Magha Masam 2025: ఈ ఏడాది జనవరి 30 నుంచి మాఘ మాసం ప్రారంభం అవుతోంది. కార్తీకమాసం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగినది మాఘం. ఈ నెలలో ఎన్నో పండుగలు మాత్రమే కాదు..వివాహాది శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలు వేసుకుంటారు.  కార్తీకమాసం తర్వాత అంత ప్రాముఖ్యత మాఘం సొంతం. అఘము అంటే పాపం అని అర్థం..మా అఘము అంటే పాపాలు నశింపచేసేది అని అర్థం..అందుకే దైవారాధనకు మాఘం అత్యంత విశిష్టమైనది.


కార్తీకమాసంలో వేకువజామునే దీపారాధన చేసినట్టే మాఘమాసంలోనూ నిత్యం వేకువజామునే దీపారాధన చేయడం మంచిది. దాన, ధర్మాలకు అత్యంత విశేషమైన నెల ఇది. వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు, చదువుల తల్లి సరస్వతిని పూజించేందుకు, ప్రత్యక్షదైవం అయిన సూర్యభగవానుడి ఆరాధనకు, లింగరూపంలో ఉద్భవించిన పరమేశ్వరుడి పూజకు మాఘం అత్యంత పవిత్రం.  


Also Read: కుంభం నుంచి మీనం లోకి శుక్రుడు.. ఈ 5 రాశులవారికి ప్రయోజనం..మిగిలిన వారు అప్రమత్తం!


తెలుగు నెలల ప్రకారం మాఘమాసం 11వ నెల. చంద్రుడు మఘ నక్షత్రంలో సంచరించే ఈ నెలలో సముద్ర స్నానం, నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణుడిని పూజించడం ఎన్నో పవిత్ర కార్యాలతో సమానం అని పండితులు చెబుతారు. నెల మొత్తం నదీ స్నానం చేసినా లేకున్నా మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం ఆచరించడం అత్యంత పుణ్యఫలం అంటారు. స్నానానంతరం సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. 


మాఘమాసంలో ఏ నదైనా సరే పవిత్ర గంగతో సమానమవుతుందని పురాణాల్లో ఉంది. నదీస్నానం ఆచరించే అవకాశం లేనివారు మీకు సమీపంలో ఉన్న చెరువులు, కొలనులు,బావుల వద్ద స్నానమాచరించవచ్చు. సాధారణ స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే స్నానం నిత్య విధిగా ఆచరించాలి. 


 వివిధ కార్యాలను బట్టి చేసే స్నానాల్లో రకాలుంటాయి...అవే నిత్యస్నానం, నైమిత్తిక స్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంగన స్నానం, క్రియా స్నానం. వైశాఖ మాసం, కార్తీక మాసం, మాఘ మాసం..ఈ మూడు నెలల్లో ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలను, యాగాల్లో పాల్గొనేందుకు చేసే స్నానాలను కామ్య స్నానాలు అంటారు.    


Also Read: మహా కుంభమేళాలో భారీ తొక్కిసలాట.. మౌని అమావాస్య రోజు జరిగిన ఘటన 70 ఏళ్లు గడిచినా వణికిస్తూనే ఉంది!
 
మాఘమాసంలో నువ్వులు ఆహారంగా తీసుకోవాలని, దానం చేస్తే మరింత మంచిదని చెబుతారు. నువ్వులు పంచిపెట్టే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. 


మాఘమాసం శుభకార్యాలకు కేరాఫ్..అక్షరాభ్యాసాలు, నామకరణ మహోత్సవాలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్లు సహా ఏ శుభకార్యం తలపెట్టినా మాఘంలో మంచి ఫలితం అని పండితులు చెబుతారు. ఈ నెలలో వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందని విశ్వాసం. అందుకే వివాహాలు మాఘంలోనే నిర్వహిస్తారు.  జనవరి 30 నుంచి మాఘ మాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో శుభాకార్యాల జోరు పెరుగుతుంది. జనవరి 30 నుంచి మార్చి  తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెళ్లి బజాలు మోగనున్నాయి. ఇక ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 24 వరకూ.. తిరిగి మార్చి 01 నుంచి 16 వరకూ మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత మళ్లీ ఉగాది తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెళ్లి ముహూర్తాలుంటాయి. ఆ తర్వాత ఆషాఢం మొదలవుతుంది.


Also Read: మౌని అమావాస్య రోజున కుంభమేళాకు వెళ్తున్నారా - సంగంలో స్నానం చేసే విధానం, పాటించాల్సిన నియమాలివే