Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా 2025 ప్రారంభమై అప్పుడే 15 రోజులు గడిచింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక వేడుకను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ ఉత్సవాలు దాదాపు 45 రోజుల పాటు సాగుతుండగా.. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు గంగా నదిలో, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానలాచరించారు. ఇప్పుడు రెండో పుణ్య స్నానానికి కుంభమేళా సిద్ధమవుతోంది. ఇది జనవరి 29న మౌని అమావాస్య నాడు రాబోతోంది. హిందూ పురాణాల ప్రకారం, ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజున ఈ నదిలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో.. వారి పాపాలన్నీ తొలగిపోయి, మోక్షం ప్రాప్తిస్తుందని నమ్ముతారు. అయితే మరి అంత పవిత్రమైన సంగమంలో స్నానం చేసే పద్దతి ఏంటీ అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- ఎవరైతే గంగా నదిలో స్నానం చేయాలనుకుంటున్నారో, వారు స్నానానికి ముందు తన మనస్సు, మాట, శరీరం శుద్ధి కావాలని ప్రార్థించాలి.
- ఆ తర్వాత భక్తులు గంగ, యమునా, సరస్వతి పవిత్ర నదులపై ధ్యానం చేస్తూ పవిత్ర జలంలోకి ప్రవేశించాలి.
- స్నానం చేయడం వెనుక మత విశ్వాసాలు మాత్రమే కాకుండా, ఆ వ్యక్తిని తన పాపాల నుండి విముక్తి చేయడంలో, కుటుంబానికి శ్రేయస్సు తీసుకురావడంలో కూడా సహాయపడుతుందని నమ్ముతారు.
పవిత్ర సంగమంలో ఎన్ని మునకలు చేయాలి..
హిందూ విశ్వాసాల ప్రకారం, సంగంలో మూడు రకాల స్నానాలు చేస్తారు. వాటి వెనుక ఉన్న విశ్వాసం ఏమిటంటే..
మొదటి మునక సదరు వ్యక్తి ఆత్మను శుద్ధి చేయడంలో, జీవిత పాపాల నుంచి విముక్తి చేయడంలో సహాయపడుతుంది.
రెండో మునక పూర్వీకుల ఆత్మ శాంతి కోసం చేయాలి. మత విశ్వాసాల ప్రకారం, సంగమ స్నానం పూర్వీకుల ఆత్మ శాంతి, వారికి సంతోషం కలిగిస్తుంది. ఇది వ్యక్తిని పూర్వీకుల రుణం నుండి కూడా విముక్తి చేస్తుంది.
మూడో మునకను వ్యక్తి తన కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం కోసం చేయాలి. ఈ డిప్ జీవితంలోని ఇబ్బందులను తొలగించి, కుటుంబంలో ఆనందం, శాంతిని నెలకొల్పడానికి సహాయపడుతుంది.
నాల్గో మునక సమాజం, దేశపు సంక్షేమానికి ముఖ్యమైన సహకారం చేస్తానని ప్రతిజ్ఞ చేయడాన్ని సూచిస్తుంది.