Bigg Boss Telugu 6: ఈ సీజన్ రసవత్తరంగా కాకుండా అనవసర గొడవలతో చెత్తగా తయారైంది. ముఖ్యంగా కొంతమంది బిహేవియర్ చూడటానికే చిరాగ్గా ఉంది. గీతూ, శ్రీసత్య, రేవంత్, శ్రీహాన్ యాటిట్యూడ్లు, కోపాలు విసుగు తెప్పించేలా ఉన్నాయి. వారంతా ఒకేసారి ఇనయా మీద దాడి చేయడం కూడా తప్పుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమెతో కావాలనే గొడవలు పడడం, ఆమెను రెచ్చగొట్టడం, ఒంటరిని చేసి తోడేళ్ల వేటాడడం ఇనయాపై సానుభూతి కలిగేలా చేస్తున్నాయి.
ఈ ఎపిసోడ్లో ఏమైందంటే... గీతూ గురించి తెలిసి కూడా ఆమెను మళ్లీ సంచాలక్ చేశారు. గేమ్‌లో భాగంగా రెడ్ టీమ్, బ్లూటీమ్ మధ్య బ్యాటన్లో కొట్టుకునే పోటీ పెట్టారు. రెడ్ టీమ్ సభ్యులైన శ్రీహాన్, రేవంత్, ఫైమా కలిసి బ్లూటీమ్ సభ్యులైన మెరీనా, వాసంతి, ఇనయాలతో పోరాడారు. మొదటి రౌండ్లో రెడ్ టీమ్ గెలిచింది. ఇక రెండో రౌండ్లో బ్లూటీమ్ గెలిచింది. ఓటమిని భరించలేని రేవంత్, శ్రీహాన్ మూడో రౌండ్లో అమ్మాయిలపై ఇష్టమొచ్చినట్టు దాడి చేశారు. అయినా సంచాలక్ గా ఉన్న గీతూ అడ్డు చెప్పలేదు. ఇష్టమొచ్చినట్టు ఆడి రెడ్ టీమ్ గెలిచింది. దీంతో బ్లూ టీమ్లోని ఒక సభ్యుడిని చంపే అవకాశం రావడంతో రోహిత్‌ని చంపేశారు.
హద్దులు దాటి తిట్లు
ఆటలో భాగంగా శ్రీహాన్, శ్రీసత్యలతో ఇనయాకు గొడవ అయింది. ఒకరి క్యారెక్టర్లు గురించి ఒకరు మాటలు అనుకోవడం మొదలుపెట్టారు. ఇనయా శ్రీహాన్ - శ్రీసత్యలు కలిసి ఒక మంచం మీద పడుకుంటున్నారు అని అంది. అది తప్పుగా అర్థం కావడంతో శ్రీహాన్ ఇనయా మీదకి వెళ్లాడు. ముఖం పగిలిపోద్ది అంటూ గొడవ పెట్టుకున్నాడు. శ్రీసత్య ‘నువ్వు బయట ఏం చేశావో, ఇక్కడ ఎలాంటి పనులు చేశావో మాకు తెలుసు. నేను నీలా ముద్దులు పెట్టించుకోలేదు, ఒళ్లో తలపెట్టుకుని పడుకోలేదు’ అంటూ ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకుంది.
కుక్కతోక వంకర
ఇక గీతూ పరిస్థితి కుక్క తోక వంకరే అని చెప్పాలి. ముందు రోజు సిగరెట్లు దాచేసి బాలాదిత్యను ఏడిపించిన గీతూ మరుసటి రోజు లైటర్ దాచేసింది. బాలాదిత్య ఎంత అడిగినా ఇవ్వలేదు. అతను చేతులెత్తి నమస్కరించి ‘నేను నిన్ను అన్నందుకు సారీ బాధలో అన్నాను దయచేసి క్షమించు’ అని చెప్పినా గీతూ వినలేదు. ఆదిరెడ్డి మాత్రం స్పందించాడు. ‘చెంప మీద కొట్టి క్షమించు అంటే అయిపోతుందా?’ అంది. నిజానికి ఈమె కొట్టిన దెబ్బలతో పోలిస్తే బాలాదిత్య తిట్టిన తిట్లు తక్కువే. ఆదిరెడ్డి ఎంత చెప్పి వినని గీతూ అక్కడ్నించి వెళ్లిపోతూ ‘నీ దగ్గర బంగారం ఉంటే జాగ్రత్త పెట్టుకోవాలి. నేను దొంగని, వెధవని, వెధవన్నర వెధవని’ అనుకుంటూ వెళ్లిపోయింది. దానికి ఆదిరెట్టి ‘ట్రూ’ అన్నాడు. అది మాత్రం హైలైట్. ఈరోజు ఇనయా రేవంత్ కూడా పాల కోసం తిట్టుకున్నారు. ఆ సమయంలో రేవంత్ బిహేవియర్ కూడా చికాకు పెట్టించేలా ఉంది. శ్రీసత్య, శ్రీహాన్, రేవంత్ గ్రూపుగా ఏర్పడి ఆడుతున్నట్టు ఉంది.
Also read: గీతూ మళ్లీ గేమ్‌ని గబ్బు కొట్టించింది, ఎదుటివారి వీక్‌నెస్ మీదే ఆట ఆడింది