Bhogi  2025: సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. వేకువజామునే చలిగాలుల మధ్య  భోగిమంటలు వేసుకుని వెచ్చగా పండుగకు ఆహ్వానం పలుకుతారు. సాధారణంగా భోగిమంటలు అంటే చాలామంది ఇంట్లో ఉన్న చెత్తా చెదారం పడేసి నిప్పు పెట్టడమే అనుకుంటారు. సరిగా వెలగకపోతే దానిపై పెట్రోల్ పోసేవారూ ఉన్నారు. మరికొందకు పాత టైర్లు తగలెట్టేస్తారు. ఈ సంప్రదాయాన్ని ఎందుకు అనుసరించాలో తెలుసుకోకుంటే ఓ పనిలా మారిపోతుంది. భోగి మంటలు వేయాలి అంటే వేశాం అన్నట్టు పరిస్థితి తయారవుతోంది.  


దక్షిణ దిశగా ప్రయాణించే సూర్యుడు ఉత్తర దిశగా మళ్లే రోజు భోగి. ఈ సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది కానీ ఆ వెనువెంటనే వెచ్చదనం మొదలవుతుంది. అందుకే భోగి మంటలు వేసుకునేది వెచ్చదనం కోసం మాత్రమే కాదు... రాబోయే వేడిని తట్టుకునేందుకు శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు కూడా. సంక్రాంతి అంటే పంట చేతికొచ్చే సమయం.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికి తరలివచ్చే పంటలతో పాటూ కీటకాలు, పురుగులు ఊర్లపై దాడి చేసేవి. వాటిని తరిమి కొట్టేందుకు భోగి మంటలు వేస్తారు..


Also Read: భోగ భాగ్యాలనిచ్చే భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!


భోగిమంటలు అంటే చలిని తరిమేసే మంటలు కాదు అగ్ని ఆరాధించే సందర్భం. అందుకే హోమాన్ని ఎంత పవిత్రంగా వెలిగిస్తారో భోగిమంటలను కూడా అంతే పవిత్రంగా వెలిగించాలి. అందుకే స్నానం చేయకుండా భోగిమంటలు వేయకూడదు..అక్కడకు వెళ్లకూడదు.  


అప్పట్లో భోగి మంటల కోసం ప్రత్యేకంగా కలప సిద్ధం చేసేవారు. చెట్టు బెరడు, పాత కలప, ధనుర్మాసంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బిళ్లను పిడకలు చేసి ఎండబెట్టి..ఇవన్నీ భోగిమంటల్లో వేసేవారు. బాగా మండేందుకు ఆవు నెయ్యి పోసి వెలిగించేవారు. నెయ్యి వేయలేం అనుకుంటే కొబ్బరి ఆకులు, తాటి ఆకులు, ఎండిన కొమ్మలు వేసేవారు. ఇలా ఆవు నెయ్యి, పిడకలు, కలప నుంచి వచ్చే పొగ వాతావరణాన్ని శుద్ధి చేసేది. 


Also Read: 600 కోట్ల ఖర్చు.. 7జన్మలకు గుర్తుగా 7ద్వారాలు.. మిల్లు కార్మికుడి కొడుకు కట్టిన అద్భుతమైన స్వర్ణ దేవాలయం!
 
ప్రస్తుత కాలంలో భోగి మంటలంటే ఫ్యాషన్ గా మారిపోయాయ్.. కలప, పిడకలు కాదు ఇంట్లో ఉన్న చెత్త, విరిగిన ప్లాస్టిక్ సామాన్లు,  పాత టైర్లు వేస్తున్నారు.సరిగా మండలేదంటూ పెట్రోల్ , కిరోసిన్ పోస్తున్నారు..ఇలా చేస్తే పండుగ సందడేమో కానీ వాతావరణం కలుషితం అవుతోంది. ఇలాంటి గాలి పీల్చితే అనారోగ్యం రావడం ఖాయం..
 
మీరు భోగి మంటలు వేసుకోపోయినా పర్వాలేదు కానీ ఇలా ప్లాస్టిక్ , చెత్తతో మంటలు వెలిగించి వాతావరణాన్ని కలుషితం చేయొద్దంటున్నారు పర్యావరణ నిపుణులు.  


2025లో జనవరి 13 సోమవారం భోగి
జనవరి 14 మంగళవారం సంక్రాంతి
జనవరి 15 బుధవారం కనుమ
 
భృగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి వచ్చింది. భోగం అంటే సుఖం, సంతోషం అని అర్థం. పురాణాల ప్రకారం ఈ రోజు శ్రీ రంగనాథుడిలో గోదాదేవి లీనమై భోగం పొందింది. అందుకే భోగి ఆచరణలోకి వచ్చిందంటారు. శ్రీ మహా విష్ణువు వామనుడిగా వచ్చి  బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంద్రుడు గర్వంతో గోకులంపై రాళ్ల వర్షాన్ని కురిపిస్తుంటే ఆ గర్వాన్ని అణిచివేసేందుకు శ్రీ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్నెత్తి గోపాలురను, గోవులను కాపాడిన రోజు కూడా భోగినే.


Also Read:  దశావతారాల్లో ఏడు అవతార ఆలయాలు ఏపీలోనే ఉన్నాయ్.. ఎక్కడున్నాయ్ , మీరెన్ని దర్శించుకున్నారు!