అష్టాదశ శక్తిపీఠాలు 
1.శాంకరి - శ్రీలంక
శాంకరీ దేవి మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు కాని ఒక వివరణ ప్రకారం ఇది తూర్పుతీరంలో  ట్రిన్‌కోమలీలో ఉండొచ్చుని చెబుతారు. 17వ శతాబ్దంలో  పోర్చుగీసు వారి దాడిలో ఆలయం నాశనమయ్యిందని ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉందని చెబుతారు. 


2. కామాక్షి - కాంచీపురం
కామాక్షీ దేవి ఆలయం తమిళనాడు కాంచీపురంలో ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని చెబుతారు. 


3. శృంఖల - ప్రద్యుమ్ననగరం
కోల్ కతాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రద్యుమ్ననగరం.  ఇది అమ్మవారి ఉదర భాగం పడిన ప్రదేశం.  శృంఖలాదేవిని స్థానికులు చోటిల్లామాత గా పూజిస్తారు. కోల్ కతాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా చెబుతారు.


4. చాముండి - క్రౌంచ పట్టణం 
కర్ణాటక రాష్ట్రంలో ఈ ఆలయం మైసూరు, చాముండి పర్వతాలపై  ఉంది.  అమ్మవారి కురులు ఊడి ఈపర్వతాలపై పడ్డాయని స్థల పురాణం


Also Read: ఆగష్టు 19 రాశిఫలాలు, ఈ రాశులవారు నిర్ణయాలు తీసుకునేందుకు తొందరపడకండి!


5. జోగులాంబ-అలంపూర్
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న  నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది జోగులాంబ శక్తిపీఠం.ఇది తెలంగాణ అలంపూర్ లో ఉంది. సతీదేవి పైవరుస దంతాలు, దవడ భాగం పడిన ప్రదేశం ఇది అని చెబుతారు


6. భ్రమరాంబిక - శ్రీశైలం
సతీదేవి మెడ భాగం పడిన ప్రదేశమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీశైలం. ఇక్కడే పరమేశ్వరుని ద్వాదశ జోతిర్లింగ క్షేత్రంకూడా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబికగా పూజలందుకుంటోంది


7. మహాలక్ష్మి - కొల్హాపూర్
ఆది పరాశక్తి ‘అంబాబాయి'గా  అమ్మవారు కొలువైన ప్రదేశం మహారాష్ట్రలో ఉన్న కొల్హాపూర్ . ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు.


8. ఏకవీరిక - మాహుర్యం
మహారాష్ట్ర నాందేడ్ సమీపం మాహుర్ క్షేత్రంలో కొలువైంది ఏకవీరికాదేవి. సతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల నుంచి పూజలందుకుంటోంది.


9. మహాంకాళి - ఉజ్జయిని
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో అమ్మవారు మహంకాళిగా పూజలందుకుంటోంది. ఈ ప్రదేశంలో సతీదేవి పై పెదవి ఊడిపడిందని దేవీ భాగవతంలో ఉంది. 


Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!


10.పురుహూతిక - పిఠాపురం
ఆంధ్ర ప‌్రదేశ్ లో ఉన్న మరో శక్తిపీఠం పిఠాపురంలో ఉంది. సతీదేవి పీఠబాగం పడిన చోటు కాబట్టి, ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందంటారు. ఇక్కడ అమ్మవారు పురుహూతికగా పూజలందుకుంటోంది


11. గిరిజ - ఒడిశా
ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్ లో వెలసిన అమ్మవారు గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని చెబుతారు


12. మాణిక్యాంబ -ద్రాక్షారామం
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ద్రాక్షారామంలో సతీ దేవి ఎడమ చెంప భాగం పడింది. అమ్మవారు మాణిక్యాంబగా పూజలందుకుంటోన్న ఈ ప్రదేశాన్ని  దక్షవాటిక అని కూడా వ్యవహరిస్తారు. ఇది పంచారామక్షేత్రాల్లో ఒకటి. 


13. కామరూప- గౌహతి
అసోం రాజధానికి గువాహటిలోని నీలచల పర్వతశిఖరంపై కామాఖ్యాదేవి శక్తి పీఠం ఉంది. ఇక్కడ  సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థలపురాణం.


14. మాధవేశ్వరి -ప్రయాగ
సతీదేవి కుడిచేతి వేళ్ళు పడిన  ప్రయాగలో అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రం ఉండదు. నాలుగు దిక్కులా సమానంగా కట్టన పీఠం మాత్రం ఉంటుంది.


15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం
హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు.. కేవలం జ్వాలలు మాత్రమే ఉంటాయి. ఏడుజ్వాలలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి.ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని స్థలపురాణం.


16. మంగళ గౌరి - గయ
బీహార్ లోని గయా ప్రాంతంలో సతీదేవి స్తనాలు పడినట్టు చెబుతారు. ఈ అమ్మవారే మంగళగౌరీదేవి. ఈ స్థలపురాణానికి తగినట్లుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు.


Also Read: శని ఉందని ఎలా తెలుస్తుంది, చీమలకుఆహారం వేస్తే శని బాధల నుంచి ఎందుకు విముక్తి కలుగుతుంది


17.విశాలాక్షి - వారణాసి
సతీదేవి మణికర్ణిక (చెవి భాగం) ప్రదేశం  వారణాసి. 


18.కీర్ భవాని - జమ్ముకాశ్మీర్
జమ్ముకాశ్మీర్ లో ఉన్న  అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.