వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. 128 ఓవర్లలో 438 పరుగులకు ఆలౌట్ అయింది. సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ (121: 206 బంతుల్లో, 11 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (80: 143 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (57: 74 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్), రవీంద్ర జడేజా (61: 152 బంతుల్లో, ఐదు ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (56: 78 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించారు. వెస్టిండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జొమెల్ వారికన్ మూడేసి వికెట్లు తీసుకున్నారు.


శతక్కొట్టిన కోహ్లీ
288/4 ఓవర్‌నైట్ స్కోరుతో భారత్ రెండో రోజు బ్యాటింగ్‌కు దిగింది. బ్యాటింగ్‌కు దిగిన కాసేపటికే విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షానన్ గాబ్రియేల్ వేసిన ఇన్నింగ్స్ 91 ఓవర్లో బౌండరీతో విరాట్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అదే ఓవర్లో జడేజా కూడా అర్థ సెంచరీ సాధించాడు. ఐదో వికెట్‌కు వీరిద్దరూ 159 పరుగులు జోడించారు. అనంతరం అనుకోని రీతిలో విరాట్ కోహ్లీ రనౌట్‌గా వెనుదిరిగాడు. తన టెస్టు కెరీర్‌లో విరాట్ రనౌట్‌గా వెనుదిరగడం ఇది కేవలం మూడో సారి మాత్రమే. 


ఆ తర్వాత కాసేపటికే క్రీజులో కుదురుకున్న రవీంద్ర జడేజాను కీమర్ రోచ్ అవుట్ చేశాడు. ఇషాన్ కిషన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఈ దశలో రవిచంద్రన్ అశ్విన్ టెయిలెండర్లతో ఒంటరి పోరాటం చేశాడు. కానీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. చేతిలో వికెట్లు లేకపోవడంతో వేగంగా ఆడే క్రమంలో కీమర్ రోచ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.


కేవలం 45 పరుగుల వ్యవధిలోనే భారత్ తన నాలుగు వికెట్లను కోల్పోయింది. వెస్టిండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జొమెల్ వారికన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. జేసన్ హోల్డర్‌కు రెండు వికెట్లు, గేబ్రియల్‌కు ఒక వికెట్ దక్కాయి. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ ఏకంగా ఏడు బౌలింగ్ ఆప్షన్లను ప్రయత్నించాడు.


భారత్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్ 


వెస్టిండీస్ తుది జట్టు
క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), తేజ్‌నరైన్ చందర్‌పాల్, కిర్క్ మెకెంజీ, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్, షానన్ గాబ్రియెల్