Kuldeep Yadav Painting Of Sri Ram: దేశ వ్యాప్తంగా ఎటు చూసినా అయోధ్య రామ మందిరంపై చర్చ జరుగుతోంది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రాముడి విగ్రహం పున:ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. దాంతో గత కొన్ని రోజులుగా అయోధ్య గురించి, రాముడి గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. రాముడి ఆలయం ఇప్పుడు మరోసారి ఎందుకు నిర్మించారు, గతంలో ఏం జరిగిందనే విషయాలు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతున్నాయి. రాజకీయ, క్రికెట్, వ్యాపార, సినీ ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు అయోధ్య రామ మందిరం కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానాలు అందుతున్నాయి.
అయోధ్య రాముడిపై అభిమానం చాటుకున్న కుల్దీప్ యాదవ్..
మైదానంలో దిగాడంటే ప్రత్యర్థి బ్యాటర్లను గింగిరాలు తిరిగే బంతులతో ముప్పు తిప్పలు పెట్టే టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల్లో అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానుండగా.. కుల్దీప్ యాదవ్ టాలెంట్ వైరల్ అవుతోంది. టీమిండియా స్టార్ బౌలర్ కుల్దీప్ యాదవ్.. శ్రీరాముడు, ఆంజనేయుడి పెయింటింగ్స్ వేశాడు. రే అనే నెటిజన్ కుల్దీప్ పెయింటింగ్స్ ను ట్విట్టర్ (ఎక్స్) లో పోస్ట్ చేశాడు. ప్రొఫెషనల్ పెయింటర్స్ తరహాలో కుల్దీప్ వేసిన శ్రీరాముడు, అంజనీ పుత్రుడు హనుమాన్ చిత్రాలు ఉన్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మైదానంలో ఈ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ టాలెంట్ మాకు తెలుసునని, ఆఫ్ ద ఫీల్డ్ కుల్దీప్ ఇలా దేవుడి బొమ్మల్ని ఎంతో శ్రద్ధగా గీస్తాడని.. ఇది దేవుడు తనకు ఇచ్చిన గొప్ప టాలెంట్ అని కామెంట్ చేస్తున్నారు.
కుల్దీప్ ఈ పెయింటింగ్స్ ఎప్పుడు వేశారంటే..
మైదానంలో కుల్దీప్ యాదవ్ ఎడమచేతి మణికట్టు స్పిన్‌తో వికెట్లు తీసి మాయాజాలం చేసేవాడు. అతడికి పెయింటింగ్ ఓ హాబీ. అయితే కుల్దీప్.. శ్రీరాముడు, హనుమంతుడి పెయింటింగ్స్ తాజాగా వేసినవి కాదండోయ్. కరోనా సమయంలో లాక్‌డౌన్, సోషల్ డిస్టాన్సింగ్ సమయంలో 2020లో కుల్దీప్ ఈ పెయింటింగ్స్ గీశాడు. మ్యాచ్‌లు లేకపోవడంతో ఇంటి వద్ద ఉన్న సమయంలో కుల్దీప్ పెయింటింగ్ హాబీతో కొంతకాలం గడిపాడు. తన సోదరుడికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టమని క్రికెటర్ సోదరి డింపుల్ యాదవ్ గతంలోనే వెల్లడించారు. దాదాపు 10, 12 ఏళ్ల వయసులో కుల్దీప్ తొలి పెయింటింగ్ వేశాడని, అప్పుడు తను నాలుగో తరగతి చదువుతున్నాడని చెప్పారు. ఓ వైపు క్రికెటర్ గా ఎదుగుతునే, మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా కలర్ బ్రష్ లతో కాలక్షేపం చేసేవాడని చెప్పడం తెలిసిందే. ఈ 22న అయోధ్యలో రాముడి పున:ప్రతిష్ట జరగనుండగా ఓ నెటిజన్ కుల్దీప్ టాలెంట్ ను మరోసారి గుర్తుచేశాడు.
అయోధ్య రామ మందిరం కార్యక్రమానికి హాజరు కావాలని భారత క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్లకు ఆహ్వానాలు అందుతున్నాయి. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సహా పలువురు క్రికెటర్లను ఆహ్వానించారు.