Virat Kohli Century: కింగ్ కోహ్లీ టెస్టుల్లో 29వ సెంచరీ సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విరాట్ ఈ సెంచరీని అందుకున్నాడు. ఓవరాల్‌గా ఇది తనకు 76వ సెంచరీ. ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ (121 బ్యాటింగ్: 204 బంతుల్లో, 11 ఫోర్లు) మరో రికార్డుకు చేరువయ్యాడు. విదేశీ గడ్డపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు.


ఇప్పుడు విరాట్ కోహ్లీ... సచిన్ టెండూల్కర్ కంటే కేవలం ఒక సెంచరీ వెనుక ఉన్నాడు. విదేశీ గడ్డపై విరాట్ కోహ్లి ఇప్పటివరకు 28 సెంచరీలు చేశాడు. కాగా సచిన్ టెండూల్కర్ 29 సెంచరీలతో మొదటి స్థానంలో ఉంది.


వెస్టిండీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన వారిలో కూడా విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ విషయంలో సునీల్ గవాస్కర్ టాప్‌లో ఉన్నారు. వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ 13 సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లి వెస్టిండీస్ ఇప్పటివరకు 12 సెంచరీలు చేశాడు. కాగా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ కూడా 12 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఏబీ డివిలియర్స్ 11 సెంచరీలతో మూడో స్థానంలో నిలిచాడు. 


టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో కూడా విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి చేరుకున్నాడు.  ఈ లిస్ట్‌లో కూడా 44 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ టాప్‌లో ఉన్నారు. జాక్వెస్ కలిస్ (35), మహేళ జయవర్థనే (30), విరాట్ కోహ్లీ (25) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 24 సెంచరీలు చేసిన బ్రియాన్ లారాను విరాట్ కోహ్లీ దాటేశాడు.


మరోవైపు మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి భారత్ 98 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. విరాట్ సెంచరీ చేసిన కాసేపటికే రవీంద్ర జడేజా (54 బ్యాటింగ్: 125 బంతుల్లో, నాలుగు ఫోర్లు) అర్థ సెంచరీ సాధించాడు. వీరు ఐదో వికెట్‌కు ఇప్పటివరకు అజేయంగా 155 పరుగులు సాధించారు. ఇంకా ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ముకేష్ కుమార్, మహ్మద్ సిరాజ్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. వీరు ఎక్కువసేపు కాసేపు క్రీజులో ఉంటే భారత్ భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.


భారత్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్


వెస్టిండీస్ తుది జట్టు
క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), తేజ్‌నరైన్ చందర్‌పాల్, కిర్క్ మెకెంజీ, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్, షానన్ గాబ్రియెల్