Satyasai District Crime : సత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీఫార్మసీ విద్యార్ధిని(B.Pharmacy Student) తేజస్వీని మరణంపై విచారణ జరిపించాలని బీజేపీ నేతలు(BJP Leaders) మంగళగిరిలో డీజీపీకి(DGP) వినతిపత్రం సమర్పించారు. అనంతరం బీజేపీ నేత, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) మీడియాతో మాట్లాడారు. సత్యసాయి జిల్లాల్లో రెండ్రోజుల క్రితం జరిగిన తేజస్విని మృతి ఘటనపై డీజీపీకి వినతి పత్రం అందజేశామన్నారు. తేజస్విని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న నిందితుడు చాంద్ బాషపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామన్నారు. బాషాపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయన్నారు. తేజస్విని మృతిపై పోలీసులు సిట్ ఏర్పాటు చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
"ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించి, ఓదార్చడం లేదు. హత్య, అత్యాచారం జరిగిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రాష్ట్రంలో పోలీసులకు(Police) స్వేచ్ఛ లేదు, పోలీసులకు స్వేచ్ఛ కల్పించాలి. తేజస్విని కుటుబ సభ్యులకు రక్షణ కల్పించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. సీఎం, హోంమంత్రి బాధ్యత వహించాలి. శాంతి భద్రతలపై, జరుగుతున్న పరిణామాలపై కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు చేస్తాం." అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
అంతకు ముందు డీజీపీ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. సత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని మరణంపై విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. డీజీపీని కలసి విచారణ చేయించాలంటూ వినతిపత్రం ఇచ్చేందుకు బీజేపీ నేతలు మంగళగిరి డీజీపీ కార్యాలయానికి వచ్చారు. డీజీపీ కలిసేందుకు అపాయింట్ మెంట్ లేదని వారిని పోలీసులు అడ్జుకున్నారు. పోలీసులతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
పోలీసుల తీరుపై అనుమానాలు!
రాష్ట్రంలో రోజు రోజుకీ పోలీసుల వ్యవహార శైలి వివాదాస్పదం అవుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అత్యాచార కేసులో ఒత్తిళ్ల మేరకే పని చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. సత్యసాయి జిల్లా గోరంట్ల తేజస్విని కేసులో ప్రజా సంఘాల ఆందోళనల నేపథ్యంలో కేసు నమోదు చేశారన్నారు. ధర్మవరంలో నిందితుడి సాదిక్ అరెస్టు చేసినట్లు డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. మీడియాకు అరెస్ట్ వివరాలను డీఎస్పీ వివరించారు. ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్(SP Rahul Dev Singh) ఆదేశాలతో కేసును అనంతపురం దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. రెండు వారాల్లోపు దిశ డీఎస్పీ శ్రీనివాసులు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఎస్పీ ఆదేశించారు. అసలు అత్యాచారం జరగలేదని వైద్యుల బృందం నివేదిక ఇచ్చిందని పోలీసులు తెలిపారు. అలాంటప్పుడు అత్యాచారం చేసినట్టు 376 ఐపీసీ సెక్షన్ ఎఫ్ఐఆర్ లో ఎందుకు పొందుపరిచారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వైద్యులపై ఒత్తిళ్ల మేరకే నివేదిక ఇచ్చారా? అని బంధువులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. తేజస్విని కేసులో ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయలేక ఎస్పీ మొహం చాటేశారన్న అనుమానాలు ఉన్నాయి. పోలీసుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.