ కృష్ణదేవరాయలు తీర్చిదిద్దిన ఆలయం, ఆ గ్రామానికి తన తల్లి పేరే పెట్టిన రాయలువారు