Asian Games 2023:
ఆసియా క్రీడల్లో భారత బృందం అంచనాలకు తగ్గట్టే ఆడుతోంది. వివిధ పోటీల్లో వ్యక్తిగత, బృంద క్రీడల్లో క్రీడాకారులు పతకాలు కొల్లగొడుతున్నారు. ఆరో రోజైన శుక్రవారమూ టీమ్ భారత్‌కు పతకాలు దక్కాయి. కాగా భారత మహిళల కబడ్డీ టీమ్ చైనాలో అడుగుపెట్టింది. తమ మ్యాజిక్ చూపించేందుకు రెడీగా ఉంది.
షూటింగ్‌లో భారత్ పెట్టింది పేరు! ప్రతిసారీ ఈ విభాగంలో తన సత్తాను చాటుతూనే ఉంటుంది. అథ్లెట్లు పతకాలు సాధిస్తూనే ఉంటారు. శుక్రవారం ఉదయం మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత జట్టుకు రజత పతకం వచ్చింది. ఈషా సింగ్, దివ్యా తడిగోల్, పాలక్‌తో కూడిన జట్టు వెండి పతకాన్ని ముద్దాడింది. ఇక పది మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో 17 ఏళ్ల అమ్మాయి పాలక్ స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించింది.
పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3PS టీమ్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. స్వప్నిల్ కుశాలె, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, అఖిల్ షెరాన్‌తో కూడిన జట్టు బంగారు పతకాన్ని ముద్దాడింది. అంతేకాదు ఈ త్రయం ప్రపంచ రికార్డు సృష్టించింది. అర్హత పోటీల్లో ప్రతాప్ సింగ్ (591), స్వప్నిల్ కుశాల్ (591), అఖిల్ షెరాన్ (587) వరుసగా ఒకటి, రెండు, ఐదు స్థానాల్లో నిలిచారు.
మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత పోటీల్లో ఈషా సింగ్ అద్భుతం చేసింది. చక్కని ప్రతిభతో రజత పతకం కైవసం చేసుకుంది. ఇది ఆమెకు నాలుగో పతకం. ఇదే పోటీలో బృంద విభాగంలో టీమ్‌ఇండియాకు స్వర్ణం, రజతాలు రావడం గమనార్హం.
టెన్నిస్‌లో భారత్‌కు ఒక రజత పతకం దక్కింది. పురుషుల డబుల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్, సాకేత్ మైనేనీ జోడీ ఫైనల్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. పోరాడి ఓడి వెండి పతకం అందించింది. టెన్నిస్‌లో భారత్‌కు ఇది పదో పతకం. రామ్‌కుమార్‌కు మొదటి కాగా సాకేత్ మైనేనికి మూడోది. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో రుతుజా భోస్లే, రోహన్ బోపన్న జోడీ ఫైనల్‌కు చేరుకుంది. కనీసం రజతం ఖాయం చేసుకుంది.
ఈత పోటీల్లోనూ భారత అథ్లెట్లు ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో అద్వైత్ పేజ్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై పోటీల్లో సాజన్ ప్రకాశ్ తుది పోటీలకు అర్హత సాధించాడు.
టేబుల్ టెన్నిస్‌లో మనికా బాత్రా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అంతకు ముందు రౌండ్లో థాయ్‌ల్యాండ్‌కు చెందిన సుతాసిని సావెతాబట్‌ను ఓడించింది. మహిళల స్క్వాష్ జట్టు కాంస్యం గెలుచుకుంది. అనాహత్ సింగ్, జోష్న చిన్నప్ప, తన్వీ, దీపికా పల్లికల్‌తో కూడిన జట్టు పతకం కోసం ఎంతో శ్రమించింది.
పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3P వ్యక్తిగత పోటీల్లో ఐశ్వరీ ప్రతాప్ తోమర్ రజత పతకం కొల్లగొట్టాడు. దాంతో అతడి ఖాతాలో నాలుగో పతకం వచ్చి చేరింది. రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం అందుకున్నాడు. షూటిల్‌లో భారత్‌కు ఇది 18వ పతకం.
ప్రస్తుతం భారత్ ఖాతాలో 32 పతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎనిమిది స్వర్ణాలు, 12 రజతకాలు, 12 కాంస్యాలు దక్కాయి. నేడు మరిన్ని పతకాలు దక్కే అవకాశం ఉంది.