Chanakya Niti: విజయవంతమైన వ్యక్తికి చాలా మంది శత్రువులు ఉంటారు. ఈ శత్రువుల గురించి కొందరికి తెలుసు, మరి కొందరికి తెలియదు. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ మ‌రొక‌రికి హాని కలిగించే అవకాశం కోసం చూస్తుంటారు. ఆచార్య చాణక్యుడు కొన్నిసార్లు ఈ ముగ్గురినీ బలహీనులుగా పరిగణించకూడదని పేర్కొన్నాడు. వారి ప్రవర్తనను బట్టి మీరు వారి శక్తిని ఊహించలేర‌ని హెచ్చ‌రించాడు. జాగ్రత్తగా ఉండే వ్యక్తి ఎప్పుడూ మోసపోడ‌ని.. అందువ‌ల్ల అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉంటూ ఆ ముగ్గురి నుంచి దూరంగా ఉండటం అవసరమ‌ని తెలిపాడు. అలాంటి వారి దగ్గర ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం మనం ఏ ముగ్గురితో దూరం పాటించాలో తెలుసా..?


1. శత్రువు
మీరు మీ శత్రువులను మరచిపోకూడదు లేదా విస్మరించకూడదు. శత్రువు ప్రశాంతంగా ఉన్నప్పుడు, అతను ఓటమిని అంగీకరించాడని అనుకోకండి. అలాంటి వారిని తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే వారు మిమ్మల్ని పడగొట్టే మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా, ఇంతకాలం మీ చుట్టూ ఉన్న శత్రువు హఠాత్తుగా అదృశ్యమై, అతని కార్యకలాపాలు తగ్గిపోతే మీరు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. అతను చాలా ప్రమాదకరమైనవాడు. మీరు శత్రువుపై విజయం సాధించాలనుకుంటే, మీరు అతని ప్రతి కార్యాచరణపై, అతని బలంపై దృష్టి పెట్టాలి.


Also Read : ఈ 5 నియ‌మాలు పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు ఎప్ప‌టికీ మీ ద‌రిదాపుల‌కి రావు!


2. వ్యాధి
శరీరం పట్ల అజాగ్రత్త వల్ల బలవంతుల ప్రాణాలకు కూడా ప్రమాదం. వ్యాధి ఒక వ్యక్తికి అతి పెద్ద శత్రువు అని అంటారు. సమయానికి చికిత్స చేయకపోతే, ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉంటే, అది అసాధారణ రూపం తీసుకోవచ్చు. ఒక వ్యక్తి విజయానికి వ్యాధులు పెద్ద అడ్డంకి, ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా, బ‌లంగా ఉన్నప్పుడే అతను తన లక్ష్యాన్ని సాధించగలడు. మనసులో రోగం ఉందని అనిపించిన వెంటనే ముందుగా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.


3. పాము
నిశ్శబ్దంగా ఉండే పాము ఎప్పుడు ఎటు తిరుగుతుందో, ఎప్పుడు కాటు వేస్తుందో ఎవరూ ఊహించలేరు. పాము ప్రవర్తనను బట్టి దాని శక్తిని అర్థం చేసుకోవడం కష్టం. అటువంటి పరిస్థితిలో, పాముని ఎప్పుడూ తేలిక‌గా తీసుకోకూడ‌దు. లేదంటే అది మీ జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి పాములతో ఆడుకునే వారిని చూస్తుంటాం. అలాంటి వ్యక్తులు ఆ పాము వ‌ల్లే మ‌ర‌ణిస్తార‌ని మన పెద్దలు చెప్ప‌డం మ‌నం విని ఉంటాం. పాముతో ప‌రాచ‌కాలు ప్రాణాంతకం కావచ్చు.


ఆచార్య చాణక్యుడు చెప్పిన విధంగా, ఈ ముగ్గురితో సహవాసం చేయకూడదు లేదా వారిని ఎక్కువగా విశ్వసించకూడదు. ఎందుకంటే, వారు ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయగలరని చాణక్యుడు చెప్పాడు.


Also Read : ఈ 4 విష‌యాల్లో జోక్యం చేసుకోకూడదు, లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వు


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.