Story behind Number 3 : కాలం మారుతున్నా, జనరేషన్స్ ఛేంజ్ అవుతున్నా, టెక్నాలజీ కొంత పుంతలు తొక్కుతున్నా, అంతరిక్షంలో కొత్త కొత్త శాస్త్ర విధానాలు పుట్టుకొస్తున్నా ఇప్పటికీ కొన్ని ఆచారాలు, నియమాలు, నమ్మకాలు మాత్రం మారడం లేదు. వాటిని నమ్మితే ఎలాంటి ఆటంకాలు ఉండవని, చేసే పనుల్లో అడ్డంకులు రావని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నపుడు పిల్లి ఎదురుగా వస్తే అశుభం అని, నక్క తోక తొక్కితే శుభం అని మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పడం వినే ఉంటారు. గుడికి వెళ్తే 3, 5, 11, 21, 108 ఇలా ప్రదక్షిణలు చేస్తే మంచిదని కూడా అనడం వింటుంటాం. వినడం కాదు ఈ తరహా నమ్మకాలను ఇప్పటికీ పాటిస్తున్నారు కూడా. అలాగే ఏదైనా శుభకార్యానికి లేదా చోటుకు వెళ్లేటప్పుడు ముగ్గురు కలిసి వెళ్లకూడదని మన పెద్దలు చెప్పడం చూస్తూనే ఉంటాం. సాధారణంగా శుభకార్యాలలో 5, 7, 11, 21 ఇలా మొదలైన బేసి సంఖ్యలను శుభప్రదంగా భావిస్తారు. కానీ ఒక్క 3 అనే సంఖ్యను మాత్రం అశుభంగా పరిగణిస్తారు.
ఈ 3 నంబర్ వెనుక ఉన్న కథేంటీ..
వాస్తవంగా చెప్పాలంటే 'తీన్ తిగ్రా కామ్ బాధ' అంటే ముగ్గురు వ్యక్తులు కలిసే చోట పని చెడిపోవడం ఖాయం అని విశ్వసిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ మాట చాలా సార్లు వినే ఉంటారు. కానీ చాలా మందికి దాని అర్థం తెలియకపోవచ్చు. మన పెద్ద వాళ్లు ఇప్పటికీ ఈ సామెతను నమ్ముతారు. అందుకే ముగ్గురు వ్యక్తులు ఎక్కడికైనా శుభకార్యాల కోసం వెళ్తున్నారంటే ఒప్పుకోరు. పెద్దల నమ్మకం ప్రకారం, ఏ ముగ్గురూ ఓ పని కోసం కలిసి వెళ్లకూడదు. 3 అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు హిందూ మతంలో ఓ అశుభంగా కూడా పరిగణిస్తారు. కొందరైతే పళ్లెంలో 3 చపాతీలు వడ్డించేందుకు కూడా ఇష్టపడరు, పూజా సమయంలో ముగ్గరు వ్యక్తులు కూర్చోవడాన్నీ తప్పుపడతారు. అంటే అక్కడ 3 అనే నంబర్ వచ్చే సరికి అశుభంగా మారుతుందని వారి నమ్మకం.
3 నంబర్ నిజంగానే అశుభమా..?
నిజానికి 3 సంఖ్యను అశుభంగా భావించడం సబబేనా అన్న విషయంపై స్పందించిన జ్యోతిష్యుడు అనిష్ వ్యాస్ పలు విషయాలు వివరించారు. మత విశ్వాసాల ప్రకారం 3 సంఖ్య అశుభం కాదు. ఎందుకంటే సృష్టి అనేది 3 ప్రాథమిక స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. 3కు అర్థం వచ్చేలా ఉన్న త్రిమూర్తులు (సరస్వతి, లక్ష్మి, పార్వతి) కూడా విశ్వాన్ని నడిపిస్తారు. పరిక్రమ ప్రధాన సంఖ్య కూడా 3. ముల్లోకాలను ఏలే శివుడి త్రిశూలం కూడా 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. జాతకంలోనూ 3 గ్రహాలు ముఖ్యమైనవిగా పరిగణిస్తారు అని వ్యాస్ చెప్పుకొచ్చారు. కానీ కొందరు మాత్రం నమ్మకాల పేరుతో 3 అనే సంఖ్యను శుభమైనదిగా పరిగణించరన్నారు. అంతెందుకు హిందూ వివాహంలో వధువు మెళ్లో వరుడు వేసే 3 ముళ్లు ఎంత శుభంగా పరిగణిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో.. గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన పవిత్ర ప్రదేశం త్రివేణి సంగమంలో స్నానం చేయడం కూడా ఎన్నో కోట్ల మంది శుభంగా భావిస్తారు.
న్యూమరాలజీలో 9కి ప్రత్యేక స్థానం
న్యూమరాలజీ ప్రకారం, 9 అనే సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నంబర్ కు సంబంధించిన వారిలోనూ ప్రత్యేకమైన లక్షణాలుంటాయని నమ్ముతారు. సృజనాత్మకత, స్వీయ వ్యక్తీకరణ, నాయకత్వం, ఇతరులను ప్రభావితం చేసే సామర్థ్యం, మానవతావాదం, ఇతరులకు సహాయం చేయాలనే కోరిక, నిస్వార్థత, స్వతంత్రత అనే లక్షణాలు వీరిలో ఉంటాయని చెబుతారు. ఈ వ్యక్తులకు ఎక్కువ కోపం ఉంటుందట. ఇతరుల మాట వినకుండా వారు ఆ కోపాన్ని వ్యక్తం చేస్తారట.
Also Read : Diet Changes to Reduce Gas : కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య ఉంటే.. ఫాలో అవ్వాల్సిన డైట్ ఇదే