హిందూ ధర్మంలో సర్పాలను దేవుళ్లుగా ఆరాధించే సంస్కృతి ఉంది. దేవతలు కూడా సర్పాలను ఆభరణాలుగా చేసుకుని కనిపిస్తారు. అయితే దేశంలో ఎన్నో నాగదేవాలయాలున్నాయి. అందులో ప్రమఖమైనది, ఇతర దేవాలయాలకన్నా ప్రత్యేకమైనది ఉజ్జయినిలో నాగచంద్రేశ్వరాలయం. ఉజ్జయినిలోని మహాకాల్ మందిరంలోని మూడో అంతస్థులో నాగచంద్రేశ్వరాలయం కొలువై ఉంది. ఇది ఏడాదికి ఒక్కరోజు మాత్రమే అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. సర్పరాజుగా భావించే తక్షకుడు ఆ రోజు ఆలయంలోనే ఉంటాడని చెబుతారు.
నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో 11 వ శతాబ్దానికి చెందిన ఓ ప్రతిమ ఉంది. ఇందులో పడగ విప్పి ఉండే పామునే ఆసనంగా చేసుకుని శివపార్వతులు కూర్చుని ఉంటారు. ఉజ్జయినిలో తప్ప ఇలాంటి ప్రతిమ ప్రపంచంలో మరెక్కడా ఉండదట. ఎందుకంటే సాధారణంగా సర్పంపై విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు. కానీ ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో భోళాశంకరుడు శయనించి ఉండడం విశేషం. ఈ ప్రతిమలో శివపార్వతులతో పాటు వారి వినాయకుడు కూడా కొలువై ఉంటాడు.
Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే
సర్పంపై శివుడెందుకు
సర్పరాజు తక్షకుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేశాడట. ప్రసన్నమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడట. ఇక అప్పటి నుంచి తక్షకుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడని చెబుతారు. నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 1050 లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు. ఆయన తర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మహరాజ్ 1732 లో ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే సర్పదోషాలన్నీ తొలగిపోతాయట. అందుకే నాగపంచమి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఈ ఒక్కరోజే దాదాపు రెండు లక్షల మంది భక్తులు దర్శించుకోవడం విశేషం.
Also Read:అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
శివపంచాక్షర స్తోత్రం
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమః శివాయ
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై "మ" కారాయ నమః శివాయ
శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై "శి" కారాయ నమః శివాయ
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై "వ" కారాయ నమః శివాయ
యజ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై "య" కారాయ నమః శివాయ
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే