మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ నగరంలో కొలువైంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.  కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ పరమేశ్వరుడు పూజలందుకుంటున్నాడని చెబుతారు.ఇక్కడ మహాకాళ లింగానికి తెల్లవారుజామున విశిష్టమైన హారతిస్తారు. అదే భస్మహారతి. ఇది రెండు రకాలుగా నిర్వహిస్తారు. గోమయం పిడకల్ని విభూతిగా మార్చి రెండు మూటల్లో నింపి వాటిని ఒకదానితో మరొకటి తాడనం చేస్తూ ఆ విభూతి లింగంపై పడుతూ ఆ గర్భగుడి నిండా ఆవరిస్తుంది… మరొకటి శ్మసానంలో మొదట కాలిన శవం బూడిదతో ఇచ్చే హారతి...దీనిని నాగసాధువులు నిర్వర్తిస్తారు. దీన్ని చూసేందుకు మహిళల్ని అనుమతించరు. ఈ హారతి సందర్భంగా మోగే భేరీలు, మృదంగనాదాలు, కమ్ముకునే విభూతి, పంచాక్షరి ధ్వని, భస్మాభిషేకం చేస్తున్నప్పుడు చదివే మంత్రాలు..ఇవన్నీ అక్కడుకున్న వారందర్నీ ఓ అలౌకిక ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లిపోతుంది. అయితే ఉజ్జయిన మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం ఇప్పుడు రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలోనూ నిర్వహిస్తున్నారు.  


Also Read: పూర్తిగా శివుడిలో ఐక్యం ఐపోవాలంటే ఇక్కడకు వెళ్లాలి!


ఆలయ నిర్మాణానికి బీజం పడిందిలా.. 
ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న రోటరీ క్లబ్ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పట్టపగలు వెంకట్రావు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. దేశం గర్వించదగ్గ ఇలాంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన నిర్మించాలని..ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న అనుభూతే భక్తులకు కలిగేలా చేయాలని నిర్ణయించుకున్నారు. పవిత్ర గోదావరి నదీ తీరంలో గౌతమీ ఘాట్‌లో రెండు ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది. 



  • భూమి ఉపరితలం నుంచి 55 అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా 109 అడుగుల్లో గర్భాలయాన్ని నిర్మించారు.

  • 75 అడుగుల ఎత్తైన నాలుగు గాలిగోపురాలు, 50 అడుగులతో అతి విశాలమైన నాలుగు మండపాలు

  • 55 అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు బలిపీఠాలు, నాలుగు త్రిశూలాలు, నాలుగు నందులు, గర్భాలయానికి నాలుగు వైపులా గుమ్మాలతో అత్యద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు

  • 32 ద్వైత, 32 అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా 64 ఉపాలయాలు నిర్మించారు..

  • వీటిని దర్శించుకుంటూ మహాకాళేశ్వర గర్భాలయంలోకి అడుగుపెట్టేలా తీర్చిదిద్దారు. గర్భగుడిలో ఉన్న ప్రధాన శివలింగంతోపాటు బలిపీఠాలు, నందులు తిరుమలలో... ఉప ఆలయాల్లోని విగ్రహాలను జైపూర్‌లో తయారుచేయించారు. 


Also Read: కార్తీక వనభోజనాలు సరదా కోసం కాదు, వాటివెనుకున్న ఆంతర్యం ఏంటంటే!


ఉజ్జయినిలా భస్మాభిషేకం ప్రత్యేకం
ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామికి నిత్యం తెల్లవారు జామున నిర్వహించినట్టే రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలోనూ  నిత్యం భస్మాభిషేకం నిర్వహిస్తారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు భస్మాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్‌ నిర్వహిస్తోన్న రెండు కైలాస భూముల నుంచి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తీసుకొస్తారు. ఆ భస్మాన్ని తెల్లడి వస్త్రంలో మూటకట్టి మహాకాళుడికి అభిషేకిస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మ ఉత్తమగతులు పొందుతుందని విశ్వాసం. ఉజ్జయినిలో  భస్మాభిషేకానికి పురుషులను మాత్రమే అనుమతిస్తారు కానీ... రాజమహేంద్రవరంలో మహిళలకు కూడా అనుమతిస్తున్నారు.