పాకిస్థాన్‌(Pakistan)తో టీ 20 సిరీస్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న న్యూజిలాండ్‌(New Zealand)కు పెద్ద షాక్‌ తగిలింది. ఆ జట్టు సారధి కేన్ విలియ‌మ్సన్‌(Kane Williamson) మ‌రోసారి గాయ‌ప‌డ్డాడు. రెండో టీ20లో బ్యాటింగ్ చేస్తుండ‌గా విలియమ్సన్‌ తొడ‌కండ‌రాల నొప్పితో బాధ‌ప‌డ్డాడు. దాంతో రిటైర్డ్ హ‌ర్ట్‌గా మైదానం వీడిన విలియ‌మ్సన్ ఆ త‌ర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. గాయం తీవ్రత చిన్నదే అయినా డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారని కివీస్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. దీంతో ఈ స్టార్ ప్లేయ‌ర్ టీ20 సిరీస్‌లో మిగ‌తా మూడు మ్యాచ్‌ల‌కు దూరం కానున్నాడు. అత‌డి స్థానంలో టిమ్ సీఫ‌ర్ట్ జట్టులోకి రానున్నాడు. అయితే.. ద‌క్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ లోపు విలియ‌మ్సన్ ఫిట్‌గా మార‌తాడని హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపాడు.


త్వర‌లోనే ద‌క్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లు ఉన్నాయని... ప్రపంచ టెస్టు చాంపియ‌న్‌షి 2023-25 బెర్తు సాధించేందుకు ఈ మ్యాచ్‌లు తమకు చాలా ముఖ్యమైనవి అందుకే విలియమ్సన్‌కు విశ్రాంతి ఇచ్చామని స్డీడ్‌ వెల్లడించారు. ఈ మ్యాచ్‌లలోపూ విలియ‌మ్సన్ కోలుకొని, ఫిట్‌గా మార‌తాడ‌ని భావిస్తున్నామని స్టీడ్‌ తెలిపాడు.


టిమ్ సౌతీ చరిత్ర
న్యూజిలాండ్‌(New Zealand )సీమర్‌ టిమ్‌ సౌతీ(Tim Southee) చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 150 వికెట్ల(150 T20I wickets) మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్‌(Pakistan)తో జరిగిన తొలి టీ20లో సౌతీ ఈ అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో టిమ్‌ సౌతీ.. మహ్మద్‌ రిజ్వాన్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌లను అవుట్‌ చేసి ఈ ఘనత సాధించాడు. అబ్బాస్‌ ఆఫ్రిదిని అవుట్‌ చేయడంతో అంతర్జాతీయ టీ20లలో 150 వికెట్లు తీసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టిమ్‌ సౌతీ 151 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 140 వికెట్లతో బంగ్లాదేశ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 226 పరుగులు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 18 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. 


పోరాడినా తప్పని ఓటమి
ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. హ్యామిల్టన్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో పాక్‌ను 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఓడించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. ఫిన్‌ అలెన్‌ (41 బంతుల్లో 74;) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో అలెన్‌ మినహా ఎవరూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. లక్ష్య ఛేదనలో తడబడిన పాక్‌.. 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. కివీస్‌ పేసర్‌ ఆడమ్‌ మిల్నే నాలుగు వికెట్లతో పాక్‌ పతనాన్ని శాసించాడు. బాబర్‌ ఆజమ్‌ (66), ఫకర్‌ జమాన్‌ (50) అర్ధసెంచరీలతో రాణించినా పాక్‌కు ఓటమి తప్పలేదు.