Health Benefits Of Tangedu Flowers : ప్రకృతి మొత్తం పచ్చదనంతో కళకళలాడుతున్న సమయంలో వచ్చే పండుగ బతుకమ్మ. ఈ సమయంలో గడ్డి మొక్క కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అందుకే ఆ పూలు, ఈ పూలు అనే వ్యత్యాసం లేకుండా, ప్రకృతి ప్రసాదించిన పూలన్నీ సేకరించి బతుకమ్మని పేరుస్తారు. ప్రకృతిని ధన్యవాదాలు తెలుపుతూ జరుపుకునే ఈ పండుగ చివరి రోజు బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. ఆ మొక్కల్లో, పూలలో ఉండే ఔషధ గుణాలన్నీ నీటిలో కలసి ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. అయితే బతుకమ్మ పేర్చేందుకు ఏ పూలు అయినా పర్వాలేదు కానీ కొన్ని పూలు మాత్రం తప్పనిసరిగా ఉండాలంటారు. వాటిలో అతి ముఖ్యమైనది తంగేడు. 


'తంగేడు పువ్వప్పునే గౌరమ్మ.. తంగేడు కాయప్పునే..' అంటూ బతుకమ్మ పాట పాడతారు. ఈ పాటే చెబుతోంది..బతుకమ్మను పేర్చడంలో తంగేడు పూలకి ఎంత ప్రత్యేకత ఉందో. మన దగ్గర ఎన్ని రకాల పూలున్నా తంగేడు లేకుంటే బతుకమ్మ పేర్చడం పూర్తికానట్టే అని భావిస్తారు. కనీసం ఒక్క తంగేడు పూవైనా బతుకమ్మలో ఉండాల్సిందే. పైగా తంగేడు తెలంగాణ రాష్ట్ర పుష్పం. ఈ పూవు దైవారాధన కోసం మాత్రమే కాదు దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.


Also Read: ప్రకృతి పండుగ బతుకమ్మ ఎలా ప్రారంభమైంది, ప్రచారంలో ఉన్న కథలేంటి!


తంగేడు చెట్టులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. తంగేడు పూలు, ఆకులు, బెరడు, వేర్లు ఇలా ఈ మొక్క అన్ని భాగాలు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అందుకే ఈ మొక్కను ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, బెరడు వేర్లతో తయారు చేసుకునే కషాయాలు అనేక అనారోగ్య సమస్యలను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 


మధుమేహం అదుపులో ఉంటుంది
తంగేడు పూల కషాయం మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు, తంగేడు పువ్వులు, ఒక స్పూన్ నల్ల వక్కల పొడి వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టుకుని తాగాలి. ఇలా నెల రోజుల పాటు తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.


Also Read: బతుకమ్మ పండుగలో పూలకు అంత ప్రాధాన్యత ఎందుకు!
 
చర్మ నిగారింపు పెరుగుతుంది
తంగేడు పూలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తంగేడు పూల పొడికి  శనగపిండి కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరచుకుంటే చర్మం నిగారింపు పెరుగుతుంది. తంగేడు పువ్వుల పొడిని ముల్తానీ మట్టితో కలుపుకుని ముఖానికి రాసుకుంటే చర్మం నిగారింపు  పెరుగుతుంది.
 
పాదాల పగుళ్లు తగ్గుతాయి
తంగేడు ఆకులను మజ్జిగతో కలిపి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాల పగుళ్లు ఉన్నచోట అప్లై చేసుకుని అరగంట తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పాదాల పగుళ్ల నొప్పి తగ్గుతుంది. పాదాల పగుళ్లు కూడా రావు.


చుండ్రు ఉండదు
తంగేడు పూలను పేస్ట్ చేసి ఎండబెట్టి కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి. ఆ నూనెను తలకు పట్టించడం ద్వారా చుండ్రు సమస్య మాయమవుతుంది. హెయిర్ ఫాల్ వుండదు. జుట్టు వత్తుగా పెరుగుతుంది.


Also Read: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే - ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!


మలబద్ధకం పరార్
తంగేడు ఆకుల పొడిని గ్లాసు గోరువెచ్చట నీటితో కలిపి ఉదయాన్నే తీసుకుంటే పేగులలో పేరుకుపోయిన మలం తేలికపడి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. 


అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది
కొందరిలో మూత్రం అధికంగా పోతుంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి తంగేడు పూల పొడిని బెల్లంతో కలసి తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ చూర్ణాన్ని ప్రతిరోజు సగం స్పూన్ చొప్పున తీసుకోవాలి
 
నీళ్ల విరోచనాలకు సరైన మందు
రెండు గ్లాసుల నీళ్లలో తంగేడు చెట్టు వేర్లను వేసి బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని వడకట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా ఈ చెట్టు వేర్లతో చేసుకునే కషాయం నీళ్ల విరోచనాలను తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది.