ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి.  స్వామివారు మత్స్యరూపంలోనే స్వయంభూగా వెలసిన క్షేత్రం ఇది.  తిరుపతికి 68 కిలోమీటర్ల దూరం, మద్రాసుకి 73 కిలోమీటర్ల దూరంలో  ఇది చిత్తూరు  జిల్లా నాగలాపురంలో ఉంది. ఈ ఆలయాన్ని పల్లవుల కాలంలో నిర్మించారు. 


స్థలపురాణం
మనిషి పుట్టుక నుంచీ మరణం వరకూ ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నిర్దేశించినదే వేదం.  అలాంటి వేదాలను సోమకాసురడనే రాక్షసుడు.. బ్రహ్మ దేవుని వద్దనుంచి అపహరించి సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. వేదాలు లేకుండా సృష్టి ఎలా సాధ్యం అంటూ మిగిలిన దేవతలతో కలసి వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుకి విన్నవించుకుంటాడు. సోమకాసురుడు సముద్ర గర్భంలో దాక్కున్నాడని గ్రహించిన శ్రీ మహావిష్ణువు మత్స్య(చేప) రూపం ధరించి సోమకారుసుడితో భీకర యుద్ధం చేస్తాడు. కొన్నేళ్ల పాటూ సాగిన ఈ యుద్ధంలో సోమకాసురుడిని సంహరించిన విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు.  అయితే సోమకాసుర సంహారం కోసం సముద్ర గర్భంలోకి వెళ్లిన స్వామివారు ఎన్ని రోజులకీ రాకపోవడంతో అమ్మవారు కూడా భూలోకానికి పయనమవుతారు. శ్రీ మహావిష్ణువు శిలారూపాన్ని ధరించాడని తెలుసుకుని ఆయనకు అభిముఖంగా అమ్మవారుశిలారూపంలో నిలిచిపోయిందని చెబుతారు.ఆ సంఘటనకు సాక్ష్యంగా నేటికీ ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగా దర్శనమిస్తే, వేదవల్లి అమ్మవారు స్వామికి అభిముఖంగా దర్శనమిస్తుంది. నారాయణుడు వేదాలను తిరిగి ఇచ్చిన స్థలం కావడంతో ఈ ప్రాంతం వేదపురి, వేదారణ్యక్షేత్రం, హరికంఠాపురంగా ప్రసిద్ధి చెందింది.


Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం


మార్చిలో సూర్యపూజోత్సవం
మత్స్యావతారుడిగా సముద్రంలో సంవత్సరాల తరబడి యుద్ధం చేసి వచ్చినందున స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేడమే సూర్యపూజోత్సవం.  ఏటా మార్చిలో  ఈ ఉత్సవం జరుగుతుంది.  ఆ సమయంలో  ప్రధాన రాజగోపురం నుంచి 630 అడుగుల దూరంలో ఉన్న మూలవిరాట్‌పై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలపై, రెండో రోజు నాభిపై, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరిస్తాయి.  


చైత్ర పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు
1967 ఏప్రిల్ 24న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి వచ్చింది ఈ ఆలయం. అప్పటి నుంచీ  ఏటా అంటే  చైత్ర పౌర్ణమి నుంచి పది రోజులపాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.  వీటితోపాటు వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, ఆండాళ్‌నీరాట్టు ఉత్సవాలు, నవరాత్రులు...ఇలా ప్రతి పర్వదినాన్నీ  ప్రత్యేకంగా నిర్వహిస్తారు. 


Also Read: ఈ గుడిలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకు పుడుతుంది, మీకు ధైర్యం ఉందా


ఆలయాన్ని అభివృద్ధి చేసిన శ్రీకృష్ణదేవరాయలు
పల్లవులు నిర్మించిన ఈ ఆలయలో...15వ శతాబ్దంలో చోళరాజు దక్షిణామూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు ఆలయ ఉత్తర గోపురం మీది శాసనం తెలియజేస్తోంది. రాయలనాటి శిలానైపుణ్యం ప్రదర్శితమయ్యేలా ఆలయ గోడలను తీర్చిదిద్దారు. పంచ ప్రాకారాలతో, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.  ఈ ఆలయమే వేదికగా ఏన్నో దాన ధర్మాలు చేసిన రాయలు వారు ఈ గ్రామానికి తన తల్లి  నాగమాంబ పేరిట నాగమాంబాపురంగా నామకరణం చేశాడు. కాలక్రమంలో ఇది నాగలాపురం అయ్యింది.


Also Read: శ్రీ చక్రం ఎంత పవర్ ఫులో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది