ఏ దేవాలయాన్ని చూసినా ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం మొత్తం దైవనామస్మరణతో మారుమోగుతుంటుంది. ఏదో తెలియని ఆధ్యాత్మిక శక్తి నెలకొంటుంది ఆ ప్రదేశంలో. కానీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం మాత్రం ఇలా కాదు. అక్కడ అడుగుపెట్టాలంటే వెన్ను జలదరిస్తుంది. ఎందుకంటే ఇది దుష్టశక్తులను తరిమికొట్టే ఆలయంగా ప్రసిద్ధి. సాధారణంగా దెయ్యాలు, భూతాలూ, గాలి పట్టిందని కొన్నిరకాల ప్లేస్ లకు తీసుకువెళ్ళి అక్కడ భూతవైద్యులతో వదిలిస్తుంటారు. కానీ దేవాలయంలో ఇలాంటి తంతు జరగడం చాలా తక్కువ. జస్థాన్ లోని డౌస జిల్లాలో ఉంది మహేందిపుర్ బాలాజీ దేవాలయం. బాలాజీ అంటే ఇక్కడ వెంకటేశ్వరస్వామి కాదు ఆంజనేయుడు. నిత్యం వేలమంది భక్తులు దయ్యాల్ని వదిలించుకోవడానికి ఇక్కడకు వస్తుంటారు. శరీరంపై వేడి నీరు పోయడం, పై కప్పు నుంచి వేలాడదీయడం, గోడలకు తలను కొట్టడం, తాళ్లతో కట్టేయడం లాంటివి చేసి దుష్టశక్తుల్ని తరిమికొడతారు.
ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం చాలా వింతగా వుంటుంది. ఈ బాలాజీ ఆంజనేయస్వామే స్వయంగా భూతవైద్యం చేస్తున్నట్టు ఉంటుంది ఇక్కడ విగ్రహం. ఈ గుడి గురించి తెలిసిన వాళ్ల సంగతి సరే కానీ తెలియని వాళ్లు , కొత్తగా ఈ గుడికి వెళ్లాలి అనుకునేవారు మాత్రం ముందుగా మెంటల్ గా ప్రిపేర్ అవాల్సిందే. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది మరి. రాజస్థాన్ లో ఉండేవారే కాదు..దేశవ్యాప్తంగా దుష్టశక్తులు,తంత్రాలతో బాధపడుతున్న చాలామంది ఈ గుడికి వచ్చి ఆంజనేయుడిని దర్శనం చేసుకుంటారు. ఓ మారుమూల ప్రాంతంలో ఈ గుడి ఉన్నప్పటికీ బాగా పాపులర్ అయింది. భూతాలను వదిలించే బాలాజీ హనుమంతుణ్ణి దర్శించుకునేవాళ్ళు రకరకాల కానుకల్ని,ప్రసాదాల్ని ప్రత్యేకంగా సమర్పించుకుంటారు.
Also Read: గ్రహదోషాలు తొలగించే నవగ్రహ గాయత్రి మంత్రం
ఈ ఆలయం లోపల భాగంలో భైరవబాబా అనే ఒక బాబాను కూడా దర్శించుకోవచ్చు. ఈ బాబాకి భక్తులు అన్నాన్ని కానుకగా ఇస్తూ వుంటారు. ఈ గుడిలో మిగతారోజుల కంటే మంగళవారం, శని వారం మాత్రమే అక్కడకు వచ్చే వాళ్లకి భూతాల్ని,దెయ్యాల్ని వదలగొట్టే మంచి రోజులుగా చెప్తూవుంటారు. బాలాజీదేవాలయానికి దగ్గరలో అంజనా మాతాదేవాలయం, కాళీమఠం, పంచముఖీ హనుమాన్ జీ దేవాలయం,సమాధివాలే బాబా సహా పలు గుళ్లు గోపరాలు ఉన్నాయి. మంత్రశక్తులని వదిలించే బాలాజీ గురించి రీసెర్చ్ చేయటానికి జర్మనీ, నెదర్లాండ్స్, న్యూఢిల్లీ నుంచి కూడా కొంతమంది శాస్త్రవేత్తలు 2013లో ఈ గుడి దగ్గరకు వచ్చి ఈ స్వామి పైనా, ఇక్కడ గుడి పైనా,ఇక్కడి వాతావరణం పైన కొన్ని పరిశోధనలు చేసారంట.
ఈ గుడిలో అడుగుపెట్టాలంటే కొన్ని నియమాలు పాటించాలి
- భక్తులు ఎవరైతే ఈ గుడికి రావాలనుకుంటే వాళ్ళు మాంసం,మద్యం అస్సలు సేవించకూడదు
- భూత ప్రేతాలతో బాధపడుతున్న వారికి ఈఆలయంలో ఒక ప్రత్యేక స్థలంలో పూజచేసిన తర్వాత ఒంటరిగా విడిచిపెడతారు
- ఇక్కడ ఇచ్చే ప్రసాదాన్ని ఎవరు కూడా ఇంటికి తీసుకువెళ్లకూడదు. ప్రసాదాన్ని మొత్తం ఈ గుడి యొక్క ఆవరణలో వుండగానే తినేయాలి
- ప్రసాదాన్ని ఎవరైనా ఇక్కడ నుంచి తమ ఇళ్ళకు తీసుకువెళ్తే వారికి కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయం.
Also Read: సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది