అఫ్గానిస్థాన్‌(Afghanistan)తో మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 2-0 ఆధిక్యంతో సొంతం చేసుకున్న భారత్‌ (Team India)క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. చివరి మ్యాచ్‌ నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వేదికగా జరగనుంది. ఇది నామమాత్రం మ్యాచే అయినా టీ-20 ప్రపంచకప్‌నకు  భారత్‌  ఆడే చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఇదే కావడం గమనార్హం. దీన్ని సన్నాహకంగా  సద్వినియోగం చేసుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది. అందుకే మ్యాచ్‌కు ముందు కఠోర ప్రాక్టీస్‌ చేసింది. అయితే టీమిండియా ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఓ అనుకోని అతిథి.. వారితో ముచ్చటించడం సోషల్‌ మీడియాను షేక్‌ చేసేస్తోందియ

 

ఇంతకీ ఆ అతిథి ఎవరంటే..

గాయం కారణంగా సుమారు 13 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న స్టార్‌ బ్యాటర్‌, యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌.. ప్రాక్టీస్‌ సెషన్‌కు వచ్చి విరాట్‌ కోహ్లీతో పాటు మిగిలిన భారత క్రికెటర్లతో ముచ్చటించాడు. పంత్‌తో కోహ్లీ సహా  భారత ఆటగాళ్లు ముచ్చటిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో విరాట్‌ కోహ్లీ, రింకూ సింగ్‌లతో కలిసి మాట్లాడుతున్న వీడియోను కోహ్లీ ఫ్యాన్ ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్న పంత్‌.. ఇప్పుడిప్పుడే ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే పనిలో ఉన్నాడు. 

 

తీవ్రంగా శ్రమిస్తున్న పంత్‌

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న టీమిండియా వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్‌ రిషభ్ పంత్ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఏడాదిగా పంత్‌ మైదానంలో అడుగు పెట్టనే లేదు. ఈ క్రమంలోనే 2023 వన్డే వరల్డ్ కప్‌ కూడా మిస్సయ్యాడు. వచ్చే ఏడాది టీ-20 ప్రపంచ కప్ జరగనుంది. అంతకుముందే ఐపీఎల్-2024 కూడా జరగనుంది. రోడ్డు ప్రమాదం తర్వాత పంత్ ఇప్పటివరకు బ్యాట్ పట్టలేదు. మరి ఆ టోర్నీల్లో ఆడతాడో లేడో ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే.. పంత్ మాత్రం క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కారు ప్రమాదంలో గాయపడ్డ పంత్ గత ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. ఈసారి ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో పునరాగమనం కోసం తీవ్రకసరత్తు చేస్తున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ ల ప్రారంభం నాటికి పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో ఉండేందుకు శ్రమిస్తున్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లలో పంత్ కూడా ఉన్నాడు.

 

బరువు తగ్గించుకునే పనిలో...

 ప్రస్తుతం తన బరువును తగ్గించుకొని ఫిట్ గా ఉండేందుకు పంత్ జిమ్ లో వర్కవుట్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నాడు. తిరిగి వస్తున్నాను అని పంత్ రాశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో బరువులు ఎత్తుతూ పుష్‌అప్స్ తీస్తున్న వీడియోను పోస్ట్ చేసి.. బౌన్సింగ్ బ్యాక్ విత్ ఎవ్‌రీ రిప్ అని పంత్‌ కామెంట్ పెట్టాడు. అంటే ఏ అవకాశాన్ని వదలట్లేదని అర్థం వచ్చేలా అన్నాడు. పంత్‌ను ఐపీఎల్- 2024 కోసం ఢిల్లీ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకోగా.. భారత మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2025 ఐపీఎల్ కోసం.. చెన్నై సూపర్ కింగ్స్ పంత్‌ను తీసుకునే అవకాశం ఉందని అంచనా వేశాడు. ధోనీ వారసుడిగా పంత్‌ కోసం చెన్నై చూస్తుండొచ్చని, ఇది మంచి ఎంపిక అని వ్యాఖ్యానించాడు.