G20 Summit: బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి రిషి సునక్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. వచ్చే నెలలో బాలిలో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ భేటీ జరగనుంది.
ఇరువురు నేతల మధ్య భేటీతో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఒప్పందాలు మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి.
దాని సంగతేంటి?
రిషి సునక్ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఇరు దేశాలకు అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై అందరి దృష్టి పడింది. బోరిస్ జాన్సన్ హయాంలో భారత్-బ్రిటన్‌ల మధ్య ఎఫ్‌టీఏ ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే కొన్నాళ్లుగా బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం ఉండటంతో ఈ ఒప్పందం సహా ద్వైపాక్షిక సంబంధాలు కూడా కొంత నెమ్మదించాయి.
ఈ ఒప్పందంపై జనవరిలో మొదలైన చర్చలు అక్టోబరు లోపు పూర్తవ్వాలి. కానీ కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవటం, లిజ్‌ట్రస్ కేబినెట్‌లో హోం మంత్రిగా పనిచేసిన మరో భారత సంతతి మంత్రి బ్రేవర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలతో అది పట్టాలు తప్పింది.
వీసాలు పూర్తయినా చాలామంది భారతీయులు యూకేను వీడిపోవటం లేదంటూ భారతీయ ఎంబసీని తప్పు పట్టేలా ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా స్పందించింది కూడా! ఆ ఒప్పందాన్ని ఇప్పుడు పట్టాలకెక్కించటం రిషి సునక్ ముందున్న సవాలు.
శుభాకాంక్షలు
బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ ఎన్నికైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను అభినందించారు. రిషితో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ఏకగ్రీవం
ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్ స్థానంలో రిషి సునక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెలన్నర క్రితం ప్రధాని ఎన్నికలలో లిజ్ ట్రస్ అతనిని ఓడించారు. అయితే 45 రోజులకే ఆర్థిక సంక్షోభం కారణంగా లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రధాని పదవి రేసు నుంచి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుకోవడంతో రిషి సునక్ ఎన్నిక లాంఛనం అయింది.
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్ పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు అవసరం. రిషి సునక్‌కు 144 మంది సభ్యుల మద్దతు లభించింది.
రిషి సునక్ ఎవరు?
రిషి సునక్.. ఇప్పటివరకు ఈయన బ్రిటన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతుల నిర్వర్తించారు. మనందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునక్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా రిషి సునక్.. తీసుకున్న చర్యలకు మంచి పేరు వచ్చింది. ఆయన నిర్ణయాల వల్లే బ్రిటన్ ఆర్థికంగా కోలుకోగలిగిందని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఎన్నో సార్లు చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం 10 బిలియన్ పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని ప్రకటించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.
Also Read: Russia Ukraine War: రష్యా ఆ పని చేస్తే కథ వేరుంటది: జో బైడెన్