ఇంగ్లండ్(England)తో టెస్టు సిరీస్ ఆడేందుకు టీమ్‌ఇండియా(India) సిద్ధమైంది. జనవరి 25 నుంచి సిరీస్‌లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టుల కోసం జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానే(Ajinkya Rahane) పేరు లేదు. రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో ముంబైకి కెప్టెన్‌గా ఉన్న రహానె... తన జట్టుకు మళ్లీ దేశవాళీలోనే ప్రతిష్టాత్మక ట్రోఫీని అందించే దిశగా ముందుకు సాగుతున్నాడు. అయితే బ్యాటర్‌గా రహానె ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. 2020-21 సీజన్‌లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ విజయం సాధించింది. ఈ చిరస్మరణీయ సిరీస్‌కు రహానె కెప్టెన్‌గా వ్యవహరించాడు. చాలా మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియాను ఆదుకున్న రహానే... ప్రస్తుతం జట్టులో చోటు కోల్పోయి.. ఫామ్ కోల్పోయి కష్టాలు పడుతున్నాడు. 35 ఏళ్ళ రహానే టెస్టు జట్టులో అవకాశం దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. అయినా రహానే తనపైన నమ్మకాన్ని కోల్పోలేదు. జట్టులోకి తిరిగి వస్తానని ధీమాగా చెప్తున్నాడు. తన లక్ష్యమేంటో కూడా ఈ ముంబై బ్యాటర్ బయటపెట్టాడు.
జట్టులోకి మళ్లీ వస్తా
భారత జట్టులో చోటు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న రహానె ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ముంబయి తరఫున మెరుగైన ప్రదర్శన చేయడంపైనే ప్రస్తుతం మొత్తం దృష్టి పెట్టానని రహానే అన్నాడు. ట్రోఫీని గెలవాలంటే టోర్నీ ఆసాంతం నిలకడగా ఆడాలని.... అది సవాలుతో కూడుకున్నదని.. రహానే అన్నాడు. ముంబైకి రంజీ ట్రోఫీ అందించడంతో పాటు భారత్ తరపున 100 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడాలనే రెండు లక్ష్యాలున్నాయని రహానే వెల్లడించాడు. ప్రస్తుతం తన దృష్టాంతా ముంబైను విజేతగా నిలపడంపైనే ఉందని వరుసగా రెండో విజయం సాధించిన తర్వాత రహానే అన్నాడు. అజింక్య ఇప్పటివరకు భారత్ తరఫున 85 టెస్టులు ఆడి 5077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలున్నాయి. 102 క్యాచ్‌లు కూడా పట్టాడు.
రంజీల్లో విఫలం
గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైనప్పటికీ.. ఆంధ్రతో జరిగిన రెండో మ్యాచ్ సందర్భంగా జట్టుతో చేరాడు. ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి విమర్శల పాలయ్యాడు. అయినా ఈ మ్యాచ్‌లో ముంబై ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందడంతో సారథిగా రహానేకు మంచి మార్కులే పడ్డాయి.
ఐపీఎల్‌లో అద్భుతాలు చేస్తాడా
టీమిండియా దారులు మూసుకుపోయినా రహానేకు మాత్రం ఐపీఎల్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కు అతడు గత సీజన్‌లో ఆడాడు. ఈసారి కూడా బాగా ఆడితే మరికొన్నాళ్లపాటు కొనసాగగలడు. నిజానికి చెన్నైకి ఆడటం ముఖ్యం కాదు.. అక్కడ ధోని కెప్టెన్ కాబట్టి ఆ జట్టుకు ఆడి నిరూపించుకుంటే మళ్లీ టీమిండియా తలుపు తట్టవచ్చని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయం తర్వాత రహానే వరుసగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో చెన్నైకి ఆడిన అతడు ఫుల్‌ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో చాలాకాలం తర్వాత ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ సందర్భంగా టీమిండియాకు ఆడే చాన్స్ వచ్చింది.