Bathukamma 2024: పంచభూతాలతో మనుషులకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ జరుపుకునే పూల పండుగ బతుకమ్మ. పూలను శివలింగాకృతిలో ఎందుకు పేరుస్తారు? ఒక్కేసి పూవ్వేసి చందమామ.. శివుడు రాకపాయె సందమామా అంటూ అమ్మవారు ఎందుకు ఎదురుచూశారు?
ఔషధాలు నిండిఉండే రంగురంగుల పూలన్నింటినీ సేకరించి..వాటన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం శివలింగాకృతిలో పేరుస్తారు. చిన్నగా తయారుచేసినా, పెద్దగా తయారు చేసినా
శివలింగాకృతిలోనే అలంకరిస్తారు. దీనివెనుకున్న ఆంతర్యం ఏంటో వివరిస్తూ ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది..
అప్పట్లో తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పాలించేవారు. వేములవాడ చాళుక్యుల సామంతులుగా వ్యవహరించేవారు. క్రీ.శ 973లో చాళుక్య రాజైన తైలపాడు.. రాష్ట్రకూటుల్లో చివరి రాజైన కర్కుడిని వధించాడు. అనంతరం తన కుమారుడైన సత్యాశ్రయుడికి పట్టాభిషేకం చేయించాడు. అప్పటికే వేములవాడలో రాజరాజేశ్వరి ఆలయం ఉండేది. రాజరాజేశ్వరి అంటే అక్కడి ప్రజలకు ఎంతో విశ్వాసం ఉండేది. క్రీ.శ 985 నుంచి 1014 వరకు రాజ రాజ చోళుడు పాలన సాగించాడు.
Also Read: అందాల బతుకమ్మ.. బతుకునిచ్చే అమ్మ - తెలంగాణ అస్తిత్వానికి చిహ్నంగా నిలిచే ఈ పండుగ వెనుక కథలెన్నో!
సత్యాశ్రయుడిని యుద్ధంలో ఓడించిన రాజేంద్ర చోళుడు వేములవాడ రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేశాడు. అదే సమయంలో ఆలయంలో ఉన్న భారీ శివలింగాన్ని తీసుకెళ్లి రాజేంద్ర చోళుడు తండ్రికి బహుమతిగా అందించాడు. ఆ శివలింగాన్నే బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించినట్టు తమిళ శిలాశాసనాల్లో ఉంది.
వేములవాడ నుంచి శివలింగాన్ని వేరుచేసి తంజావూరులో బృహదీశ్వరాలయంలో ప్రతిష్టించడంతో అమ్మవారి తరపున బతుకమ్మ వేడుకలు నిర్వహించండం ప్రారంభించారు స్థానికులు. పూలను శివలింగాకృతిలో పేరుస్తూ అమ్మవారి బాధను చోళులకు తెలియజేసేలా పాటలు పాడడం ప్రారంభించారు. శివలింగాకృతిలో పూలను పేర్చి..మధ్యలో గౌరమ్మను పెట్టి...అయ్యవారి కోసం అమ్మవారు ఎదురుచూస్తోందంటూ జాము గడిచినా శివుడు రాలేదంటూ పాటలు పాడారు..ఆ సందర్భంగా పాడిన పాటే ఇది....
ఒక్కేసి పువ్వేసి చందమామా..ఒక్క జాము ఆయె చందమామా..
కింద ఇల్లు కట్టి చందమామా..పైన మఠం కట్టి చందమామా..
మఠంలో ఉన్న చందమామా..మాయదారి శివుడు చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
గౌరి గద్దెల మీద చందమామా..జంగమయ్య ఉన్నాడె చందమామా..
రెండేసి పూలేసి చందమామా..రెండు జాములయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
మూడేసి పూలేసి చందమామా..మూడు జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
నాలుగేసి పూలేసి చందమామా..నాలుగు జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడేలా రాకపాయె చందమామా..
ఐదేసి పూలేసి చందమామా..ఐదు జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
ఆరేసి పూలేసి చందమామా..ఆరు జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
ఏడేసి పూలేసి చందమామా..ఏడు జాములయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
ఎనిమిదేసి పూలేసి చందమామా..ఎనిమిది జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
తొమ్మిదేసి పూలేసి చందమామా..తొమ్మిది జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
తంగేడు వనములను చందమామా..తాళ్లు కట్టబోతిరి చందమామా..
గుమ్మాడి వనమునకు చందమామా..గుడి కట్టబోయే చందమామా..
రుద్రాక్ష వనమునకు చందమామా..నిద్ర చేయపోయె చందమామా..
నీనోము నీకిత్తునే గౌరమ్మ..నా నోము నాకియ్యవే గౌరమ్మ..
శివపూజ వేలాయె చందమామ..శివుడొచ్చి కూర్చునే చందమామ
తంగేడు పూలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునేేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గునుగు పూలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునేేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
బతుకమ్మలో పేర్చే గుమ్మడి పూలు కీళ్ల నొప్పులు తగ్గించే దివ్య ఔషధం... పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి