భావోద్వేగాల నడుమ విశాఖలో అడుగుపెట్టనున్న ప్రధాని మోదీ
వైజాగ్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కు శంఖుస్థాపన చెయ్యనున్న ప్రధాని  
విశాఖ రైల్వే జోన్ పై స్పష్టత ఇస్తారా ?
స్టీల్ ప్లాంట్ పై స్పందించే అవకాశం ఉంటుందా ?
ఏపీలో ప్రధాని పర్యటనపై ప్రజలలో పెరుగుతోన్న ఆసక్తి


ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో అడుగుపెట్టనున్నారు. నవంబర్ 11 న వైజాగ్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన చేయనున్నారు. దాదాపు 400 కోట్ల రూపాయలతో వైజాగ్ రైల్వే స్టేషన్ ను దేశం లోనే అత్యుతమ స్టేషన్ లలో ఒకటిగా రూపుదిద్దే ప్రక్రియకు ఆయన శంఖుస్థాపన చేస్తారు. దాంతో పాటే విశాఖలో అనేక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలలోనూ ఆయన పాలుపంచుకోనున్నారు. ఇక విశాఖ లోని బీజేపీ నేతలు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న పార్టీ నూతన కార్యాలయానికి కూడా ప్రధాని మోదీ శంఖుస్థాపన చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా కార్యక్రమాల అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన  భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం, గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులకు ప్రధాని తో శంఖుస్థాపన చేయించేలా ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 


రైల్వే జోన్ పై స్పష్టత ఇస్తారా !
ఏపీకి కేంద్రం ఇస్తామని చెప్పిన రైల్వే జోన్ పై కేంద్రం దోబూచులాడుతోంది అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఒకసారి కొత్త రైల్వేజోన్ లేదని చెబుతూనే మరోవైపు ఏపీకి  రైల్వే జోన్ ఖచ్చితంగా ఏర్పాటవుతుంది అని చెబుతూ వస్తుంది. అయితే దానికి సంబంధించిన ఏర్పాట్ల విషయం లో మాత్రం ఎటువంటి ముందడుగు వేయడం లేదు. దానితో స్వయంగా ప్రధాని మోదీనే విశాఖకు వస్తున్న సమయంలో, అదీ కూడా రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కు సంబంధించిన విషయంలో కనుక ఆయన రైల్వే జోన్ పై కూడా స్పష్టత ఇస్తారా అనే దానిపై రాష్ట్ర ప్రజలలో ఉత్కంఠ నెలకొంది.


స్టీల్ ప్లాంట్ పై స్పందిస్తారా ?
విశాఖ ప్రజల సెంటిమెంట్ వైజాగ్  స్టీల్ ప్లాంట్ను ప్రేవేటీకరణ చెయ్యొద్దు అంటూ ఉక్కు కర్మాగారం కార్మికులు, ఉద్యోగులు నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు.  ఈ క్రమంలో విశాఖలో ప్రధాని మోదీ అడుగుపెడుతున్న వేళ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ రద్దు పై అనుకూలంగా స్పందిస్తారా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ దిశగా మోదీ ఏమైనా స్పందిస్తారేమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.


ప్రధానితో పాటు గవర్నర్, సీఎం లు ఒకే వేదికపై 
వైజాగ్ ను పాలనా రాజధానిగా చేయాలనే  ప్రణాళికల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్న వేళ ప్రధాని మోదీ వైజాగ్ కు వస్తుండడం, గవర్నర్, సీఎం జగన్ ఆయనతో కలిసి ఒకే వేదిక ను పంచుకోనుండడం రాజకీయంగానూ ఏపీలో ఆసక్తి ని కలిగిస్తుంది. ఇలాంటి పలు ఆశక్తికర అంచనాల దృష్ట్యా ప్రధాని వైజాగ్ టూర్ వైపు అందరి దృష్టి ఒక్కసారిగా మళ్లింది.