IND Vs WI Test: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 500వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ.. ట్రినిడాడ్‌లో అర్థ సెంచరీ చేసి శతకం దిశగా సాగుతున్నాడు. ఇంటర్నేషనల్ కెరీర్‌లో 10 మందికి మాత్రమే సాధ్యమైన 500వ మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ కోహ్లీ మాత్రమే.. మరో 13 పరుగులు చేస్తే విరాట్.. సెంచరీ సాధించి మరో కొత్త చరిత్రను సృష్టిస్తాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ.. జాక్వస్ కలిస్ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించాడు.
కలిస్‌ను దాటి...
ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ.. దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వస్ కలిస్ (519 మ్యాచ్‌లలో 25,534 పరుగులు)ను దాటి ఐదో స్థానానికి చేరాడు. విండీస్‌తో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో కోహ్లీ పరుగులు 25,548కు చేరాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (34,357 పరుగులు) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ జాబితాలో కుమార సంగక్కర (28,016), రికీ పాంటింగ్ (27,483), మహేళ జయవర్దెనె (25,957)లు తొలి నాలుగు స్థానాలో నిలిచారు.
మరికొన్ని..
- 500వ మ్యాచ్ ఆడుతూ అర్థ సెంచరీ చేసిన ఫస్ట్ బ్యాటర్
- టెస్టులలో నెంబర్ - 4లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసినవారిలో కోహ్లీ ఐదో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో సచిన్ (13,492), జయవర్దెనె (9,509), జాక్వస్ కలిస్ (9,033), బ్రియాన్ లారా (7,535) నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఐదో స్థానంలో ఉన్న కోహ్లీ.. 7,097 రన్స్ సాధించాడు.
- వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 2 వేల పరుగులు
రోహిత్ కూడా..
కోహ్లీతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ కూడా పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసినవారిలో హిట్‌మ్యాన్ (17,281).. మహేంద్ర సింగ్ ధోని (17,266)ను అధిగించాడు. రోహిత్ కూడా డబ్ల్యూటీసీ చరిత్రలో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. యశస్వీ జైస్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 139 పరుగులు జోడించడం ద్వారా రోహిత్.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో పర్యాటక జట్టు నుంచి అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన మూడో ఓపెనింగ్ జంటగా రికార్డులకెక్కారు. ఇంగ్లాండ్‌కు చెందిన జెఫ్రీ బాయ్‌కాట్, డెన్నిస్ అమిస్ (209), ఆసీస్ ఓపెనర్లు అర్థర్ మోరిస్ - కొలిన్ మెక్‌డొనాల్డ్ (191) భారత ఓపెనర్ల కంటే ముందున్నారు.
కాగా రెండో టెస్టు తొలి రోజు భారత జట్టు.. 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (57) మరోసారి ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ (80) ఫామ్‌ను కొనసాగించాడు. కానీ శుబ్‌మన్ గిల్ (10), అజింక్యా రహానె (8)లు మరోసారి విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ (87 నాటౌట్), రవీంద్ర జడేజా (36 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial