Cauvery Water Dispute:



జల వివాదం..


కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం మరింత ముదురుతోంది. తమిళనాడుకి నీళ్లు ఇచ్చేదే లేదని పట్టుబడుతోంది కర్ణాటక. రాష్ట్ర అవసరాలు తీర్చుకోడానికే సరిపోవడం లేదని, వాటిని ఆ రాష్ట్రానికి విడుదల చేస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని వాదిస్తోంది. ఈ వివాదంపై రెండు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. కర్ణాటక ఆందోళనకారులంతా ఇవాళ (సెప్టెంబర్ 29) బంద్ ప్రకటించారు. తమిళనాడుకి కావేరీ నదీ జలాలు విడుదల చేసేదే లేదని తేల్చి చెబుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే పలు చోట్ల నిరసనలు మొదలయ్యాయి. కన్నడ సంస్థలకు చెందిన 50 మందికి పైగా ఆందోళనకారులు పలుచోట్ల తమిళనాడుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బంద్ కారణంగా ప్రజా రవాణాకి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లు నడవడం లేదు. క్యాబ్‌లు, ఆటోలు తిరగడం లేదు.హోటల్స్‌, స్కూల్స్, కాలేజీలూ బంద్ అయ్యాయి. బెంగళూరుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలకు పిలుపునిచ్చాయి కన్నడ సంస్థలు. ఇది దృష్టిలో ఉంచుకుని బెంగళూరు, మాండ్య ప్రాంతాల్లో విద్యా సంస్థల్ని మూసివేశారు. 






బెంగళూరులో 144 సెక్షన్‌


బెంగళూరులో 144 సెక్షన్‌ విధించారు. పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. షాప్‌లు, మాల్స్‌తో పాటు మిగతా వాణిజ్య సంస్థలూ మూసేశారు. థియేటర్లూ బంద్ అయ్యాయి. పలు చోట్ల రహదారులను నిరసనకారులు అడ్డగించారు. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. ఈ బంద్‌కి అనుమతి లేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ తేల్చి చెప్పారు. సెక్షన్ 144 అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. అనవసరపు ఆందోళనలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెంగళూరు మెట్రో సర్వీస్‌లపై ఈ బంద్ ప్రభావం కనపించ లేదు. రాష్ట్ర రవాణా సంస్థ బస్‌లు డిపోలకే పరిమితమయ్యాయి. తమిళనాడుతో సరిహద్దులు పంచుకునే ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.