karthika masam vanabhojanalu : ఉసిరి చెట్టును ధాత్రిచెట్టు అంటారు. క్షమాగుణానికి ప్రతీక అయిన ఉసిరిచెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి ఎక్కడుందో శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉంటాడు. అందుకే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేస్తాం. 


ఉసిరి చెట్టుకింద ఎందుకు భోజనం చేయాలి
ఇది తెలుసుకోవాలంటే మనం రెగ్యులర్ గా తీసుకుంటున్న భోజనం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సమయం దాటాక తినడం, అతిథికి -బ్రహ్మచారికి పెట్టాకుండా తినడం, బయటనుంచి తీసుకొచ్చి తినడం, నైవేద్యం  పెట్టకుండానే తినడం..ఇలా భోజనాన్ని 9 రకాలుగా విభజిస్తారు. రెగ్యులర్ గా తీసుకనే భోజనాల్లో రెండే రెండు ఆమోదయోగ్యం.. వాటిలో ఒకటి ఇంట్లో వండుకుని తినేది, మరొకటి ఆలయాల్లో సంతర్పణ సమయంలో తినేది. ఇవి కాకుండా నిత్యం తింటున్న ఆహారం మొత్తం అసాక్షి భోజనమే. పైగా  నడుస్తూ తినడం, మాట్లాడుతూ తినడం, మంచంపై కూర్చుని తినడంతో ఆ ఆహారంతో పాటూ శరీరంలోకి కలిపురుషుడు ప్రవేశిస్తాడు. అందుకే కార్తీకమాసంలో  శ్రీమహాలక్ష్మి, విష్ణుమూర్తి స్వరూపంగా భావించే  ఉసిరిచెట్టుకింద భోజనం చేయడం వల్ల  ఈ దోషం తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే ఇలాంటప్పుడు సహపంక్తి భోజనాలు చేస్తారు. పరబ్రహ్మ స్వరూపం అయిన అన్నం ముందు అందరూ సమానమే అని చెప్పడమే వనభోజనాల ముఖ్య ఉద్దేశం.


Also Read: పాములను పూజించడం మూఢనమ్మకమా, పుట్టలో పాలు పోయకూడదా - ఏది నిజం!


ఆధ్యాత్మికత-ఆనందం-ఆరోగ్యం 



  • కార్తీక మాసంలో వన భోజనాల వల్ల ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం , ఆరోగ్యం అనే సందేశం కూడా ఉంది

  • కార్తీక పౌర్ణమి రోజు నైమిశారణ్యంలో మునులంతా సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు  'కార్తీక పురాణం''లోప్రస్తావించారు.

  • భారతీయ ఆయుర్వేదంలో వృక్ష జాతికి ఎంతో ప్రాముఖ్యతనిస్తాం.  మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజించి , ఆ చెట్టుకింద వండిన ఆహారాన్ని ఆరగిస్తే  పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతోంది

  • పచ్చని చెట్లు , ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు , బంధు మిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం మానసిక ఉల్లాసాన్నిస్తుంది. 
    కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుందని చెబుతారు. కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆట , పాట కబుర్లకు చక్కటి వేదిక.

  • ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద వైద్యలు చెబుతారు. ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం , ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది. 


Also Read: కార్తీక మాసంలో ఉపవాసం ఉంటున్నారా, సోమవార వ్రతం ఆరు రకాలు - ఇందులో మీరు పాటించే విధానం ఏంటి!


నిత్య వనభోజనం చేసిన శ్రీ కృష్ణుడు
ఎవరూ మరచిపోలేనంత గొప్ప వన భోజనం చేసిన దేవుడెవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు- బలరాముడు. నిత్యం స్నేహితులతో వనభోజనానికి వెళ్లేవారు.  వాళ్ళు రోజూ వెళ్ళేది ఆ వనానికే. ప్రతి రోజూ మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అయినప్పటికీ కృష్ణుడు ప్రత్యేకంగా స్నేహితులతో చెప్పేవాడట ...రేపు వనభోజనానికి వెళదాం అని. అంటే ఆ ప్రత్యేకత, విశిష్టత ఏంటో వాళ్లకి తెలియచేయడం కోసమే. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు. భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వనసమారాధన ద్వారా తెలియజేయడం కూడా దీనివెనుకున్న ఆంతర్యం అని చెప్పుకోవచ్చు.