Happy Diwali Festival at Graveyard in Karimnagar District: శ్మశానవాతావరణం పగటి పూటే చూసేందుకు భయంభయంగా కనిపిస్తుంది. అలాంటి రాత్రి వేళ ఎలా ఉంటుంది..పైగా అమావాస్య రోజు. అమావాస్య అంటేనే క్షుద్రశక్తులకు బలం వస్తుందని, ఆత్మలు సంచరిస్తాయని కొందరి నమ్మకం. కానీ ఆశ్వయుజ మాస అమావాస్య ఆ ఊరి శ్మశానంలో వెలగులు విరజిమ్ముతాయి...
ఏడాదికి 12 అమావాస్యలు వస్తాయి.. వాటిలో 11 అమావాస్యల సంగతేమో కానీ ఆశ్వయుజం మాసంలో వచ్చే అమావాస్య రోజు కరీంనగర్ జిల్లా కార్ఖానగడ్డలో ఉన్న శ్మశానం విద్యుత్ కాంతులతో, బాణాసంచా వెలుగులతో కళకళలాడిపోతుంది.
Also Read: దక్షిణావర్తి శంఖం - దీపావళి రోజు పూజించాల్సిన అత్యంత విశిష్టమైన వస్తువు ఇది!
సాధారణంగా దీపావళి అంటే ఇల్లంతా పూల అలంకారం, విద్యుత్ దీప కాంతులు, దీపాలతో నిండిపోతుంది. అయితే కార్ఖానగడ్డ కాలనీలో ఇళ్లతో పాటూ శ్మశానాన్ని కూడా అలంకరిస్తారు. శ్మశానం మొత్తం లైట్లతో నింపేస్తారు. గడ్డి, పిచ్చిమొక్కలను క్లీన్ చేస్తారు. సమాధులకు రంగులేస్తారు. శ్మశానంలో ఉన్న చెట్టు , పుట్టను లైట్లతో నింపేస్తారు. అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు దీపావళి.. వాళ్లకు అదే అసలైన పండుగ..
శ్మశాసనంలో దీపావళి వేడుకలు జరుపుకోవడం వెనుక వారు చెప్పే కారణాలేంటంటే.. తమ భవిష్యత్ లో వెలుగులు నింపిన పెద్దలను , పూర్వీకులను స్మరించుకోవడం మన కర్తవ్యం. అందుకే వారి సమాధుల వద్ద దీపావళి జరుపుకుంటాం అంటారు స్థానికులు.
చనిపోయిన వాళ్లు భౌతికంగా మాత్రమే దూరమైనట్టు..వాళ్లెప్పుడూ ఒంటరి కాదు..మీరు దూరంగా వెళ్లిపోయినా మీతోనే మేమంతా ఉన్నాం అని చెప్పేందుకు శ్మశానంలో పండుగ జరుపుకుంటారు.
దీపావళికి వారం ముందు నుంచి శ్మశానాన్ని శుభ్రం చేసి, రంగులేసి,పూలు - దీపాలతో అలంకరించడమే కాదు... నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. పెద్దలకు ఏఏ పదార్థాలు ఇష్టమో అవన్నీ నివేదిస్తారు. నైవేద్యం అనంతరం ఆ పదార్థాలను ప్రసాదంగా స్వీకరిస్తారు. అప్పుడు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు.
Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!
ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజు కరీంనగర్ జిల్లా కార్ఖానగడ్డలో ఉన్న ఈ శ్మశానవాటిక జాతరగా మారిపోతుంది. దయ్యాలు, భూతాలు, ఆత్మలు ఉన్నాయంటూ భయపడేవారికి ఆ గ్రామస్తులు చెప్పే సమాధానం ఇది. ప్రేతాత్మలు, నెగెటివ్ ఎనర్జీ అనేదే ఉండదు.. వాళ్లంతా మన పెద్దలే మనకు చెడు చేయరు మంచి మాత్రమే కోరుకుంటారని చాటిచెబుతూ ఇలా శ్మశానంలో సంబరాలు చేస్తారు. పైగా దీపావళి రోజు పెద్దలను స్మరించుకుంటే వారి ఆత్మకలు శాంతి కలుగుతుందని విశ్వసిస్తారు. ఈ పద్ధతి వింతగా, కొత్తగా అనిపించినా ఇదే వారికి ఆనందం. ఇందుకోసం నగరపాలక సంస్థ కూడా ఏర్పాట్లు చేస్తుంది..జనరేటర్ల సాయంతో లైట్లు ఏర్పాటు చేస్తుంది.
Also Read: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే శనిదోషం మాయం - విధానం ఇదే!
2024 లో దీపావళి అక్టోబరు 31 గురువారం జరుపుకుంటారు. ఈ రోజు సూర్యాస్తమయం సమయానికి అమావాస్య తిథి ఉండడంతో ఇదే రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు. అమావాస్య నియమాలు పాటించేవారు, పెద్దలకు తర్పణాలు విడిచేవారు నవంబరు 01న పరిగణలోకి తీసుకుంటారు. నవంబరు 02 శనివారం నుంచి కార్తీకమాసం ప్రారంభం..