Sri Lakshmi Narayani Golden Temple Vellore : 400 మంది శిల్పుల ఆరేళ్ల నిరంతర శ్రమ.. వంద ఎకరాల విస్తీర్ణంలో ధగ ధగ మెరిసే ఆలయం..మొత్తం 1500 కిలోల బంగారం.. 600 కోట్ల నిర్మాణ వ్యయం.. మేం చెబుతున్నది అమృత్ సర్ స్వర్ణదేవాలయం కాదు.. తమిళనాడు శ్రీపురంలో కొలువైన  శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి స్వర్ణదేవాలయం  గురించి. 
 
సాధారణంగా స్వర్ణదేవాలయం అనగానే అమృత్‌సర్‌ గుర్తుకొస్తుంది ...అయితే అంతే ఖ్యాతి శ్రీపురానికి ఉంది. ఆలయ నిర్మాణంలో  భాగంగా స్తంభాలూ , శిల్పాలకు రాగితో తాపడం చేసి ఆ తర్వాత బంగారు రేకుల్ని వేసి తీర్చిదిద్దారు. అమ్మవారి విగ్రహాన్ని  గ్రానైట్‌తో రూపొందించి బంగారం తొడుగు వేశారు.   


చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో వేలూరు సమీపంలో ఉంది ఈ స్వర్ణదేవాలయం. ఈ ప్రాంతాన్ని తిరుమలైకోడిగా పిలిచేవారు.. అమ్మవారి ఆలయం నిర్మించిన తర్వాత శ్రీపురంగా మార్చారు.



గర్భగుడిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే  కిలోమీటరున్నర దూరం నక్షత్రపు ఆకారంలో ఉన్న మార్గం నుంచి వెళ్లాలి. ఈ దారిపొడవునా రెండు వైపులా గోడలపై భగవద్గీత, ఖురాన్‌, బైబిలులో ప్రవచనాలుంటాయి. అంటే అమ్మవారి సన్నిధిని చేరుకునేలోగా అజ్ఞానాన్ని వీడిపోవాలన్నదే ఆంతర్యం. 


Also Read: దశావతారాల్లో ఏడు అవతార ఆలయాలు ఏపీలోనే ఉన్నాయ్.. ఎక్కడున్నాయ్ , మీరెన్ని దర్శించుకున్నారు!
 
నక్షత్ర ఆకారంలో ఉన్న మార్గాన్ని దాటుకుని ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే...ప్రత్యేకంగా మండపం, ఫౌంటెన్లు చూపుతిప్పుకోనివ్వవు. మండపానికి కుడివైపు నుంచి లోనికి వెళ్లి శ్రీ మహాలక్ష్మిని దర్శించుకుని ఎడమవైపు నుంచి బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.  ఇక్కడ ఏడు ద్వారాలు కనిపిస్తాయి.. ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు దాటుకుని ముక్తి పొందాలన్నదే ఆంతర్యం.




 
వజ్ర, వైఢూర్యాలు, ముత్యాలు, ప్లాటినంతో రూపొందించిన నగలు, బంగారు కిరీటం ధరించిన మహాలక్ష్మిని దర్శించుకున్న ఆ కొద్ది క్షణాలు భక్తులు మరోలోకంలో ఉన్నట్టు మారిపోతారు. బంగారు కాంతులు వెదజల్లే అమ్మను దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
 
ఇక్కడ VIP దర్శనాలుండవ్..అందరదీ ఒకటే దారి..క్యూలైన్లలో వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. నిత్యం ఉదయం 5 నుంచి రెండు గంటలపాటూ శ్రీ మహాలక్ష్మికి అభిషేకం, అలంకారం ఉంటుంది. ఏడున్నర నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. రాత్రి 8 గంటలవరకూ దర్శనాలు చేసుకోవచ్చు.  


ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా..ఓ మిల్లు కార్మికుడి కొడుకు. పేరు సతీష్ కుమార్..అంతా శక్తి అమ్మ అని పిలుస్తారు. సతీష్ కుమార్ సొంతూరు వేలూరు. తండ్రి నందగోపాల్ మిల్లులో పనిచేసే కార్మికుడు, తల్లి ఉపాధ్యాయురాలు. 1976లో జన్మించిన సతీశ్‌కుమార్ కి చిన్నప్పటి నుంచి భగవంతుడిలోనే గడపడం ఆసక్తి. నిత్యం ఆలయాల చుట్టూ తిరగడం, పూజలు, యాగాల్లో పాల్గొనడం చేసేవారు. అలా 16 ేళ్లు వచ్చేసరికి తనపేరుని సతీష్ కుమార్ నుంచి శక్తి అమ్మగా మార్చుకుని నారాయణి పీఠాన్ని ప్రారంభించారు. 



Also Read: సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు


ఓ రోజు బస్సులో వెళుతుండగా శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ వెలుగు కనిపించింది...ఆ కాంతి రేఖలో మహాలక్ష్మి స్వరూపం కనిపించింది. అంతే .. అక్కడే అమ్మ కొలువుతీర్చాలని నిర్ణయించుకున్నారు శక్తి అమ్మ. నారాయణి పీఠం ద్వారా పనులు ప్రారంభించారు. అప్పటికే నారాయణ పీఠానికి దేశ విదేశాల్లో భక్తులు ఉండడంతో వాళ్లనుంచి విరాళాలు వెల్లువెత్తాయి. ముందుగా నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు ప్రారంభించారు..అమెరికా, కెనడా సహా ఇతర దేశాల్లోనూ ఫౌండేషన్లు ఏర్పాటు చేశారు. అలా వచ్చిన భారీ విరాళాలతో తిరుమలైకోడిలో స్వర్ణదేవాలయం నిర్మించి ఆ ప్రాంతాన్ని శ్రీపురంగా పిలవడం ప్రారంభించారు. 
 
తిరుమల స్వామివారిని దర్శించుకున్న భక్తుల్లో చాలామంది నారాయణి అమ్మవారిని దర్శించుకుంటారు. చిత్తూరు నుంచి దాదాపు 50 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 134 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చీకటి పడిన తర్వాత చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.


Also Read: యాదాద్రి సహా తెలంగాణలో నారసింహస్వామి కొలువైన మహిమాన్వితే క్షేత్రాలివే