Basant Panchami 2025 : మాఘమాసం మొదలైన తర్వాత ఐదో రోజు వచ్చే రోజు వసంత పంచమి. జనవరి 30నుంచి మాఘమాసం ప్రారంభమైంది..పాడ్యమి, విదియ, తదియ, చవితి..ఐదో రోజు పంచమి. ఈ ఏడాది ఫిబ్రవరి 03న వచ్చింది. ఈ రోజునే  శ్రీ పంచమి, సరస్వతి పంచమి, మదన పంచమి , వసంతోత్సవం అని కూడా పిలుస్తారు. దక్షిణాదిన మాత్రమే కాదు ఉత్తరాదిన కూడా శ్రీ పంచమిని ఘనంగా జరుపుకుంటారు. 


ఫిబ్రవరి 02 ఆదివారం మధ్యాహ్నం నుంచి పంచమి తిథి మొదలైంది.. ఫిబ్రవరి 03 సోమవారం ఉదయం 10.15 వరకు మాత్రమే ఉంది.


సూర్యోదయానికి తిథి పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి..వసంతపంచమి ఫిబ్రవరి 03 సోమవారమే జరుపుకోవాలి. అయితే అక్షరాభ్యాసాలు నిర్వహించేవారు, ప్రత్యేక పూజలు చేసేవారు ఉదయం పది గంటల లోపే ముగించుకోవడం మంచిది. ఆ తర్వాత పంచమి తిథి పూర్తై షష్టి మొదలవుతుంది.


Also Read: మాఘ గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు.. విశిష్టత, పూజా విధానం ఏంటి!


వసంత పంచమి రోజు చిన్నారులకు  విద్యాభ్యాసం చేస్తే ..   ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల విశ్వాసం. చాలామంది తల్లిదండ్రులు ముహూర్తంతో సంబంధం లేకుండా అక్షరాభ్యాసాలు ఈ రోజు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. 


సరస్వతీ దేవి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ అనుగ్రహం ఉంటే సద్భుద్ధిని పొందుతారు. ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తి...వీటి స్వరూపమే సరస్వతీదేవి. 


సాధారణంగా శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజు  సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఆ రోజు అమ్మవారి జన్మనక్షత్రం అని విశేష పూజలు చేస్తారు. అయితే మాఘ గుప్త నవరాత్రుల్లో వచ్చే పంచమి తిథి సరస్వతీ దేవి ఆరాధానకు మరింత ప్రత్యేకం అంటారు పండితులు. 


Also Read: మాఘ మాసం మొదలు .. వివాహాది శుభాకార్యాలకు ముహూర్తాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు!


వ్యాసమహర్షి బాసర క్షేత్రంలో వసంత పంచమి రోజే ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించాడని స్థలపురాణం. ఈ విషయం బ్రహ్మాండపురాణంలో స్పష్టంగా ఉంది. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత మనసు చలించిన వ్యాసుడు ప్రశాంతంగా తపస్సు చేసుకునేందుకు గోదావరీ తీరంలో మధ్య భాగమైన బాసరకు చేరుకున్నారు. నదిలో స్నానమాచరిస్తుండగా అమ్మవారు ప్రత్యక్షమై..ఇసుకతో తన విగ్రహాన్ని రూపొందించి పూజించమని ఆజ్ఞాపించిందట. అలా నిత్యం పిడికెడు ఇసుక తీసుకుని నిదానంగా ఓ విగ్రహాన్ని రూపొంచించారు వ్యాసమహర్షి. అదే ఇప్పుడు కనిపించే మూలవిరాట్టు అని చెబుతారు. ఆ మూల విరాట్టుకి నిత్యం పసుపు రాస్తూ పూజలందిస్తున్నారు అర్చకులు. బాసరలో సరస్వతీ విగ్రహానికి సమీపంలో మహాలక్ష్మి, మహాకాళి విగ్రహాలు ఉంటాయి. ఇలా ముగ్గురమ్మలూ ఓ చోట కొలువై ఉండటం  చాలా అరుదుగా కనిపిస్తుంది. బాసర ఆలయంలో అమ్మవారి విగ్రహం వ్యాసమహర్షి రూపొందించడం వల్ల ఈ ప్రదేశానికి వ్యాసర అని పేరు..కాలక్రమేణా వ్యాసర బాసరగా మారింది. 


సరః అంటే కాంతి..కాంతినిచ్చేది కనుకే సరస్వతి. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణాన్ని వెదజల్లే దేవత సరస్వతి.


పద్మంలో కూర్చుని..వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రతో దర్శనమిస్తుంది


దేవతల చేతుల్లో సాధారణంగా ఆయుధాలు ఉంటాయి కానీ సరస్వతీ దేవి చేతిలో ఎక్కడా ఆయుధాలు కనిపించవు. 


జ్ఞానమే ఆమె ఖడ్గం
సంగీతమే ఆమె సాధనం
ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం


తత్వ విచారానికీ, పరిపూర్ణ వ్యక్తిత్వానికీ చిహ్నమైన కమలంపై కూర్చుని దర్శనమిచ్చే సరస్వతీ దేవి అనుగ్రహం కోసం  ‘సరస్వతీ నమస్తుభ్యం’  అని పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా దధ్ద్యోజనం సమర్పిస్తారు.  


Also Read: రథసప్తమి ఎప్పుడు..ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారు!
 
శరన్నవరాత్రి వేడుకలలా పశ్చిమ బెంగాల్ లో సరస్వతి విగ్రహానికి మూడురోజులు పూజలు చేసి గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు. పంజాబ్,బిహార్ రాష్ట్రాల్లో  దీనినే పంతంగుల పండుగగా జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వసంత పంచమిని కామదేవ పంచమి అంటారు. ఈ రోజు రతీ దేవి, కామదేవుడు వసంత రుతువు ఆగమనానికి సూచనగా రంగులు చల్లుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారట. అందుకే హోలీలా రంగులు చల్లుకుంటారు