Asia Cup 2023: పలు నాటకీయ పరిణామాల మధ్య  ఎట్టకేలకు  బుధవారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ).. త్వరలో జరగాల్సి ఉన్న ఆసియా కప్ - 2023 షెడ్యూల్‌ను విడుదల చేసింది.  హైబ్రిడ్ మోడల్‌లో పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరుగనుంది. ఈ మేరకు తుది షెడ్యూల్ కూడా విడుదలైన నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)..  షెడ్యూల్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. 


ఆసియా కప్ - 2‌023లో భాగంగా   బంగ్లాదేశ్ గ్రూప్ స్టేజ్‌లో తమ తొలి మ్యాచ్‌ను  ఆగస్టు 31న  శ్రీలంకతో క్యాండీ (శ్రీలంక)‌లో ఆడాల్సి ఉంది.   ఆ తర్వాత సెప్టెంబర్ 3న  అఫ్గానిస్తాన్‌తో లాహోర్ (పాకిస్తాన్)‌లో ఆడాలి.   గ్రూప్ - బిలో ఉన్న బంగ్లాదేశ్.. ఒకవేళ సూపర్ - 4కు అర్హత సాధించే క్రమంలో రెండో స్థానంలో నిలిస్తే  ఆ జట్టు.. సెప్టెంబర్ 6న  లాహోర్ వేదికగా  మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.   అంటే  ఏడు రోజుల వ్యవధిలో ఆ జట్టు  శ్రీలంక - పాకిస్తాన్ మధ్య రెండు సార్లు అటూ ఇటూ  ప్రయాణించాల్సి ఉంటుంది. శ్రీలంక నుంచి  పాకిస్తాన్‌కు విమానంలో అయితే  3 గంటల ప్రయాణం..


సామాన్లు సర్దుకోవడానికే టైమ్ పోతుంది..


ఇప్పుడిదే విషయాన్ని ఎత్తిచూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్  జలాల్ యూనుస్   ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢాకాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మేం (బంగ్లా)మా తొలి మ్యాచ్‌ను లంకలో ఆడాలి. ఆ తర్వాత మ్యాచ్ కోసం లాహోర్‌కు వెళ్లాలి.  ఫస్ట్ రౌండ్‌లో రెండు మ్యాచ్‌లు ఉన్నందున  రెండు దేశాలలో మ్యాచ్‌లు ఆడాలి.  ఆటగాళ్లు విమాన ప్రయాణం సాఫీగా సాగేందుకు గాను ఆసియా కప్ వారికి ప్రత్యేకంగా ఛార్టర్ ఫ్లైట్స్‌ను  ఏర్పాటుచేయిస్తోంది. మేం కూడా వాటిలో ప్రయాణిస్తాం...


కానీ స్టేడియం నుంచి ఎయిర్‌పోర్టుకు రావడానికి కనీసం 2 గంటల సమయం అయినా పట్టొచ్చు. అంతకంటే ముందే  మా ఆటగాళ్లు  బ్యాగ్‌లు, లగేజీ సర్దుకోవద్దా..?  వాస్తవానికి ఎయిర్ ట్రావెల్ అంటేనే  ఎంతో బడలికతో కూడుకున్నది. ఇది ఆటగాళ్ల మానసిక   స్థితిని కూడా దెబ్బతీయొచ్చు.  తీరికలేని ప్రయాణాలు, ప్రాక్టీస్, మ్యాచ్‌ల వల్ల వాళ్లు ఒత్తిడికి గురైతే అది వారి ప్రదర్శన మీద కూడా ప్రభావం చూపే అవకాశముంది.  కానీ ఈ విషయంలో మేం ఏం చేయగలం...? ఏసీసీ ఇదివరకే  షెడ్యూల్, వేదికలపై నిర్ణయం తీసుకుంది. మేం దానికి కట్టుబడి ఉండాల్సిందే..’అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 


 






ఆసియా కప్‌‌లో భాగంగా ఆగస్టు  30న ముల్తాన్ వేదికగా ఆతిథ్య పాకిస్తాన్..  నేపాల్‌తో తలపడనుంది. 31న శ్రీలంకలోని క్యాండీ వేదికగా బంగ్లాదేశ్ - శ్రీలంక ఆడతాయి.సెప్టెంబర్ 3న లాహోర్‌లో బంగ్లా - అఫ్గాన్ మ్యాచ్ జరుగనుంది. ఐదున  ఇదే వేదికలో శ్రీలంక.. అఫ్గాన్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ - పాక్  సెప్టెంబర్ 2న క క్యాండీ వేదికగా ఆడనున్నాయి.  సూపర్ -4, ఫైనల్స్‌కు అర్హత సాధిస్తే ఈ రెండు జట్లు మూడు వారాల  వ్యవధిలోనే మూడు సార్లు తలపడాయి. 















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial