భారత్, ఇంగ్లాండ్( IND Vs ENG) మధ్య తొలి టెస్టు మ్యాచ్‌కు ఈ నెల 18 నుంచి టికెట్ల అమ్మకాలు జరగనున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో 25న ఆరంభం కానున్న ఈ మ్యాచ్ టికెట్లను పేటీఎం ఇన్‌సైడర్ యాప్‌లో విక్రయించనున్నారు. మిగిలిన టికెట్లను 22వ తేదీ నుంచి ఆన్‌లైన్‌తో పాటు జింఖానాలో అమ్ముతారు. కనీస టికెట్ ధర రూ. 200 కాగా.. గరిష్ఠంగా రూ. 4 వేలు ఉంది. మ్యాచ్ సందర్భంగా 25 వేల కాంప్లిమెంటరీ పాసులను పాఠశాల విద్యార్థులకు కేటాయించారు. విద్యార్థులకు ఉచిత భోజనం కూడా అందిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తెలిపారు.
తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న సాయుధ దళాల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను గణతంత్ర దినోత్సవం నాడు ఉచితంగా మ్యాచ్‌కు అనుమతిస్తామని చెప్పాడు. ఆసక్తి గల వారు ఈ నెల 18వ తేదీలోపు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖను, కుటుంబ సభ్యుల వివరాలను హెచ్‌సీఏ సీఈవోకు మెయిల్ చేయాలని వివరించారు. ఈ మ్యాచ్‌కు ముందు హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక కుటుంబాలకు ఉచితంగా ప్రవేశం కల్పించనుంది. మరుసటి రోజు గణతంత్ర దినోత్సవం(Republic Day) ఉన్నందున సైనికుల గౌరవార్థం వాళ్ల కుటుంబాలను ఫ్రీగా అనుమతించనుంది.
అందుబాటులో విశాఖ మ్యాచ్ టిక్కెట్లు ..
విశాఖ(Visakha)లో ఇండియా - ఇంగ్లాండ్(Ind vs Eng Test) మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ విశాఖ VDCA స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు జరుగుతుందని ACA కమిటీ సభ్యలు వెల్లడించారు. మ్యాచ్ కోసం ఆన్ లైన్ లో టికెట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే 26 నుంచి ఆఫ్ లైన్ లో టికెట్లు అమ్మకాలను ఉంచుతామన్నారు. అదే విధంగా రోజుకు 2000 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని ACA కమిటీ సభ్యలు తెలిపారు. రెండు క్రికెట్ జట్లకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని జల్లా కలెక్టర్ మల్లిఖకార్జున అన్నారు. స్టేడియం దగ్గర ఎలాంటి సంఘనలు జరగకుండా...ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూస్తామని నగర సీపీ రవి శంకర్ అయ్యర్ తెలిపారు.
పటిష్ట భద్రత
ఫిబ్రవరి 2 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశమైంది. నిర్వాహక కమిటీ చైర్మన్, కలెక్టర్ మల్లికార్జున సహా ఏసీఏ సభ్యులు పాల్గొని కీలక అంశాలపై చర్చించారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే దేశ, విదేశీ అభిమానులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూడంచెల పటిష్ట భద్రతతో పాటు తాగునీరు, మెడికల్ సదుపాయాలు, తగినన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, ఉల్లాసభరిత వాతావరణం లో మ్యాచ్ చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే క్రికెట్ ప్రేమికుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పేటీఎం యాప్ ద్వారా, ఈసారి పూర్తిగా డిజిటల్ టికెట్లను అందించనున్నట్లు వివరించారు. 100, 200, 300, 500 రూపాయల టికెట్లను ప్రతి రోజుకు విడివిడిగా విక్రయిస్తామని.. అలాగే ఐదు రోజులకు కలిపి తీసుకునే వారి కోసం టికెట్ ధరలను రూ.400, 800, 1,000, 1,500గా ఉంటుందన్నారు.