Importance Of Bathukamma 2023: ఈ ఏడాది  అక్టోబర్ 14  నుంచి  అక్టోబర్ 22 వరకూ  బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. పూల పండుగగా చెప్పే బతుకమ్మ కోసం ఈ పూలు ఆపూలు అని లేదు..ప్రకృతిలో దొరికే ఏ పూలైనా పేర్చొచ్చు. ప్రకృతిని ఆరాధించడమే ఇందులో ఉన్న పరమార్థం. 


బతుకమ్మని పూలతోనే ఎందుకు తయారు చేస్తారు!


వర్షాకాలం ముగిసి చలికాలం ఆరంభంలో వచ్చే పండుగ బతుకమ్మ. ఈ సమయంలో చెరువులన్నీ నిండుకుండల్లా ఉంటాయి. ప్రకృతి మొత్తం పచ్చదనంతో కళకళలాడుతుంటుంది. గడ్డి మొక్క కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అందుకే ఆ పూలు, ఈ పూలు అనే వ్యత్యాసం లేకుండా, ప్రకృతి ప్రసాదించిన పూలన్నీ...గడ్డి నుంచి గులాబీ వరకూ అన్నీ సేకరించి బతుకమ్మని పేరుస్తారు. ప్రకృతిని ధన్యవాదాలు తెలుపుతూ జరుపుకునే ఈ పండుగ చివరి రోజు బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. ఆ మొక్కల్లో, పూలలో ఉండే ఔషధ గుణాలన్నీ నీటిలో కలసి ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలంటే వినాయక పూజకి పత్రి వినియోగించడం, బతుకమ్మ వేడుకలకు పూలను ఉపయోగించడం వెనుకా ముఖ్య ఉద్దేశం ఇదే.


ఈ పూలు తప్పనిసరిగా ఉండాలి


బతుకమ్మ పేర్చేందుకు ఏ పూలు అయినా పర్వాలేదు కానీ కొన్ని పూలు మాత్రం తప్పనిసరిగా ఉండాలంటారు. ఆవేంటో చూద్దాం..


Also Read: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే - ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!


తంగేడు


'తంగేడు పువ్వప్పునే గౌరమ్మ.. తంగేడు కాయప్పునే..' అంటూ బతుకమ్మ పాట పాడతారు. ఈ పాటే చెబుతోంది..బతుకమ్మను పేర్చడంలో తంగేడు పూలకి ఎంత ప్రత్యేకత ఉందో. మన దగ్గర ఎన్ని రకాల పూలున్నా తంగేడు లేకుంటే బతుకమ్మ పేర్చడం పూర్తికానట్టే అని భావిస్తారు. కనీసం ఒక్క తంగేడు పూవైనా బతుకమ్మలో ఉండాల్సిందే. పైగా తంగేడు తెలంగాణ రాష్ట్ర పుష్పం


గునుగు


తెల్లగా, పొడుగ్గా ఉండే ఈ పూవును బుతకమ్మను పేర్చేందుకు వినియోగిస్తారు. ఇవి పొలం గట్ల వెంబడి విరివిగా పూస్తాయి. దీని శాస్త్రీయ నామం సెలోసియా. ఎన్నో ఔషధ గుణాలను కలిగున్న  గడ్డిజాతి పుష్పం. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ గుణాలు  గాయాలు నయం చేయటానికి, మధుమేహం, చర్మ సమస్యల నివారణకు ఉపయోగపడతాయి.


పట్టుకుచ్చు పువ్వు


వీటినే కొన్ని చోట్ల సీతజడ పూలు అని కూడా అంటారు. వెల్వెట్ క్లాత్‌లా చాలా మృదువుగా కనిపించే ఈ పూలు మంచి రంగుతో అందంగా మెరిసిపోతుంటాయి. బతుకమ్మలో ఈ పూలు పేరిస్తే ఆ అందమే వేరు.


Also Read: సూర్యాస్తమయం తర్వాత చేయకూడదని పనులివే!


బంతి
ఏ పండుగ వచ్చినా బంతి పూల శోభే వేరు. బంతిపూలతో ఇల్లంతా అలంకరిస్తే సగం పండుగ ఇంటికి వచ్చేసినట్టే. మరీ ముఖ్యంగా బతుకమ్మ పండుగలో బంతి సందడి మరింత ఎక్కువని చెప్పాలి. పల్లె నుంచి పట్టణాల వరకూ ఎక్కడైనా అందరికీ అందుబాటులో ఉండే ధరకే దొరికే ఈ పూలు ముద్దగా, అందంగా, వివిధ రంగుల్లో అందంగా ఉంటాయి. 


చామంతి
బతుకమ్మ తయారు చేయడంలో బంతి తర్వాత స్థానం చామంతి పూలదే. ఈ సీజన్‌లో బాగా దొరికే పూలు కాబట్టి వీటిని బతుకమ్మలో ఎక్కువగా వినియోగిస్తారు.


రుద్రాక్ష


రుద్రాక్ష పూలకు పుల్లలు గుచ్చి బతుకమ్మ పేర్చడానికి ఉపయోగిస్తారు. కాడ చిన్నగా ఉండే పూలను దండలా చేసి కూడా వినియోగించవచ్చు.


మందారం


ఎర్రటి మందార బతుకమ్మకు చక్కటి శోభను తీసుకొస్తుంది. ఒకే రెక్కతో ఉండే మందారం అయితే బతుకమ్మ పైన పేరిస్తే బావుంటుంది. ముద్ద మందారం అయితే బంతిపూల మధ్యలో పేర్చుకుంటే అందంగా కనిపిస్తుంది. మందార పూలు అవసరం అయినన్ని దొరక్కపోతే గులాబీలను వినియోగించవచ్చు


గన్నేరు


వీటిని కూడా బతుకమ్మ తయారీలో ఉపయోగిస్తారు. ముద్దగా ఉండే పూలైతే ఇంకా అందంగా ఉంటాయి.


నందివర్ధనం


రంగురంగుల పూల మధ్యలో తెల్లని నందివర్థనం ఆకాశంలో నక్షత్రాల్లా అందంగా కనిపిస్తుంది. అందుకే బతుకమ్మ పేర్చిన తర్వాత ఫినిషింగ్ లా నందవర్థనం అద్దుతారు.


మల్లెలు, లిల్లీలు 


మల్లె పూలు, లిల్లీపూలను కూడా ఉపయోగిస్తారు. వీటిని బతుకమ్మను పేర్చేటపుడు పైవరుసల్లో ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించటం వలన అందంగా కనిపిస్తుంది, ఆ పరిసరాలు మొత్తం సువాసనలు వెదజల్లుతాయి.


కేవలం మామూలు పూలతో పాటు కూరగాయ మొక్కలైన గుమ్మడి, బీర, సొర పాదులకు ఉన్న పూలను, వివిధ రకాల గడ్డి పూలను కూడా వినియోగిస్తారు.