Hyndava Sankharavam in AP: ఏపీలో ఏం జరిగినా రాజకీయమే ఉంటుంది. జరిగిన ప్రోగ్రాంలో రాజకీయం ఉందా లేదా అన్నది తర్వాత సంగతి. తాజాగా విజయవాడలో జరిగిన హైందవశంఖారావం వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. విజయవాడలో నిర్వహించిన హైందవ శంఖారావ సభను వీహెచ్‌పీ నిర్వహించింది. ఏపీ బీజేపీ ముఖ్య నేతలు బీజేపీ నేతలు పురందేశ్వరి, సత్యకుమార్, వర్మ, విష్ణువర్దన్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు సభ సక్సెస్ కావడంతో తమ వంతు పాత్ర నిర్వహించారు.
ఈ సభ లక్ష్యం ఆలయాల పాలన రాజకీయ కబంధ హస్తాల నుంచి విడిపించడమని వీహెచ్‌పీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షల దేవాలయాలను ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయి. దేశవ్యావ్తంగా హిందూ దేవాలయాలను రాజకీయ జోక్యం నుంచి తప్పించాలన్న డిమాండ్ ఉంది. ప్రభుత్వాలపై ఎక్కడిక్కడ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క మతానిదో కాదు. అందుకే ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. హిందవులుఅందరూ ఈ అంశంపై ఏకాభిప్రాయానికి రావాల్సిఉంటుంది. హైందవ శంఖారావం ద్వారా ఆ దిశగా హిందువులు ఏకమవుతున్నారని అనుకోవచ్చు. ఇప్పటికిప్పుడు హిందూ ఆలయాలను ప్రభుత్వాల పడగ నీడ నుంచితప్పించాలంటే.. రాజ్యాంగంలోని అధికరణాలు 25, 26 లను సవరించి, ఆ తర్వాత రాజ్యాంగంలోని షెడ్యూల్-7లోని జాబితా-3లోని ఎంట్రీ నెం. 28 ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేవాలయ చట్టాన్ని రూపొందించి అన్ని రాష్ట్రాల దేవాలయాల చట్టాలను రద్దు చేయడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మాజీ సీబీఐ డైరక్టర్ నాగేశ్వరరావు చెబుతున్నారు. రాజ్యాంగంలోని అదే షెడ్యూల్-7లోని జాబితా-3లోని ఎంట్రీ నెం. 28 ప్రకారమే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని రూపొందించిందని ఆయన గుర్తు చేశారు.
కేంద్రంలో ప్రభుత్వానికి మెజార్టీ ఉంది కాబట్టే ఆ పని చేయవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ హిందవులుంతా మద్దతు ఇస్తేనే ఆ పని సాధ్యమవుతుంది. కేంద్రం చేతిలో ఉందిని వీహెచ్ పీ అడిగిందని ఏ ప్రభుత్వమూ చేయదని అందుకే బీజేపీ నేతృత్వంలో ఇలా ఐక్యతా సాధన చేస్తున్నారన్న అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయాలకు సంబంధంలేని కార్యక్ర్మం కావడంతో పెద్ద ఎత్తువ హైందవులు ఏకమయ్యారని అంటున్నారు.
అయితే ఏపీలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుక బీజేపీ , వీహెచ్‌పీకి దూరదృష్టి ఉందన్న ప్రచారం జరుగుతోంది. దేశంలో బీజేపీ ఏపీలో ఇంకా ఎంతో ఎదగాల్సి ఉందని ఆ ప్రయత్నాన్ని ఈ సారి హైందవ శంఖారావం ద్వారా ప్రారంభించారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇందులో ఎంత రాజకీయం ఉందో .. భవిష్యత్ లో తెలియనుంది.