Diwali 2024: జాతి, కుల, మత విభేదాలు లేకుండా అంతా సమైక్యంగా జరుపుకునే పండుగ దీపావళి. ప్రతి లోగిలి దీపాల వెలుగులతో నిండిపోతుంది. ఊరంతా పండుగ వాతావరణమే. వెతికి చూసినా చీకటి జాడ కనిపించదు. అయితే దీపాలు, విద్యుత్ కాంతుల వరకూ సరే.. బాణాసంచా కాల్చొద్దు, ప్రకృతిని కలుషితం చేయొద్దంటూ ఇప్పుడు పెద్ద హడావుడే చేస్తున్నారు. ఇంతకీ ఈ టపాసులు కాల్చడం ఎప్పటి నుంచి మొదలైంది? ఎలా మొదలైంది? ఇప్పుడెందుకు వద్దంటున్నారో తెలుసుకుందాం...
చైనా వారు తుపాకి మందు కనిపెట్టడం కన్నా ముందే భారతదేశంలో ఉపయోగించినట్టు ఆధారాలున్నాయి. ఎందుకంటే చాణక్యుడి అర్థశాస్త్రం, శుక్రాచార్యుడి శుక్రనీతి ఈ మందు గురించి ప్రస్తావన ఉంది.
తుపాకి మందు ఎలా తయారు చేయాలో భారతీయులను చూసి నేర్చుకున్నారు అరబ్బులు, పర్షియన్లు . గతంలో నాఫ్తా అనే ద్రవరూప రసాయనం పోసిన బాణాలు, ఆయుధ ప్రయోగంలో సూరేకారం వినియోగించేవారు. సూరేకారం అంటే తుపాకీ మందు. ఇలా..ఆయుధాలు తయారీకి, వాటిలో వినియోగించే మందు తయారీకి భారతీయులే ఆద్యులు. కేవలం సైనిక వేడుకల్లోనే కాదు.. పలు సందర్భాల్లో బాణాసంచా కాల్చేవారని క్రీ.శ. 7వ శతాబ్దం నాటి చైనా సాహిత్యంలో ఉంది.
Also Read: శ్మశానంలో దీపావళి - సమాధులకు నైవేద్యం , అదే ప్రసాదం!
బాణసంచా తయారీలో ముఖ్యమైనది తుపాకి మందు. అంటే సూరేకారం, గంధకం, బొగ్గు మిశ్రమం ఇది. గంధకం, బొగ్గు కలపితే మందుగుండు ఎక్కువసేపు కాలేందుకు దోహదం చేస్తుంది. ఇక సూరేకారం కళ్లు మిరిమిట్లు గొలిపే కాంతిని వెదజల్లుతుంది.
త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత సీతాదేవి, లక్ష్మణుడితో సహా అయోధ్యలో అడుగుపెట్టిన రామయ్యకు స్వాగతం పలుకుతూ దీపావళి జరుపుకున్నారు
ద్వాపరయుగంలో నరకాసుర వధ తర్వాత ప్రజలంతా ఆనందోత్సాహాలతో దీపావళి వేడుక జరుపుకున్నారు.
స్వాతంత్ర్యానికి పూర్వం బాణాసంచా కాల్చడం కేవలం రాజులవరకే పరిమితమయ్యేది. మొఘలుల కాలంలో మందుగుండు సామగ్రి కాల్చడం అంటే గొప్పగా భావించేవారు. వివాహాలు, పట్టాభిషేకాల సమయంలో క్రాకర్స్ కాల్చేవారు.
Also Read: దక్షిణావర్తి శంఖం - దీపావళి రోజు పూజించాల్సిన అత్యంత విశిష్టమైన వస్తువు ఇది!
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయ పరిశ్రమలు బాణసంచా తయారు చేయడం మొదలుపెట్టాయి. మన దేశంలో మొదటి బాణసంచా తయారీ కర్మాగారం 19 శతాబ్ధంలో కోల్‌కతాలో మొదలైంది. సోదరులు పి అయ్య నాడార్ - షణ్ముగ నాడార్ అగ్గిపెట్టె తయారీ నేర్చుకునేందుకు 1923లో పశ్చిమ బెంగాల్‌కు వెళ్లొచ్చారు. ఆ తర్వాత తమిళనాడు శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంగా మారింది.
దీపావళి పండుగ అంటే దీపాలు వెలిగించండి..బాణాసంచా వెలిగించి పర్యావరణాన్ని కలుషితం చేయొద్దు అంటున్నారు. అయితే టపాసులు కాల్చడం నిషేధించడాన్ని చాలామంది హిందూమతంపై దాడిగా భావించారు. టపాసులు వెలిగించడం హిందూ సంప్రదాయంలో భాగం అన్నారు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బాణాసంచా నిషేధించడం మంచిదే అంటున్నారు పర్యావరణ వేత్తలు, ఆరోగ్య నిపుణులు.
వ్యవసాయ ప్రధానం దేశం అయిన భారత్ లో ఆహార పంటలన్నీ శీతాకాలంలో వృద్ధి చెందుతాయి. ఈ సమయంలో కీటకాలు పంటలపై దాడి చేస్తాయి. అవే గ్రామాల్లోకి చొచ్చుకుని వచ్చి పలు రోగాలకు కారణం అవుతాయి. అలాంటి క్రిమికీటకాలను సంహరించేందుకు గంధకం వినియోగించేవారు. గాలిలో వ్యాపించిన గంధకం పొగ కీటకాలను సంహరిస్తుంది. రసాయనాలు నిండిన పొగకు దోమలు, పురుగులు నశించేవి. పండుగలో భాగంగా ఊరంతా కలసి టపాసులు కాల్చడం ద్వారా క్రిమికీటకాలను సంహరించేవారు. కానీ ప్రస్తుతం వాయుకాలుష్యంలో చిక్కుకున్న మహానగరాల్లో టపాసుల మోత మోగితే ఆనందం మాట దేవుడెరుగు అనారోగ్యం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Also Read: ధన త్రయోదశి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇలా చెప్పేయండి!
అతి సర్వత్రా వర్జయేత్
ఎందులోనూ అతి పనికిరాదు... సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు నేర్పించండి, టపాసులు కాల్పించండి..కానీ వాయుకాలుష్యం, శబ్ధకాలుష్యం మరింత విజృంభించేంతగా కాల్చకండి.