Ayodhya Ram Mandir: అయనము అంటే నడక అని అర్థం. రామాయణము అంటే రాముని నడక అని అర్థం. సరిగ్గా గమనిస్తే శ్రీ మహవిష్ణువు  దశావతారాల్లో ఒక్క రామావతారంలో తప్ప ఇక ఏ అవతారం గురించి ప్రస్తావనలోనూ అయనము అనే మాట వినియోగించలేదు. ఎందుకంటే  రామావతారంలో స్వామి పరిపూర్ణముగా మానవుడే.  అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడిని అనికానీ, దైవత్వం గురించి ప్రకటించడం కానీ చేయడు ( కృష్ణావతారంలో తానే భగవంతుడిని అని చెబుతాడు కృష్ణుడు) 


శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి


Also Read: హోమాలు, యజ్ఞయాగాలు ఎందుకు - వాటివల్ల ఏం ఉపయోగం!


 “రామస్య ఆయనం రామాయణం” అంటారు కదా మరి రాముడి కదలికకు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది. అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే అది సత్యం .ఆయన నడక ఆయన కదలిక అంతా సత్యం ధర్మమే అందుకే  “రామో విగ్రహవాన్ ధర్మః ” అన్నారు . అలాంటి రాముడు ధర్మం తప్పి ఉంటే ...రామాయణంలో కొన్ని కాండలు లేవనే చెప్పుకోవాలి...


అవసరం కోసం ధర్మాన్ని పక్కనపెట్టేయలేదు
తన అవసరం కోసం రాముడు ధర్మాన్ని పక్కనపెట్టేసి ఉంటే..కిష్కిందకాడంలో సుగ్రీవుడితో స్నేహం మానేసి వాలితో స్నేహం చేస్తే చాలు సమస్య వెంటనే పరిష్కారం అయిపోయేది. ఎందుకంటే రావణుడు తన జీవితకాలంలో ఓడిపోయింది వాలి, కార్తావీర్యార్జునుడు, మాంధాత చేతిలోనే. అందుకే రావణుడు వాలితో స్నేహం చేశాడు. అదే వాలితో రాముడు చేయి కలిపి ఉంటే సీతను తీసుకొచ్చి అప్పగించేవాడే..కానీ రాముడు ఆపని చేయలేదు. అధర్మపరుడైన వాలితో స్నేహం కన్నా సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంహరించి, సేతువు నిర్మించి , రావణుడితో యుద్ధం చేసి సీతను పొందాడు. రాముడు ధర్మాన్ని ఆచరించాడని చెప్పడానికి ఇంతకన్నా ఉత్తమ నిదర్శనం ఏం కావాలి. 


Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి! 


వాల్మీకి - నారదుడు
ఓ సందర్భంలో నారదుడితో  వాల్మీకి మహర్షి ఇలా అడిగారట...
నిత్యం సత్యం పలికే వాడు, నిరతము ధర్మం నిలిపే వాడు, చేసిన మేలు మరువని వాడు, సూర్యునివలనే వెలిగే వాడు, ఎల్లరికి చలచల్లని వాడు, ఎదనిండా దయగల వాడు...సరియగునడవడివాడు...ఈ లోకంలో ఎవరున్నారని ఓసారి నారదమహర్షిని అడిగాడట వాల్మీకి. ఈ ప్రశ్నలన్నింటికీ ఆయన చెప్పిన ఒకే ఒక సమాధానం శ్రీరామచంద్రుడు. ఓం కారానికి సరి జోడు, జగములు పొగిడే మొనగాడు, విలువులు కలిగిన విలుకాడు, పలుసుగుణాలకు చెలికాడు, చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు..దశరధ తనయుడు దానవ దమనుడు జానకిరాముడు...అతడే శ్రీరాముడు శ్రీరాముడు అని సమాధానమిచ్చాడు నారద మహర్షి. 


అందుకే రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలని చెబుతారు. రాముడు దేవుడు అని కాకుండా మానవుడు అని భావించినప్పుడే... ఓ మనిషి సత్యం, ధర్మంతో ఇలా జీవించగలడా అనే ఆలోచన వస్తుంది.


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||


పరమశివుడు పార్వతీ దేవి తో చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసిందే. శ్రీ రామ రామ రామ అని మూడు సార్లు జపిస్తే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం వస్తుందని  ఈ శ్లోకం భావం.


అదెలా అంటే కటపయాది సూత్రం ప్రకారం “య” వర్గంలో “రా” రెండవ అక్షరం కాగా “ప” వర్గం లో “మ ” ఐదవ అక్షరం రెండు * ఐదు =పది కదా , దీనిని బట్టి ఒక సారి రామ అంటే పది సంఖ్య కు సంకేతం .ఇక మూడు సార్లు జపిస్తే 10*10*10 =1000 కి సమానమవుతుంది . అందుకే పరమశివుడు అలా నిర్వచించాడట.


Also Read: 100 ప్రాంతాల మట్టి, 7 కోట్ల వ్యయం - అయోధ్యలో వెలగనున్న అతి పెద్ద దీపం ప్రత్యేకతలివే!


ఇక రాముడు జన్మించిన నవమి తిథి విషయానికొస్తే...నవమి పరమేశ్వర తత్వాన్ని సూచిస్తుంది. తొమ్మిదిని ఏం సంఖ్యతో హెచ్చించినా ఆనంబర్స్ కలిపితే మళ్లీ  తొమ్మిదే వస్తుంది. 


9*1=9


9*2=18 — 8+1 =9


9*3=27 — 2+7=9


9*4=36 — 3+6=9


9*5=45 — 4+5=9
 
దీనికి పరమాత్మ చిహ్నానికి సంబంధం ఏంటంటే..ఆయన ఎన్ని రూపాల్లో ఉన్నా ఎన్ని అవతారాలు ఎత్తినా ఎన్ని పేర్లు పెట్టుకున్నా అసలుతత్వం ఒక్కటే అని. 


Also Read: అయోధ్యలో రామమందిరంతో పాటూ ఇవన్నీ సందర్శించాల్సిన ప్రదేశాలే!