Nagula Chavithi 2022: పాములు పాలుతాగవు కదా..అయినా వాటిని హింసిస్తారెందుకు అని కొందరంటారు. నాగదేవతల్ని పూజించడం తరతరాలుగా వస్తోన్న సంప్రదాయం అంటారు ఇంకొందరు. అయితే ఏది నిజమో, ఏది మూఢనమ్మకమో తెలుసుకోవాలంటే పురాణాల్లో ప్రస్తావించిన కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. ఇంగ్లీష్ లో SNAKE...అనే ఒక్క పదమే ఉంది...కానీ..హిందూ ధర్మంలో నాగులు, సర్పాలని రెండు రకాలున్నాయి . నాగులు వేరు, సర్పాలు వేరు. భగవద్గీత 10 వ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడంటే.
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః
నేను ఆయుధాల్లో వజ్రాన్ని. గోవుల్లో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మన్మధుడిని, సర్పాల్లో వాసుకిని అని అర్థం. వాసుకి శివుడిని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా ఉంటుంది. ఈ వాసుకినే తాడుగా చేసుకుని క్షీరసాగర మధనం చేశారు దేవదానవులు. వాసుకి కద్రువ తనయుడు.
అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్|
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్||
నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడిని, పిత్రులలో ఆర్యముడిని, సంయమవంతుల్లో నిగ్రహాన్ని. అంటూ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తాను నాగుల్లో అనంతుడనని చెబుతాడు.
అనంతుడు అంటే ఆదిశేషుడు. అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు, వాసుకి రెండో కొడుకు. కద్రువ.. వినతకు చేసిన అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపమాచరించి ఆయనను తనమీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు. అనంతుడి బలాన్ని చూసిన బ్రహ్మ భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాల్లో స్వామివారిని అనుసరించాడని చెబుతారు...రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా, వేంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా అనుసరించాడని పురాణాలు చెబుతున్నాయి.
Also Read: కార్తీక మాసంలో ఉపవాసం ఉంటున్నారా, సోమవార వ్రతం ఆరు రకాలు - ఇందులో మీరు పాటించే విధానం ఏంటి!
సర్పాలు-నాగులకు వ్యత్యాసం ఏంటి
కృష్ణుడు సర్పాల్లో వాసుకి అన్నాడు… నాగుల్లో అనంతుడు అన్నాడు. అంటే సర్పాలు- నాగులు ఒకటి కాదా ? ఏంటి తేడా అనే సందేహం వచ్చి ఉంటుంది. నిజమే…కొంతమంది పండితులు సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు. కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెంటికీ చాలా వ్యత్యాసం వుంది. నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నైనా ధరించగలవు. సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి, భూమి మీద తిరుగాడుతాయి. నాగులకు ఒక విశిష్ట లోకం వుంది. నాగులకు వాయువు ఆహారం….అంటే కేవలం గాలిని పీల్చి మాత్రమే బతుకుతాయి. సర్పాలకు జీవరాశులు ఆహారం.
దేవతా సర్పాలు ఎవ్వరికీ చిక్కవు
సర్పాల్లో దేవతాసర్పాలు ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూల వాసన వస్తుందట. ఇవి మానవజాడలకు దూరంగా ఉంటాయి. మనిషికి గానీ, పాములు పట్టేవాళ్ళకు గాని చిక్కవు.
పాములు పాలతాగవన్నది నిజమే కానీ!
పాములు పాలు త్రాగవన్నమాట నిజం. అవి సరిసృపాలు కాబట్టి వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నంగా ఉంటాయి. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటాయి. ఆరోగ్యాన్ని, సంతానాన్ని అనుగ్రహిస్తాయి. దేవతాసర్పాలకు కూడా శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికి ఉన్నాయని హిందువుల విశ్వాసం.
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి, ఇదంతా దైవభక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే!
మనుషులతో కలసి తిరిగే నాగదేవతలు
నాగపంచమి, నాగుల చవితి లాంటి నాగదేవతారాధన తిధుల సమయంలో నాగులు కూడా మనుషులతో కలసి సంచరించేవట. ఎందుకంటే అప్పట్లో మానవులకు శౌచం ఉండేది. ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఉండేది. పాలు, పండ్లు సమర్పించి, పసుపుకుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు. క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడం, ధర్మంపై శ్రద్ధ తగ్గి, ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకముందులా మనుషుల వలే శరీరంతో సంచరించడం మానేశాయని చెబుతారు. అందుకే విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి పూజించినా సత్ఫలితాలు ఇస్తాయంటారు.
ప్రస్తుతం పుట్టల్లో కనిపించేవాటిని పూజించవచ్చా!
ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతాసర్పాలని చెప్పలేం. చాలావరకూ మామూలు పాములే. అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగప్రతిష్ట, నాగబంధం, నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి. సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢనమ్మకమేమీ లేదు. కాలక్రమంలో మారిన అలవాట్ల కారణంగా, వచ్చిన మార్పులను ప్రజలు అర్దం చేసుకోపోవడం వల్ల మూఢనమ్మకంగా మారిందని చెబుతున్నారు పండితులు.
నోట్: ఇవి పురాణాల్లో ప్రస్తావించినవి, పండితులు నుంచి సేకరించిన వివరాలు..వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..