హిందూ సంప్రదాయంలో ప్రతిరోజూ విశేషమైనదే. అయితే వాటిలో కొన్ని రోజులు మరింత ప్రత్యేకమైనవి. ఆ రోజంతా దైవ ప్రార్థనలో ఉండటం ద్వారా చేసిన పాపాలు నశించి పుణ్యం వస్తుందని విశ్వాసం. అలాంటి ముఖ్యమైన పర్వదినాల్లో ఒకటి అక్షయ తృతీయ. వైశాఖ మాసంలో మూడో రోజు..అంటే వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. అందుకే ఈ రోజు చేసే దాన ధర్మాలు, పుణ్యం అత్యధిక ఫలితాలనిస్తాయని చెబుతారు. పాపం చేసినా అంతే అనుకోండి. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు రోజంతా మంచిదే..ఈ రోజు దుర్ముహుర్తాలు, వర్జ్యాలు, యమగండం లాంటివి పెద్దగా ప్రభావం చూపవు. రోజు మొత్తం ఏ క్షణం ఏం చేసినా శుభఫలితాలే వస్తాయ్. ఇంకా చెప్పాలంటే త్రేతాయుగం మొదలైంది, పరశురాముడు జన్మించింది ఈ రోజనే. 


Also Read: హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, పఠిస్తే కష్టాలెందుకు తీరుతాయి
బంగారం కొనాలన్నది కేవలం ప్రచారమే...
అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలనే ప్రచారం చేస్తున్నారు. ఎంతో కొంత తప్పనిసరిగా కొనాలని అలా కొనకపోతే మహాపాపం అన్నట్టు ప్రచారం హోరెత్తిపోతోంది. దీంతో ఆ అప్పో సొప్పో చేసిమరీ బంగారం, వెండి లేదా విలువైన వస్తువులు కొనేందుకు బంగారం షాపుల ముందు ఎగబడుతున్నారు. వాస్తవానికి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. ఇదంతా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం మాత్రమే అనే అభిప్రాయాలు లేకపోలేదు.


మరో ముఖ్య విషయం ఏంటంటే  కలిపురుషుడి ఐదు నివాస స్థానాల్లో బంగారం ఒకటి, బంగారం అహంకారానికి హేతువు. అంటే కోరి కలిపురుషుడిని ఇంట్లో పెట్టుకుంటున్నారు, అహంకారాన్ని మరింత పెంచుకుంటున్నారని అర్థం అన్నమాట. అయితే బంగారం అనే ప్రస్తావన ఎందుకొచ్చిందంటే...కొనాలని కాదు దానం చేయమని. ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం కన్నా దానం చేయడం ఉత్తమం. 


Also Read: అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి
బంగారం ఇచ్చినా ఇవ్వకపోయినా కొన్ని దానాలు చేయడం వల్ల మీ పుణ్యం అక్షయం అవుతుందన్నది మాత్రం వాస్తవం అంటున్నారు పండితులు. అవేంటంటే...కొత్త కుండలో నీళ్లు పోసి దానం చేయడం, అన్నదానం, చెప్పులు-గొడుగు-వస్త్రాలు- విసనికర్రలు దానం చేయడం. ఇంకా మజ్జిగ, పానకం, పండ్లు దానం చేయడం ద్వారా మీ పుణ్యం అక్షయం అవుతుంది. అంతేకానీ పోటాపోటీగా బంగారం కొనుగోలు చేసి పెట్టుకున్నంత మాత్రాన అక్షయ తృతీయ రోజు ఈ ఇంట్లో ధనరాశులు నిండిపోతాయనే భ్రమపడొద్దంటున్నారు. ఈ రోజు లక్ష్మీదేవిని, గౌరీదేవిని పూజించి దానధర్మాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు.