Jai Shree Ram: 'రామ' అనే రెండు అక్షరాలను పలికినంత మాత్రానే సమస్త కష్ట నష్టాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.అందుకే రామాలయం లేని ఊరు ఉండదు. రాముడు మా ఊరి దేవుడ అయితే ఊరికో రామాలయం ఉన్నప్పటికీ కొన్ని ఆలయాలు మరింత ప్రత్యేకం...
భద్రాద్రి
తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాద్రి. మేరువు, మేనకల కుమారుడైన భద్రుడి తపస్సుకి మెచ్చి తనకి ఇచ్చిన వరం ప్రకారం శ్రీరాముడు..సీత,లక్ష్మణ, ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని స్థలపురాణం. భద్రాద్రికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు ఘనమైన చరిత్ర కూడా ఉంది. భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహా భక్తురాలి భక్తికి మెచ్చి ఒక రోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడు. తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై ఉన్నానని.. నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చేయమని ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడని చెప్పి అంతర్థానమయ్యాడు . ఈ మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించి అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చింది. అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండపై ఆలయాన్ని నిర్మించాడు. ఏటా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరుగుతుంది..
Also Read: రావణ సంహారం అనంతరం రాముడు అయోధ్యలో అడుగుపెట్టిన రోజు ఏం జరిగిందంటే!
ఒంటిమిట్ట
ఒంటిమిట్ట కోదండ రామయ్య ఆలయం ప్రత్యేకతలకు నిలయం. చారిత్రక, రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం. ఒకే శిలపై కొలువైన సీతారామలక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం అద్భుతం. ఎత్తయిన గోపురాలు, విశాలమైన ఆలయ రంగమంటపం, శిల్పకళా వైభవం దర్శించుకునేందుకు రెండు కళ్లు సరిపోవు. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తప్పస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. హనుమంతుడు రాముడిని కలిసేందుకు మునుపే ఈ ప్రాంతంలో శ్రీ రామచంద్రమూర్తి సంచరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయస్వామి కనిపించడు. ఇక్కడ శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. శ్రీరామనవమి తర్వాత వచ్చే పున్నమి వెలుగుల్లో కళ్యాణ వేడుక జరుగుతుంది.
Also Read: 'రామో విగ్రహవాన్ ధర్మః' అని ఎందుకంటారు - రాముడు ధర్మం తప్పిఉంటే !
రామతీర్థం
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో ఉన్న రామతీర్ధం ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మొదటి విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ 469-496 AD మధ్యకాలంలో ఇక్కడ రాజ్యపాలన చేసినట్లు, ఆ సమయంలోనే ఇక్కడో చిన్న ఆలయం ఉండేదని చరిత్ర చెబుతుంది. కొన్నేళ్ల తర్వాత ఆ ఆలయ జాడ కనుమరుగైపోయిందట. మళ్లీ 16వ శతాబ్దంలో ఓ వృద్ధురాలికి ఇక్కడి చెరువులో శ్రీరామునితో సహా ఇతర దేవతా మూర్తులు విగ్రహాలు దొరికాయి . ఈ విషయం తెలుసుకున్న అప్పటి పూసపాటి వంశానికి చెందిన మహారాజు భారీ ఆలయం నిర్మించి విగ్రహాలు ప్రతిష్టించారు. చెరువులో దొరికిన విగ్రహాలు కావడం వల్లే రామతీర్థం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని నిర్మించి విగ్రహాలు ప్రతిష్టించడమే కాదు...ఆలయ నిర్వహణకోసం కొన్ని భూములు ఇనానంగా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఇచ్చిన ఆ భూముల ఆదాయంతోనే ఇప్పటివరకూ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఏటా ఇక్కడ జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయానికి ఉత్తరాన రెండు కిలోమీటర్ల పొడవూ 600 మీటర్లు ఎత్తున్న ఏకశిలా పర్వతం కనిపిస్తుంది. దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు. ఈ ప్రాంతంలో జైనులు, బౌద్ధులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి!
గొల్లల మామిడాడ
కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడను గోపురాల మామిడాడ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 160 అడుగుల ఎత్తు గోపురం కలిగిన రామాలయం, వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సూర్యదేవాలయం ఉన్నాయి. ఈ ఊరిలోకి అడుగుపెడుతూనే ఎన్నో గోపురాలు దర్శనమిస్తుంటాయి. ఇక్కడున్న దేవాలయాలు వందేళ్ల క్రితం అప్పటి జమిందార్లు నిర్మించారని చెబుతారు. శ్రీరామనవమి వంటి పర్వదినాల్లో భక్తులు భారీగా తరలివస్తారు.
డిచ్ పల్లి ఖిల్లా రామాలయం
ఆధ్యాత్మిక క్షేత్రాలలో అరుదైన ఆలయం డిచ్ పల్లి ఖిల్లా రామాలయం. ‘తెలంగాణ ఖజురహో’గా పేరొందిన ఈ ఆలయం నిజామాబాద్ కి 27 కి.మీ ల దూరంలో ఉంది. అంటే హైదరాబాద్ నుంచి 167 కి.మీ. ల దూరం ఉంటుంది. ఈ ఆలయం పై భాగాన, చుట్టూరా ఉన్న ప్యానెల్ అంతా కూడా వాత్సాయన కామసూత్రల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన శిల్పాలే కావడంతో అవి సహజంగానే ‘ఖజురహో’ను గుర్తుకు తెస్తాయి. ఈ ఆలయంపై ఉన్న శిల్పాలను స్థానికులు ‘గిచ్చు బొమ్మలు’గా పిలిచేవారని, సంస్కృతంలో ‘గిచ్చు’ శృంగారానికి పర్యాయ పదం కావడంతో ఈ ఊరుని ‘గిచ్చుపల్లి’ అని, అదే ‘డిచ్ పల్లి’గా మారిందనీ అంటారు. 12 లేదా 13వ శతాబ్దంలో వ్యాపార కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో యుద్ధానికి సంబంధించిన వస్తువులు అమ్మేవారు.
Also Read: హోమాలు, యజ్ఞయాగాలు ఎందుకు - వాటివల్ల ఏం ఉపయోగం!
శంషాబాద్ రామాలయం
శంషాబాద్‌లో ఉన్న అమ్మపల్లి సీతా రామ చంద్ర స్వామి ఆలయానికి 12వ శతాబ్దం నాటి గొప్ప చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం, ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో చాళుక్య రాజవంశం నిర్మించింది. ఈ ఆలయం దక్షిణ భారత సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ ఆలయం రామాయణంలోని సన్నివేశాలను వర్ణించే శిల్పాలతో ఉంటుంది. శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.
వాయల్పాడు
చిత్తూరు జిల్లా 'వాయల్పాడు'లో వాల్మీకి మహర్షి తపస్సు చేశాడని చెబుతారు. ఇక్కడ పుట్టలోంచి బయటపడిన సీతారాముల విగ్రహాలనే ఆలయంలో ప్రతిష్టించారని చెబుతారు. 'వల్మీకం'(పుట్ట) నుంచి రాముడు ఆవిర్భవించాడు కాబట్టి, ఈ ప్రాంతానికి 'వాల్మీకి పురం' అని పిలుస్తారు. ఇక్కడ బోయలు ఎక్కువగా నివసించడం వలన 'బోయలపాడు' అని కూడా పిలిచేవాళ్లు. కాలక్రమంలో ఈ రెండూ కలిసి వాల్మీకపాడుగా ..వాయల్పాడుగా ప్రసిద్ధి చెందింది. అన్నమయ్య కూడా ఇక్కడి స్వామిని దర్శించి అనేక కీర్తనలతో అభిషేకించినట్టు ఆధారాలు వున్నాయి. విశాలమైన ప్రాంగణం ... ఎత్తైన రాజగోపురం, పొడవైన ప్రాకారాలతో ఆలయం అందంగా తీర్చిదిద్దినట్టుగా వుంటుంది. ఇక్కడి రాజగోపురాన్ని ఓ ఆంగ్లేయ అధికారి స్వామివారి పట్ల భక్తితో నిర్మించడం విశేషం. హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో వాల్మీకి, రుక్మిణీ - సత్యభామా సమేత శ్రీ కృష్ణుడు, శ్రీదేవి - భూదేవి సమేత రంగనాథుడు, అనంతపద్మనాభ స్వామిని కూడా దర్శించుకోవచ్చు.