టీమిండియా(Team India) స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ 20 క్రికెట్‌లో ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. టీ20 ప్రపంచకప్-2022 తర్వాత కోహ్లి ఏడాదికి పైగా టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇండోర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌లో 14 నెలల తర్వాత కోహ్లీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ 16 బంతుల్లోనే నాలుగు ఫోర్ల సాయంతో 29 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ టీ20లో లక్ష్య ఛేదనలో 2000 పరుగుల మైలురాయిని కోహ్లి అందుకున్నాడు. టీ 20 క్రికెట్ చరిత్రలో ఛేజింగ్‌లో 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్ ఛేజింగ్‌లో కోహ్లి 46 ఇన్నింగ్స్ ఆడి 136.96 స్ట్రైక్‌రేటుతో 2012 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు కోహ్లీని మరో రికార్డు ఊరిస్తోంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే...
మరో ఆరు పరుగులు చేస్తే
అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడో టీ 20 మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ మరో ఆరు పరుగులు చేస్తే విరాట్ కోహ్లి.. టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో క్రిస్ గేల్(14562), షోయబ్ మాలిక్(12993), కీరన్ పొలార్డ్(12430) తర్వాతి స్థానాల్లో నిలుస్తాడు.
టీ 20లో అన్ని ఫార్మట్లలో కలిపి...
దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ(టీ20) ట్రోఫీలో భాగమైన కోహ్లి.. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా టీమిండియాకు ఆడుతూ.. అన్నీ కలిపి పొట్టి ఫార్మాట్లో పదకొండు వేలకు పైగా పరుగులు సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో టీ20లలో 4037 పరుగులు సాధించిన విరాట్ కోహ్లి నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అదే విధంగా.. ఐపీఎల్‌లోనూ 7263 రన్స్‌తో హయ్యస్ట్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు.
నేడే మూడో టీ 20
అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 2-0 ఆధిక్యంతో సొంతం చేసుకున్న భారత్ క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. చివరి మ్యాచ్ నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. ఇది నామమాత్రం మ్యాచే అయినా టీ-20 ప్రపంచకప్‌నకు భారత్ ఆడే చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. దీన్ని సన్నాహకంగా సద్వినియోగం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. వికెట్ కీపర్ జితేశ్ శర్మ స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్ లేదా రవి బిష్ణోయ్‌లలో ఒకరిని తప్పించి కుల్‌దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అవేశ్ ఖాన్ కోసం పేసర్ ముకేశ్ కుమార్‌పై వేటు పడనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు పరుగుల ఖాతా తెరవని కెప్టెన్ రోహిత్ ఈ మ్యాచ్‌లో గాడిన పడాలని చూస్తున్నాడు.